శల్యసారథ్యం అనే పదం వినే ఉంటారు. మహా భారత యుద్ధ సమయంలో శల్య మహారాజును మొదట దుర్యోధనుడు వచ్చి తమవైపు పోరాడమంటాడు. ఆయన ఓకే అంటాడు. తర్వాత ధర్మరాజు వచ్చి సాయం అడుగుతాడు. అయ్యో ఇప్పటికే దుర్యోధనుడికి మాట ఇచ్చాను కాబట్టి వాళ్ల వైపే ఉంటా.. కానీ నువ్వు ధర్మానికి ప్రతినిథివి కాబట్టి.. నీకు మేలు జరిగేలా చూస్తా... వాళ్లవైపే ఉండి.. వాళ్ల నాశనం జరిగేలా చూస్తా అని అభయమిస్తాడు. ఇప్పుడు అరకు ఎంపీ కొత్తపల్లి గీత పరిస్థితి అలాగే ఉంది. జగన్ పార్టీ తరపునుంచి గెలిచి పట్టుమని మూడు నెలలు కూడా కాకుండానే ఆమె అసంతృప్త నేతగా మారిపోయారు. సొంత పార్టీలోనూ ఉంటూ.. పార్టీపై ఘాటుగా విమర్శలు చేస్తోందీ కొత్తపల్లి గీత. అంతకు ముందు చంద్రబాబుతోనే రాష్ట్రప్రగతి జరుగుతుందని కుండ బద్దలు కొట్టిన ఈ ఎంపీ.. ఇప్పుడు వైకాపాలో మహిళలకు అవమానాలు జరుగుతున్నాయని కొత్త పల్లవి అందుకున్నారు. తాను పార్టీకి దూరంగా ఉండటం లేదని.. పార్టీ నేతలే తను దూరం పెడుతున్నారని మండిపడ్డారు. తానే కాదు.. ఇంకా చాలామంది మహిళానేతలు అవమానాలు ఎదుర్కొంటున్నారట. పార్టీపై బహిరంగంగా మాట్లాడుతున్న తనకు ఫోన్ చేసి అభినందిస్తున్నారట. విమర్శల రేంజ్ పెంచిన ఈ అమ్మడు టీడీపీ నేత చంద్రబాబుతోనూ భేటీ అయ్యారు. ఇంకేం పార్టీ మారుతున్నారా అంటే.. అబ్బే మా ప్రాంత అభివృద్ధి కోసమే బాబును కలిశా అని మరో జలక్ ఇచ్చారు. పోనీ అలాగని పార్టీ మారతారా.. అంటే అబ్బే ఆ ఉద్దేశ్యమే లేదంటున్నారు కొత్తపల్లి గీత.. అంతే కాదు. జగన్ పిలిస్తే వెళ్లి మాట్లాడతా అని మనసులో మాట చెప్పారు. ఈమే ఇలాగుంటే.. మరి వాళ్ల బాస్ జగన్ సంగతి అందరికీ తెలిసిందే. పంతం పట్టింపు వస్తే... ఎలాంటి పరిణామాలను లెక్క చేసే మనిషి కాదు. మరి అలాంటిది ఇన్ని బహిరంగ విమర్శలు చేసిన తర్వాత.. జగన్ పిలిచి గీతతో మాట్లాడతారా.. కష్టమే.. కానీ చూస్తూ.. చూస్తూ.. ఓ ఎంపీని దూరం చేసుకుంటారా అన్నది మరో ప్రశ్న. గీత వ్యవహారం చూస్తే.. వైకాపాలో కొనసాగే సూచనలు ఎంత మాత్రమూ కనిపించడం లేదు. ఈ గీత.. లక్ష్మణ గీత దాటినట్టే.

మరింత సమాచారం తెలుసుకోండి: