కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ వ్యవహారం సర్కార్ కు తలనొప్పిగా మారింది. హామీ ఇవ్వనైతే ఇచ్చింది కాని, ఎలా అమలుచేయాలనే దానిపై తర్జన భర్జన పడుతోంది. అన్ని శాఖల ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడంతో ఆ ఉద్యోగాల భర్తీ అనివార్యమైంది. అయితే అమలుకావాలంటే…అనేక న్యాయపరమైన అడ్డంకులను దాటాల్సి ఉంది సర్కార్. అందుకే రెగ్యులరైజ్ అంశంపై న్యాయాన్యాయాలు అధ్యయనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక కాంట్రాక్టు పోస్టును రెగ్యులర్ చేయాలంటే ఆ పోస్టుకు సంబంధించిన అన్ని రూల్సు పాటించాల్సి ఉంటుంది. నిజానికి 2003లో విడుదలైన జీవో 94 ప్రకారం రోస్టర్, కనీస విద్యార్హతలు తప్పనిసరి చేశారు. ఇప్పటికే ఈ నిబంధనలు పాటించి కాంట్రాక్టు సర్వీసులోకి తీసుకున్నవారిని నేరుగా రెగ్యులర్ చేయవచ్చా? లేకపోతే, నోటిఫికేషన్ విడుదల చేసి పరీక్ష నిర్వహించాల్సి ఉంటుందా? అనే డైలమాలో పడింది సర్కార్. పరీక్ష నిర్వహిస్తే కాంట్రాక్టు ఉద్యోగులకు వెయిటేజి ఇవ్వాల్సి ఉంటుంది. వయోపరిమితి సడలింపు ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికే అనేక పోస్టుల భర్తీ విషయంలో రూల్సు పాటించలేదనే ఆరోపణలున్నాయి. దీంతో నేరుగా కాంట్రాక్టు ఉద్యోగిని రెగ్యులరైజ్ చేస్తే న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే ఓ వైపు కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ అంశంపై నిరుద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. టీపీఎస్సీ ఏర్పాటుచేసి వేలాది ఖాళీ పోస్టులను భర్తీ చేసి నిరుద్యోగులను శాటిస్ ఫై చేయాలని సర్కార్ యోచిస్తోంది. అలాగే దశలవారిగా సాధ్యమైనన్ని కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యలర్ చేయాలని ప్రభుత్వం డిసైడయినట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: