ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాష్టస్థ్రాయి ఉద్యోగులను తెలంగాణకు, అవశేష ఆంధ్రప్రదేశ్‌కు పంపిణీ చేయడానికి వీలైన మార్గదర్శకాలను రూపొందించడానికి ఏర్పడిన సిఆర్ కమలనాధన్ సంఘం వారు తేల్చిన కొత్త విషయం ఏమిటి?? ఉద్యోగులందరికీ ఐచ్ఛిక సదుపాయం-ఆప్షన్-లభిస్తోంది! తెలంగాణలో పనిచేయాలా నవ్యాంధ్రప్రదేశ్‌లో కొనసాగాలా అన్నది ఈ ఐచ్ఛిక నిర్ణయం! కమలనాథన్ సంఘం వారి నిర్ణయం అద్భుతంగా ఉందని ఆయా రాష్టస్థ్రాయి ఉద్యోగాలలోని వారు ఆనందం పారవశ్యం చెందవలసిందే! కానీ ‘స్థానికత’కు ప్రాధాన్యం ఇస్తున్నాము-అన్న నిబంధన ఈ ఆనంద పారవశ్యాన్ని ఒక్క కుదుపులో తొలగిస్తోంది!! ‘ఐచ్ఛిక నిర్ణయ’ అవకాశం ఉంది కాబట్టి తాము కోరిన రాష్ట్రంలో కొనసాగుతూ ఉండవచ్చునన్న ఆశలు చిగురించిన వారిని ‘స్థానికత’ నిలదీస్తోంది! ‘ఐచ్ఛిక నిర్ణయాన్ని’ ‘స్థానికత’ నిరాకరించవచ్చు! ‘ఐచ్ఛిక నిర్ణయాన్ని’ స్థానికత గీటురాయిపై నిగ్గుతేల్చి ఏ ఉద్యోగి ఎక్కడ ఉండాల్నదీ నిర్థారిస్తారు! అందువల్ల ఐచ్ఛిక నిర్ణయావకాశం వినియోగించుకునే వారందరి ఆకాంక్షలూ నెరవేరవు. కొందరికి మాత్రమే ఈ నెరవేరే అవకాశం ఉండవచ్చు! ‘స్థానికత’ను ‘సర్వీసు రిజిస్టర్’లోని పుట్టిన ప్రాంతం ఏడేళ్లు వరుసగా చదివిన ప్రాంతం ఆధారంగా నిగ్గు తేల్చనున్నారట! అందువల్ల ఏ రాష్ట్రంలో ఏడేళ్లు చదివిన వారికి ఆ రాష్టప్రు ‘స్థానికత’ లభించబోతోంది! ఇందుకు అనుగుణంగా ‘ఐచ్ఛిక’ నిర్ణయాన్ని ప్రకటించే ఉద్యోగులకు నిరాశ చెందే అవకాశం లేదు! ఇందుకు విరుద్ధంగా ‘ఐచ్ఛిక’ నిర్ణయాలను ప్రకటించే ఉద్యోగులకు నిరాశ ఎదురు కావచ్చు! అవశేష ఆంధ్రప్రదేశ్‌లో ‘స్థానికత’ ఉన్నవారు తెలంగాణలో పనిచేస్తామని ఐచ్ఛిక నిర్ణయం ప్రకటించవచ్చు! తెలంగాణలో ‘స్థానికత’ ఉన్న వారు అవశేష ఆంధ్రప్రదేశ్‌కు వెడతామన్న ‘ఇచ్ఛ’ను ప్రకటించవచ్చు! ఈ కోరికలు నెరవరవచ్చు, నెరవేరక పోవచ్చు కూడ! విద్య కలవానికెందును వింత లేదు, పోలనుద్యోగికిని దూరభూమి లేదు...అన్నది తరతరాల జీవన సత్యం! ఈ సత్యాన్ని అందరూ అంగీకరించి ఉండినట్టయితే ఉమ్మడి రాష్ట్రంలోని రాష్టస్థ్రాయి ఉద్యోగులను ఉభయ రాష్ట్రాలకు పంపిణీ చేయడానికి ఇంత గొప్ప ఆర్భాటం అవసరమయ్యేది కాదు! ‘దూరభూమి’కి పోవడానికి సిద్ధపడక ‘స్థానిక భూమి’ని వదలరాదన్న తపన పునర్ విభజన తరువాత ఉద్యోగుల పంపిణీ వ్యవహారం కోతిపుండును బ్రహ్మాండం చేసింది! పాలనా అనివార్యం లేదా సౌలభ్యం దృష్ట్యాను, ఉభయ రాష్ట్రాల మధ్య యాబయి ఎనిమిది, నలబయి రెండు శాతంలో పంపకం ప్రాతిపదికగాను కేంద్ర ప్రభుత్వం ఈ రాష్టస్థ్రాయి ఉద్యోగులను ఉభయ రాష్ట్రాలకు కేటాయిస్తుందన్నది కమలనాథన్ సంఘం వారి చివరిమాట! ఇందులో కొత్తదనం ఏముంది?? ‘ఐచ్ఛిక’ నిర్ణయావకాశాలు, ‘స్థానికత’ ప్రాతిపదికలు ఇవన్నీ ‘ప్రహసనం’లో వివిధ ఘట్టాలు! చివరి నిర్ణయం కేంద్ర ప్రభుత్వానిదే! అలాంటప్పుడు ఐచ్ఛిక నిర్ణయం, స్థానికత ఎందుకు? ఎందుకంటే ఏకపక్షంగా నిరంకుశంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించలేదని నిరూపించుకొనడానికి....! రాష్టస్థ్రాయి అధికారులను ఉద్యోగులను ‘స్థానికత’-లోకల్ స్టాటస్-ప్రాతిపదికగా పంపిణీ చేయడంలో ఇబ్బందులు పెద్దగా ఉండవు. ఏడేళ్లపాటు ఒక రాష్ట్రంలో చదివి ఉన్నవారికి స్థానికత ఏర్పడుతుందట! అయితే ఆ రాష్ట్రంలోని ఒకే ఊరిలోనే ఈ ఏడేళ్లపాటు చదివి ఉండాలన్న అర్ధం ప్రచారవౌతోంది! ఇది సరి అయిన భాష్యం కాకపోవచ్చు! ఒకే రాష్ట్రంలోని భిన్న భిన్న ప్రదేశాలలో ఏకబిగిన ఏడేళ్లు చదివి ఉండాలన్నది స్థానికతకు ప్రాతిపదిక కావచ్చు! ఏమయినప్పటికీ ఈ విషయంలో సందేహాలకు తావులేని విధంగా స్పష్టీకరణ ఇవ్వడం అవసరం! అలాగే విద్యా విషయకంగా ఏడేళ్ల ఎడతెగని స్థానికత లేనివారికి, ఏడేళ్ల నివాసాన్ని స్థానికతకు ప్రాతిపదికగా గుర్తించారు! ఈ విషయంలో సైతం ఏడేళ్ల ఏకబిగి నివాసం రాష్ట్రంలోని భిన్న పట్టణాలలో ఏర్పడి ఉన్నప్పటికీ దాన్ని స్థానికతగా గుర్తిస్తారన్న స్పష్టీకరణ అవసరం! మూడేళ్లు పాలమూరులోను రెండేళ్లు భాగ్యనగరంలోను మరో రెండేళ్లు వరంగల్లులోను వరసగా ఒకచోట తరువాత మరోచోట చదివిన వారికి, లేదా నివసించిన వారికి ‘తెలంగాణ’ స్థానికత రావాలి! అలాగే అమలాపురంలో ఏడాది శ్రీకాకుళంలో నాలుగేళ్లు కుప్పంలో రెండేళ్లు చదివిన వారికి లేదా నివసించిన వారికి ఆంధ్రప్రదేశ్ ‘స్థానికత’ ఏర్పడాలి! ఇలాంటి స్పష్టీకరణ లేనందువల్ల ఒక రాష్ట్రంలోని ఒకే పట్టణంలో, పల్లెలో, నగరంలో ఏకబిగిన ఏడుళ్లు చదివి ఉండాలన్న, నివసించి ఉండాలన్న అర్ధాలు చాటడానికి అవకాశం ఏర్పడింది! స్థానికత-లోకల్ స్టాటస్, స్వస్థతీయత-నేటివిటీ-అన్న మాటలకు మధ్య కమలనాథన్ కమిటీ సిఫార్సులవల్ల అంతరం స్పష్టమైంది ఒక రాష్ట్రంలో పనిచేసే రాష్టస్థ్రాయి ఉద్యోగులకు అక్కడ కొనసాగడానికి స్థానికత మాత్రమే ప్రాతిపదిక! అంటే ఏడేళ్లు నివసించి ఉండాలి, లేదా చదువుకొని ఉండాలి! సంబందిత ఉద్యోగానికి ‘నోటిఫికేషన్’ వెలువడే నాటికి ఈ ఏడేళ్లు పూర్తిఅయి ఉండాలట! అంతే కానీ ఆయా రాష్ట్రంలో పుట్టిపెరిగి ఉండనక్కరలేదు. పుట్టిపెరిగి ఉండాలన్న-స్వస్థతీయత-నిబంధనను కమలనాథన్ కమిటీ తోసిపుచ్చడం అనేకమంది ఉద్యోగులకు వెసులుబాటు కలిగిస్తోంది! ఉభయ రాష్ట్రాల సచివాలయాలలోను, రాష్టస్థ్రాయి శాఖాధిపతుల కార్యాలయాలలోను పనిచేసే ఉద్యోగులను జోనల్, జిల్లా స్థాయిలలో పనిచేసే రాష్టస్థ్రాయి ఉద్యోగులను మాత్రమే రెండు రాష్ట్రాల మధ్య పంపిణీ చేయవలసింది. ఇలాంటి వారు యాబయి ఒక్కవేలమంది ఉన్నారట! అందువల్ల ఉభయ రాష్ట్రాలలోను పనిచేస్తున్న లక్షలాది సాధారణ ఉద్యోగులకు ఈ గొడవలతో నిమిత్తం లేదు! అయితే రాష్టస్థ్రాయి శాఖాధిపతుల కార్యాలయాలలో పనిచేస్తున్న నాలుగవ తరగతి ఉద్యోగులు, డ్రైవర్లు వంటి వారి పంపిణీలో కొంత గందరగోళం ఏర్పడే అవకాశం ఉంది! వీరిని కూడ ‘ఐచ్ఛిక‘ అవకాశాల ప్రాతిపదికగాను, స్థానికత ప్రాతిపదికగాను పంపిణీ చేయడంవల్ల చివరికి పాలనా అనివార్యాలు, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు ఈ భవితవ్యాన్ని నిర్ధారించనున్నాయి! ఈ చిన్న ఉద్యోగులలో ఎక్కువమంది తమ ‘ఇచ్ఛ’కు విరుద్ధమైన రాష్ట్రానికి బదిలీ రావచ్చు!! మొత్తంమీద కమలనాథన్ సంఘం వారి సిఫార్సులు ‘పునర్‌వ్యవస్థీకరణ’ చట్టంలోని పంపిణీ సూత్రాలకు పునరుద్ఘాటనలుగా పరిణమించాయి! ఏ ఉద్యోగి ఏ రాష్ట్రానికి బదిలీ అయినప్పటికీ పదేళ్లపాటు ఉమ్మడి రాజధాని ఉంటున్నందున ఈ రాష్టస్థ్రాయి వారిలో అతి తక్కువమంది మాత్రమే వెంటనే హైదరాబాద్‌ను వదిలిపోవలసి ఉంటుంది. ఇలా వదలవలసి వచ్చే వారిలో కొంత శాతం మామ్రే తమ‘ఐచ్ఛిక’నిర్ణయానికి విరుద్ధంగా బదిలీకి గురి కావచ్చు!! ఒకటి రెండేండ్లు మాత్రమే ‘సర్వీసు’ ఉన్నవారిని నిర్నిబంధంగా వారు కోరినచోటనే ఉంచడం మానవీయతా దృష్టికి నిదర్శనం కాగలదన్న వాదం కూడ ఉంది! ఇలాంటి వారు ఎక్కువగా హైదరాబాద్‌లోనే ఉన్నారు కాబట్టి వారి సేవలను ఏ రాష్ట్రం పొందినప్పటికీ వారు హైదరాబాదును వదలనక్కరలేదు! ఎలాగూ రెండు మూడేళ్ల తరువాత కాని రాజధానులు భిన్న ప్రదేశాలలో ఏర్పడవు!! నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం అయ్యేనాటికి హైదరాబాద్‌ను వదిలి వెళ్లవలసిన అసౌకర్యానికి గురైన వారిలో చాలామంది సేవా విరమణ చేసి ఉంటారు!

మరింత సమాచారం తెలుసుకోండి: