ఎన్నికల ముందు కాంగ్రెస్ లోని ముసలి,ముతక సరుకువైపు జగన్ కన్నెత్తి కూడా చూడలేదు. కొత్త వాళ్లను రాజకీయాల్లోకి తీసుకొచ్చినట్టూ ఉంటుంది... నూతన నాయకులను ఆవిష్కరించినట్టుగానూ ఉంటుందన్నట్టుగా కాస్తంత సత్తా ఉన్న చాలా మంది కొత్తవాళ్లకు టికెట్లను కేటాయించాడు. తన పార్టీ తరపున ఎవరు పోటీ చేసినా వాళ్ల సత్తాతో కాదు.. తన పార్టీకి ఉన్న ఇమేజ్ తో, తండ్రి నేపథ్యంలో ఉన్న ఇమేజ్ తో గెలుస్తారనేది జగన్ లెక్క! ఈ లెక్క అన్ని చోట్లా వర్కవుట్ కాలేదు కానీ.. కొన్ని చోట్ల వర్కవుటయ్యింది. అనామకులు అయిన వాళ్లను ఎంపీలుగా గెలిపించింది. వ్యక్తిగతంగాఎప్పుడూ ప్రజా జీవితంలో లేని వ్యక్తులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఏకంగా ఎంపీలుగా గెలిచేశారు! కొత్తపల్లిగీత, బుట్టారేణుక లాంటి వాళ్లంతా ఇదే క్యాటగిరీ. వీళ్ల దగ్గర వ్యాపారాల ద్వారా సంపాదించిన డబ్బు ఉంటే ఉండుందేమో కానీ... ఏనాడూ వీళ్ల పేర్లు ప్రజల్లో నానినవి కాదు! ఎన్నికల నామినేషన్ కార్యక్రమం మొదలయ్యే వరకూ కూడా వీళ్లు ప్రజలకు తెలియనివాళ్లు. వీళ్లను చూసి ఓటేసే పరిస్థితి ఏ మాత్రం లేదు. పార్టీ కి అనుకూల పరిస్థితి ఉన్న నియోజకవర్గాల్లో పోటీ చేసిన వీళ్ల తెలుగుదేశం హవా మధ్యన కూడా విజయం సాధించారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఏ పార్టీలోనైనా ఎంపీ క్యాండిడేట్లు పార్టీ ఇమేజ్ తో మాత్రమే గెలుస్తారు. ఎంపీలకు ప్రజలతో ఎప్పటకీ ప్రత్యక్ష సంబంధాలు ఉండే అవకాశాలు లేవు. ఇక కొత్త పార్టీ అయిన వైకాపాలో.. ఈ కొత్త నేతలకు వ్యక్తిగత ఇమేజ్ కు అవకాశమే లేదు. మరి ఇలాంటి నేతలు ఇప్పుడు పార్టీని వీడటం వల్ల సంఖ్యాపరంగా అయితే వైకాపాకు ఎదురుదెబ్బే. గెలిచిన ఎనిమిది మందిలో ఇద్దరు బయటకు వెళ్లిపోవడంతో ఇక మిగిలింది ఆరు మందే. వీళ్లలో ఇక ఒకరో ఇద్దరో తోకలు జాడించే అవకాశాలు లేకపోలేదు. మరి ఇప్పుడు జగన్ గ్రహించాల్సిన నీతి ఏమిటంటే.. ఏమాత్రం వ్యక్తిగత రాజకీయ నేపథ్యం లేని వాళ్లను గెలిపించుకొంటే..వాళ్ల జంపింగ్ కు అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. జగన్ కు మాత్రమే కాదు.. ప్రతిపక్షంలో ఉన్న ఏ ఒక్కరికైనా తప్పనిసరి పరిస్థితి ఇది!

మరింత సమాచారం తెలుసుకోండి: