బగ్గింగ్‌ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జెపిసి) దర్యాప్తు జరగాల్సిందేనని, దీని వల్లనే ఈ వ్యవహారంలో నిజానిజాలు నిగ్గు తేలుతాయని పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి. కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ నివాసంలో బగ్గింగ్‌ పరికరాలు లభ్యమైన విషయం మరోమారు పార్లమెంట్‌ను కుదిపివేసింది. ప్రతిపక్షాలు దర్యాప్తునకు పట్టుపట్టగా, మరోవైపు ఇది అసలు సమస్యే కాదని, బగ్గింగ్‌ జరగలేదని మంత్రి చెపుతున్నందున దీనిపై దర్యాప్తు ప్రసక్తే లేదని మరోవైపు అధికార పక్షం స్పష్టం చేసింది. దీనితో పార్లమెంట్‌లో దీనిపై ప్రతిష్టంభన మరింత జటిలం అయింది. గత కొద్ది రోజులుగా బగ్గింగ్‌ అంశం ఇటు పార్లమెంట్‌లోనూ, వెలుపల కూడా తీవ్ర స్థాయి చర్చనీయాంశంగా మారింది. లోక్‌సభ, రాజ్యసభలలో ఈ అంశాన్ని ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో ప్రస్తావించాయి. కాంగ్రెస్‌ సభ్యులు ఈ అంశంతో ప్రభుత్వం ఎంతటి దూకుడు చర్యలకు పాల్పడుతున్నదనేది వెల్లడవుతోందని విమర్శించారు. గుజరాత్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలపై జరిగినట్లుగానే ఇప్పుడు కేంద్రంలోని మంత్రివర్గ సభ్యులపైనా, ఎంపీలపైనా నిఘా చర్యలు సాగుతున్నాయని, ఇది అత్యంత దారుణమైన విషయమని పేర్కొన్న కాంగ్రెస్‌ సభ్యులు నినాదాలకు దిగారు. ' మోడీ మాడల్‌ నహీ చలేగా' 'జెపిసి ఏర్పాటు కావాల్సిందే' అంటూ నినాదాలతో సభను దద్దరిల్ల చేశారు. రాజ్యసభలో కాంగ్రెస్‌ ఉప నాయకుడు ఆనంద్‌ శర్మ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రభుత్వం ఇప్పుడు వ్యక్తిగత జీవితాలలోకి ప్రవేశిస్తోందని, ఫోన్ల ట్యాపింగ్‌లకు దిగుతోందని, అసలు దేశంలో ఎవరికైనా వ్యక్తిగత స్వేచ్ఛ ఉందా? అనే అనుమానాలు వస్తున్నాయని విమర్శించారు. భారీ స్థాయిలో ట్యాపింగ్‌కు దిగుతున్న ప్రభుత్వం అనైతిక చర్యలను అంతా ఖండించాల్సిందే అన్నారు. బగ్గింగ్‌ను ఎవరు అనుమతించారు అనేది తేలాల్సి ఉందని ఆయన నిలదీశారు. ప్రశ్నోత్తరాల సమయంలోనూ, జీరో అవర్‌లోనూ బగ్గింగ్‌ వ్యవహారంతో తలెత్తిన గందరగోళంతో సభలు రెండు సార్లు వాయిదా పడ్డాయి. బగ్గింగ్‌పై పూర్తి స్థాయి దర్యాప్తు తప్ప ఇతరత్రా సమాధానాలతో ఒరిగేదేమీ లేదని కాంగ్రెస్‌ సభ్యులు స్పష్టం చేశారు. సభలో దీనిపై సమగ్రంగా చర్చ జరగాల్సిందేనని చెప్పారు. లోక్‌సభలో కాంగ్రెస్‌ నేత మల్లిఖార్జున ఖర్గే ఈ అంశంపై ఆందోళన వ్యక్తం చేశారు. గుజరాత్‌లో దాదాపు 29వేల మంది ఫోన్ల ట్యాపింగ్‌ జరిగిందని, ఇదే తరహాలో ఇప్పుడు కేంద్ర మంత్రులపై, ఎంపీలపై కూడా నిఘాకు దిగుతున్నారని విమర్శించారు. సభకు ప్రధాని నరేంద్ర మోడీ వచ్చి, దీనిపై ప్రకటన చేయాలని, జాతికి నమ్మకం కల్గించాలని తెలిపారు. ఎందరు మంత్రులు, ఎంపీలు, అధికారులపై స్నూపింగ్‌ జరుగుతున్నదనేది వెల్లడి కావాల్సిందేనని చెప్పారు. స్నూపింగ్‌ జరగలేదని చెప్పగలిగే ధైర్యం ప్రభుత్వానికి ఉందా? అని ప్రశ్నించారు. అయితే దీనిపై ఎలాంటి దర్యాప్తునకు అనుమతించేది లేదని, బగ్గింగ్‌ వార్తనే తప్పని తెలిసినప్పుడు, మంత్రి కూడా దానిపై వివరణ ఇచ్చినప్పుడు ఇక దీనిపై దర్యాప్తు అవసరం ఏముంటుందని లోక్‌సభలో ప్రభుత్వం తరఫున హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రతిపక్షాల వాదనను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. పత్రికలలో వచ్చిన వార్తలను పెద్దగా పట్టించుకోవద్దని, అందులో నిజాలు ఏమీ లేవని తెలిపారు. కాంగ్రెస్‌ సభ్యులు బగ్గింగ్‌ వివాదం గురించి ప్రస్తావించిన సమయంలో సభలో వివాదానికి కేంద్ర బిందువు అయిన మంత్రి నితిన్‌ గడ్కరీ కూడా ఉన్నారు. ఆయన దీనిపై సభలో ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఓ దశలో పార్లమెంట్‌లో కాంగ్రెస్‌కు చెందిన ప్రమోద్‌ తివారీ బగ్గింగ్‌ వ్యవహారంపై చర్చకు నోటీసు ఇచ్చారు. ప్రభుత్వం దీనిపై చర్చకు ఎందుకు జంకుతోందని నిలదీశారు. కాంగ్రెస్‌ చీఫ్‌విప్‌ సత్యవ్రత్‌ చతుర్వేది కూడా ఆయన వాదనను బలపర్చారు. చర్చకు వీల్లేదని సభాధ్యక్షులు నోటీసును తోసిపుచ్చారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు ప్రభుత్వం చర్చకు భయపడే ప్రసక్తే లేదని, అయితే సంబంధిత మంత్రి దీనిపై వివరణ ఇచ్చినందున, బగ్గింగ్‌ జరగలేదని చెప్పినందున ఇక చర్చకు అవకాశమే లేదని నాయుడు స్పష్టం చేశారు. అయితే దర్యాప్తు జరగాల్సిందే, ముందుగా చర్చకు ప్రభుత్వం దిగిరావాల్సిందేనని కాంగ్రెస్‌ సభ్యులు పట్టుపట్టారు.  రాజ్యసభలో పరిస్థితిని చక్కదిద్దేందుకు సభాధ్యక్ష స్థానంలో ఉన్న ఉప సభాధ్యక్షులు పిజె కురియన్‌ ప్రయత్నించారు. సభ్యులు పద్దతి ప్రకారం వ్యవహరించాలని కోరారు. కల్పిత కథలకు, వాస్తవికతకు చాలా తేడా ఉంటుందని హోంమంత్రి బగ్గింగ్‌ వ్యవహారంపై సమగ్ర ప్రకటన చేస్తారని, ఇతర కార్యక్రమాలు సాగడానికి అనుమతించాలని రాజ్యసభలో సీనియర్‌ మంత్రి అరుణ్‌ జైట్లీ సభ్యులకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ట్యాపింగ్‌లు, బగ్గింగ్‌లతో అనధికారిక నిఘాకు పాల్పడుతోందని, అందరిని భయభ్రాంతులను చేస్తోందని, ఇదెక్కడి న్యాయం? అని కాంగ్రెస్‌ సభ్యుడు అశ్వనీ కుమార్‌ నిలదీశారు. కాంగ్రెస్‌ సభ్యులు బగ్గింగ్‌ వ్యవహారం ప్రస్తావించిన సమయంలో గుజరాత్‌లో జరిగిన పరిణామాలను ప్రస్తావించారు. అక్కడ స్నూపింగ్‌ వ్యవహారం చర్చకు దారితీసిందని, ఏకంగా కమిషన్‌ ఏర్పాటు జరిగిందని, గుజరాత్‌లో వేల కొద్ది ఫోన్ల ట్యాపింగ్‌ జరిగిందని ఓ పోలీసు అధికారి స్వయంగా అఫిడవిట్‌ కూడా ఇచ్చారని సభ్యులు తెలిపారు. అయితే ఇవన్నీ కట్టుకథలని, బగ్గింగ్‌ జరగనప్పుడు ఇక దానిపై దర్యాప్తునకు వీలేలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: