హైదరాబాద్ లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మెట్రో రైలుకు పవర్ కష్టాలు పొంచి ఉన్నాయి. మెట్రో నిర్వహణలో భారీగా కరెంట్ అవసరం కానుంది. దేశంలో ఎక్కడా లేని కాంటిలీవర్ ఎలివేటెడ్ డిజైన్ లో మెట్రో స్టేషన్ల నిర్మాణం చేపట్టింది ఎల్ అండ్ టీ. పూర్తిస్థాయిలో మెట్రో సేవలు అందుబాటులోకి వస్తే అవసరమయ్యే కరెంట్ పై ప్రభుత్వానికి రిపోర్ట్ అందజేశారు కంపెనీ అధికారులు. మూడు కారిడార్లలో పూర్తికావస్తోన్న మెట్రో రైలు ప్రాజెక్టుకు పవర్ ఎలా అన్నదే పెద్ద సమస్యగా మారింది. ప్రాజెక్టు ప్రారంభమైన మొదటి సంవత్సరం మెట్రో నిర్వహణ కోసం 520 లక్షల యూనిట్ల విద్యుత్ అవసరమౌతుందని ఎల్ అండ్ టీ అంచనా వేసింది. వచ్చే పదేళ్లనాటికి 6,870 లక్షల యూనిట్లకు విద్యుత్ అవసరాలు పెరుగుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే మొదటి దశ మెట్రో నిర్మాణం పనులు పూర్తికావస్తున్నాయి. మిగతా రెండు దశల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి కరెంట్ అవసరాలపై ఓ క్లారిటీకి రావాలని ప్రభుత్వం భావిస్తోంది. మెట్రో రైలును ప్రత్యేక కేటగిరీగా గుర్తించి.. విద్యుత్ ధరలను ప్రత్యేకంగా నిర్ణయించాలని అంటున్నారు ఎల్ అండ్ టీ అధికారులు. ఢిల్లీ తరహా ప్రత్యేక కేటగిరిని అమలు చేయాలని కోరుతున్నారు. ప్రత్యేక కరెంట్ ధరల నిర్ణయంపై ప్రభుత్వం, మెట్రో అధికారులు చర్చలు జరుపుతున్నారు. మెట్రో అవసరాలకు అనుగుణంగా బడ్జెట్ లో నిధులు కేటాయించాలని ప్రభుత్వం భావిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: