మన్నెంవీరుడు అల్లూరి సీతారామరాజు పేరుతో ఏపీలో కొత్త జిల్లా ఏర్పడబోతోంది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు.. కొత్తగా తెలంగాణ నుంచి వచ్చి చేరిన మండలాలను కలుపుకోని అల్లూరి జిల్లాను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ జిల్లా ఏర్పాటు వెనుక.. చాలా కారణాలున్నాయి. మన్నెం వీరుడిని ఘనంగా గౌరవించినట్టు అవుతుందన్నది మొదటి. అంతే కాకుండా ఉభయ గోదావరి జిల్లాల్లోని ఏజెన్సీ మండలాలను ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తే పాలనా సౌలభ్యంగా ఉంటుందనేది రెండోది. తెలంగాణ నుంచి వచ్చిన 7 మండలాలు.. ఇప్పటికే కొన్ని తూర్పుగోదావరిజిల్లాలో... మరికొన్ని పశ్చిమ గోదావరి జిల్లాలో కలిశాయి. వీరికి ఆయా జిల్లా కేంద్రాలు చాలా దూరం. కొత్త జిల్లా ఏర్పాటుతో ఆ సమస్య తీరిపోతుందనేది ఓ ఆలోచన. వీటన్నిటికంటే మరో ప్రధానమైన కారణం.. పోలవరం నిర్మాణం. ఈ బృహత్ నిర్మాణానికి చెందిన భూములన్నీ ఈ రెండు జిల్లాల పరిధిలోనే ఎక్కువగా ఉన్నాయి. పోలవరం కోసం భూసేకరణ, నిర్వాసితులకు పరహారం పంపిణీ, పునరావాస కార్యక్రమాలు చాలా చేయాల్సి ఉంటాయి. అలాంటిది వేరు వేరు జిల్లాల్లో ఉండటం కన్నా.. ఒకే జిల్లాగా ఉంటే పాలనాపరంగా సౌలభ్యంగా ఉంటుంది. ఇన్ని కారణాలతో తెలుగువారి విప్లవ స్ఫూర్తి అల్లూరి సీతారామరాజు పేరుతో జిల్లా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రవిభజన నేపథ్యంలో పాలనా సౌలభ్యం కోసం జిల్లాలను పునర్వవస్తీకరించాలని ఇప్పటికే ప్రభుత్వం యోచిస్తోంది. కొన్ని కొత్తజిల్లాలు రాబోతున్నాయి. ఆ పరంపరలోనే అల్లూరి జిల్లా దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటి వరకూ ఏపీ జిల్లాల్లో ఇలా నాయకుడి పేరు మీద ఉన్న జిల్లాలు మూడు.. ఒకటి ప్రకాశం జిల్లా. రెండోది వైఎస్సార్ కడప జిల్లా, మూడోది శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా. ఐతే.. కడప, నెల్లూరు జిల్లాల ముందు ఆ నాయకుల పేర్లు నామమాత్రంగానే మారిపోయాయి. జనం నోళ్లలోకి మాత్రం ఇంకా వెళ్లడం లేదు. కానీ ఈ కొత్త జిల్లా ప్రకాశం జిల్లా తరహాలోనే ప్రజల నాలుకలపై నాట్యం చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: