మింగ మెతుకు లేదు.. మీసాలకు సంపెంగ నూనె.. అనేది సామెత. ఇప్పుడు ఈ సామెతను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవహారాలకు అన్వయించవచ్చనిపిస్తోంది! ఎందుకంటే.. అసలే విభజనతో పీకలోతు కష్టాల్లో కూరుకుపోయిన ఆర్థిక వ్యవస్థతో వాళ్లు కొత్త గేమ్స్ ప్లాన్ చేస్తున్నారు. జాతీయ క్రీడలు నిర్వహిస్తామని అంటూ ఆడంబరాలకు పోతున్నారు! వచ్చే జాతీయ క్రీడల నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ పోటీ పడుతోందట. ఇప్పటికేఈ క్రీడల నిర్వహణ విషయంలో ఆసక్తితో ఉన్న గోవా తో ఏపీ పోటీ పడుతోందట.. ఈ విషయాన్ని చాలా గొప్పగా చెప్పుకొంటున్నాడు ఆంధ్రప్రదేశ్ క్రీడా శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. ఎలాగైనా జాతీయ క్రీడల నిర్వహణకు ఏపీని వేదికగా మారుస్తామని ఆయన అంటున్నాడు! ఇప్పుడు ఎందుకు? అంటే.. జాతీయ క్రీడల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం పదిహేనువేల కోట్ల రూపాయలు ఇస్తుందని.. ఆ డబ్బు ద్వారా సీమాంధ్ర అభివృద్ధి చెందుతుందని ఆయన అంటున్నాడు. మరి సీమాంధ్రలోని ఏ ఒక్క నగరంలోకూడా సరైన స్టేడియంలు లేవు. ఉన్నది విశాఖ స్టేడియం ఒక్కటే! అది కూడా క్రికెట్ స్టేడియం. జాతీయ క్రీడల్లో క్రికెట్టే లేదు! ఇలాంటి తరుణంలో కేంద్రం ఇచ్చే పదిహేనువందల కోట్లు ఏ మూలకు సరిపోతాయి? ఏ క్రీడా ప్రాంగణాలు నిర్మించడానికి ఉపయోగడపతాయి? అభివృద్ధి జరుగుతుందనే కబుర్లు చెబుతూ.. ఇలాంటి ఆడంబరాలకు పోయి.. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు మరింత భారాన్ని పెట్టే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉన్నారు. గోవా వంటి పుష్కలమైన ఆర్థికవనరులతో ఉన్న రాష్ట్రం అయితే ఇలాంటి క్రీడలను దర్జాగా నిర్వహించుకోగలదు కానీ.. ఇప్పుడు ఏపీకి అంత ఆర్భాటం అవసరమా? అనిపిస్తోంది! మరి ఏం చేస్తారో చూడాలి!

మరింత సమాచారం తెలుసుకోండి: