న్యాయ వ్యవస్థ గాడి తప్పుతోంది. న్యాయమూర్తుల నియామకాల్లో బడా రాజకీయ నేతలు పెత్తనం చెలాయిస్తున్నారు. దీంతో పవిత్రంగా ఉండాల్సిన న్యాయ వ్యవస్థను రాజకీయ నేతలు అపవిత్రం చేస్తున్నారు. న్యాయ వ్యవస్థలో నెలకొన్న లోపాల్ని సవరించే పేరుతో.. కార్యనిర్వాహక వ్యవస్థ రూపంలో ఉన్న రాజకీయ నేతలు ఏకంగా ఆ వ్యవస్థపైనే పెత్తనం చెలాయించేందుకు పావులు కదుపుతున్నారు. న్యాయ వ్యవస్థ పరువు కూడా మసకబారుతోంది. నిష్పాక్షికంగా జరగాల్సిన ఉన్నత న్యాయస్థానాల న్యాయమూర్తుల నియామకాలపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. ఇందుకోసం ఏర్పాటు చేసిన కొలీజియం వ్యవస్థపైనా రాజకీయ నేతలే పెత్తనం చేస్తున్నారనే విషయం దిగ్ర్భాంతి కలిగిస్తోంది. ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకం వివాదాస్పదం అవుతోంది. తమ ప్రమేయం లేకుండా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి నాయకత్వంలోని కొలీజియం జరుపుతున్న ఈ నియామకాలకు మంగళం పాడేందుకు కేంద్ర ప్రభుత్వం చురుగ్గా పావులు కదుపుతోంది. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్, సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ ఇటీవల.. వెల్లడించిన విషయాలు ఈ విషయంలో ప్రభుత్వానికి ఆయుధంగా దొరికాయి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి అశోక్ కుమార్ పదవీ కాలాన్ని రెండు సార్లు పొడిగించడం, తర్వాత ఆయన్ని శాశ్వత న్యాయమూర్తిగా సిఫార్స్ చేయడం వెనక అప్పటి కొలీజియం సభ్యులపై యూపీఏ ప్రభుత్వం ఒత్తిడి తెచ్చిందని కట్జూ ఆరోపించారు. జస్టిస్ అశోక్ కుమార్ అవినీతి తెలిసినా అప్పట్లో వరసగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా వ్యవహరించిన జస్టిస్ ఆర్సీ లహోటీ, జస్టిస్ వైకే సభర్వాల్, జస్టిస్ కేజే బాలకృష్ణన్ యూపీఏ ప్రభుత్వ ఒత్తిడికి లొంగి పోయారన్నది జస్టిస్ కట్జూ ఆరోపణ. ఇంటెలిజెన్స్ బ్యూరో కూడా ఆ న్యాయమూర్తిపై వచ్చిన ఆరోపణల్ని ధృవీకరించిందన్నారు. జస్టిస్ కట్జూ ఆరోపణలతో దేశం విస్తు పోయింది. ఇప్పటి వరకు ఏదో కొద్ది పాటి విమర్శలున్నా.. సుప్రీం కోర్టు + హైకోర్టుల న్యాయమూర్తుల నియామకాలు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి నాయకత్వంలోని కొలీజియమే చేస్తోంది. కార్యనిర్వాహక వర్గానికి ప్రమేయం లేకుండా జరుగుతున్న ఈ నియామకాలన్నీ స్వేచ్ఛగానే జరుగుతున్నాయని అందరూ నమ్మారు. జస్టిస్ కట్జూ వెల్లడించిన విషయాలతో కొలీజియంపైనా ప్రభుత్వం పెత్తనం చేస్తోందనే విషయం స్పష్టమైపోయింది. దీంతో అవినీతి ఆరోపణలున్న మంత్రిని కొనసాగించేలా డీఎంకే.. యూపీఏ ప్రభుత్వంపై ఒత్తిడి చేసిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జస్టిస్ కట్జూ నేరుగా డీఎంకే పేరు చెప్పక పోయినా ఆ పార్టీ ఒత్తిడి వలనే మన్మోహన్ సింగ్ ప్రభుత్వం సుప్రీం కోర్టు కొలీజియం మీద ఒత్తిడి తెచ్చిందన్నారు. ఈ ఉదంతంతో పాటు ఇటీవల మోడీ సర్కార్ తీసుకున్న ఒక నిర్ణయం కూడా న్యాయ వ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తిపై అనుమానాలు కలిగిస్తోంది. సీనియర్ న్యాయవాది, మాజీ సొలిసిటర్ జనరల్ గోపాల సుబ్రమణ్యం పేరును సుప్రీం కోర్టు కొలీజియం.. సుప్రీం కోర్టు న్యాయమూర్తి పదవికి సిఫార్స్ చేసింది. కేంద్రం ప్రభుత్వం ఇందుకు నిరాకరించడంతో గోపాల సుబ్రమణ్యం.. అసలు తన పేరు పరిశీంచ వద్దని చెప్పి తప్పుకున్నారు. కట్జూ ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం మరోసారి జడ్జిల నియామక కమిషన్ బిల్లును తెరమీదకు తెచ్చింది. పార్టీలు, ప్రముఖ న్యాయకోవిదుల అభిప్రాయాలు తీసుకుని బిల్లును ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే తీసుకొస్తామని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రకటించారు. యూపీఏ హయాంలో ప్రెస్ కౌన్సిల్ ఛైర్మన్ గా నియమితుడయిన సుప్రీం మాజీ జడ్జి జస్టిస్ మార్కండేయ కట్జు కేంద్ర ప్రభుత్వం మార్పుతో కొత్త ప్రభుత్వాన్ని కాకా పట్టే పనిలో పడ్డారా? ఎప్పుడో పదేళ్ళ నాటి జడ్జి నియామకపు అవకతవకల్ని ఆయన ఇప్పుడు తవ్వి తీస్తుండడంతో ఈ అనుమానం కలుగుతోంది. డి.ఎం.కె ఒత్తిడికి లొంగిన యు.పి.ఏ ప్రభుత్వం అవినీతి జడ్జికి రెండు సార్లు పొడిగింపు ఇచ్చి... తర్వాత ఏకంగా ఆయన్ని శాశ్వత న్యాయమూర్తిగా నియమించి వేరే హైకోర్టుకు బదిలీ చేసిందని కట్జు తాజాగా ఆరోపించారు. పనిలో పనిగా తమిళనాడు ప్రస్తుత ముఖ్యమంత్రి జయలలిత ఏనాడూ కోర్టు విధుల్లో జోక్యం చేసుకోలేదని ఓ సర్టిఫికేట్ పడేశారు. దీంతో కట్జూ నిజాయితీపైనా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. భారత్ లోనే ఈ వ్యవస్థ మన దేశంలో తప్ప ప్రపంచంలో మరే ప్రజాస్వామ్య దేశంలో న్యాయమూర్తుల్ని న్యాయమూర్తులే నియమించుకునే వ్యవస్థ లేదు. న్యాయ వ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తి పేరుతో కార్య, శాసన నిర్మాణ వ్యవస్థల్ని పక్కన పెట్టి మరీ న్యాయ వ్యవస్థ ఈ అధికారాన్ని దక్కించుకుంది. అధికారం లేక హక్కును వినియోగించే సమయంలో పాలకులు మరింత సంయమనం పాటించాలి. కొత్త ప్రధాని నరేంద్ర మోడీ సర్కారు గతం నుంచి కొనసాగుతున్న ప్రభుత్వ విధానాలను సంస్కరించే ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు కనిపిస్తోంది. అందులో భాగంగా కొన్ని సందర్భాల్లో దూకుడుగాను, కొన్ని సందర్భాల్లో ఆచితూచి వ్యవహరిస్తున్నప్పటికీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి నియామకం విషయంలో ఏకపక్షంగా వ్యవహరించిందన్న అపవాదు మూటగట్టుకుంది. మాజీ సొలిసిటర్‌ జనరల్‌, సీనియర్‌ న్యాయవాది గోపాల్‌ సుబ్రమణ్యంను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించడానికి మోడీ ప్రభుత్వం అంగీకరించకపోవడం వివాదాస్పదంగా మారింది. ఈ నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వం తనతో సంప్రదించకుండా ఏకపక్షంగా వ్యవహరించిందని గతంలో ఎన్నడూ లేని విధంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆర్‌ఎం లోధా బహిరంగంగా విమర్శించడం పాలకపక్షాన్ని ఇరుకున పెట్టింది. మోదీ ప్రభుత్వ తీరును సీజేఐ విమర్శించిన నేపథ్యంలో అధికార, ప్రతిపక్షాల మధ్య సరికొత్త రాజకీయ వివాదం తలెత్తింది. న్యాయమూర్తుల నియామకంలో మోడీ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతోందని, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్‌ కూడా విమర్శించింది. అయితే కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ మాత్రం ప్రధాని న్యాయమూర్తి, సుప్రీంకోర్టు, న్యాయవ్యవస్థ పట్ల తమ ప్రభుత్వానికి అపారమైన గౌరవం ఉందని, అయితే న్యాయమూర్తిగా సుబ్రమణ్యం నియామకంపై కొలీజియం సిఫారసులను తిరస్కరించే హక్కు కేంద్ర ప్రభుత్వానికి ఉందన్నారు. ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించకుండా కేంద్రం ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం ఒక తప్పయితే, కేంద్ర ప్రభుత్వ వ్యవహారశైలిని ప్రధాన న్యాయమూర్తి బహిరంగంగా విమర్శించడం ఈ వ్యవహారాన్ని మరింత వేడెక్కించింది. సుబ్రమణ్యం నియామకం విషయంలో న్యాయవ్యవస్థ, ప్రజాప్రాతినిథ్య వ్యవస్థలు హుందాగా వ్యవహరించి ఉంటే బాగుండేది. గోపాల్‌ సుబ్రమణ్యంతో సహా కోల్‌కతా, ఒడిశా హైకోర్టుల చీఫ్‌ జస్టిస్‌లు అరుణ్‌ మిశ్రా, ఆదర్శ్‌ కువూర్‌, సీనియర్‌ అడ్వొకేట్‌ రోహిన్టన్‌ నారిమన్ లను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం 2014 సార్వత్రిక ఎన్నికలకు కొద్దిరోజుల ముందు సిఫారసు చేసింది. ఆ సిఫార్సుకు యూపీఏ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అయితే, గుజరాత్‌లోని సొహ్రాబుద్దీన్‌ నకిలీ ఎన్‌కౌంటర్‌ కేసుకు గతంలో సుప్రీంకోర్టు సహాయకునిగా వ్యవహరించడమే కాక, మోదీ సన్నిహితుడైన అమిత్‌ షాపై హత్యాభియోగాల నమోదుకు కారణమయ్యారన్న కక్షతోనే కేంద్ర ప్రభుత్వం సుబ్రమణ్యం నియామకంపై విముఖత చూపిందని విపక్షాలు ఆరోపించాయి. ఈ నేపథ్యంలో కొలీజీయం తన అభ్యర్థిత్వానికి చేసిన సిఫార్సు ఉపసంహరించుకోవాలని సుబ్రమణ్యం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి విజ్ఞప్తి చేస్తూ రాసిన లేఖ సంచలనం సృష్టించింది. సుప్రీంకోర్టు కూడా తనకు బాసటగా నిలవ లేదని కార్యనిర్వాహక వ్యవస్థకు దాసోహమైందని ఆ లేఖలో గోపాల్‌ ఆరోపించారు. ప్రధాన న్యాయమూర్తి లోథా కేంద్ర ప్రభుత్వం పై చేసిన వ్యాఖ్యలు ఈ ఆరోపణలో నిజం లేదని చెప్పేందుకేనని భావించవచ్చు. కొత్తగా అధికారంలోకి వచ్చిన ఏ ప్రభుత్వమైనా తనకు అనుకూలమైన నియామకాల ద్వారా తన విధానాలను అమలు చేసేందుకు, ప్రత్యర్థి వర్గాలను రాజకీయంగా ఆటకట్టించేందుకు ప్రయత్నించడం కద్దు. అయితే సుప్రీంకోర్టు వంటి అత్యున్నత న్యాయవ్యవస్థకు, రాజ్యాంగ వ్యవస్థలకు చేపట్టే నియామకాలను గతంలో తమకు అనుకూలంగా వ్యవహరించ లేదన్న ఏకైక కారణంతో వ్యతిరేకించడం సరికాదు. గోపాల్‌ సుబ్రమణ్యం ఉదంతంతో కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయవ్యవస్థల మధ్య చెలరేగిన వివాదం ప్రస్తుతం అమలులో ఉన్న న్యాయమూర్తుల నియామకాల విధానాన్ని చర్చనీయాంశంగా మార్చింది. బీజేపీ నేతలు మాత్రం గోపాల్ సుబ్రమణ్యం విషయంలో తమ ప్రభుత్వం నిబంధనలకు లోబడే వ్యవహించిందని సమర్ధించుకోవడం విశేషం. మన దేశంలో న్యాయమూర్తుల నియామకాలను న్యాయమూర్తులే సభ్యులుగా ఉన్న కొలీజియం వ్యవస్థ నిర్వహిస్తుంది. అయితే కొలీజియం సిఫార్సులు పారదర్శకంగా లేకపోవడం, ఆ సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం ఏ మేరకు అనుమతిస్తున్నదో తెలియకపోవడంతో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. న్యాయమూర్తుల నియామాకాల కోసం ‘కొలీజియం’ వ్యవస్థను రూపొందించాలని తీర్పు చెప్పిన జస్టిస్‌ జెఎస్‌ వర్మ సైతం ఆ వ్యవస్థ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. యూపీఏ-2 హయాంలో న్యాయమూర్తుల నియామకాలు, తొలగింపులతో కూడిన ‘న్యాయ వ్యవస్థ ప్రమాణాలు, జవాబుదారీ బిల్లు’ రూపొందింది. అయితే గత ఎన్డీఏ ప్రభుత్వంలో కొలీజియం వ్యవస్థను రద్దు చేసి దాని స్థానంలో ‘నేషనల్‌ జుడిషియల్‌ కమిషన్‌’ను ఏర్పాటు చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలో న్యాయ, కార్యనిర్వాహక, అధికార, ప్రతిపక్ష నాయకులతో సహా.. న్యాయకోవిదులు, పౌర సమాజ ప్రముఖులతో కూడిన ఏడుగురు సభ్యులతో ఎన్‌జేసీ ఏర్పరచాలని ఎన్డీఏ యోచిస్తోంది. కొలీజియం వ్యవస్థ సరిగాలేదని భావించిన పక్షంలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రత్యామ్నాయాన్ని ప్రతిపాదించడంలో తప్పేమీ లేదు. కానీ, ఆలోగా ఏవైనా నిర్ణయాలు అమలు చేయవలసి వస్తే ప్రస్తుతం అమలులో ఉన్న విధానాన్ని అనుసరించడం శ్రేయస్కరం. ఎంతటి సమస్య ఎదురైనప్పటికీ, రాజ్యాంగ, ప్రజాస్వామిక వ్యవస్థలను, సంప్రదాయాలను గౌరవించి పాటిస్తున్నప్పుడు అధికారంలో ఉన్నవారి గౌరవం మరింత ఇనుమడిస్తుంది. న్యాయ వ్యవస్థ తీరు మారుతోంది మార్గదర్శకాలకు విరుద్ధంగా వ్యవహరించే న్యాయమూర్తులపై చర్యలు తీసుకుని ఉంటే కార్యనిర్వాహక వ్యవస్థకు చెందిన వారిపై చర్యలు తీసుకునే నైతిక అర్హత న్యాయ వ్యవస్థకు లభిస్తుంది. ఇందుకు భిన్నంగా 'మాలోని తప్పులను కప్పిపుచ్చుకుంటాం. మీ తప్పులను మీరు కప్పిపుచ్చుకోండి' అన్నట్టుగా ఈ రెండు వ్యవస్థలూ వ్యవహరిస్తే ప్రజలకు దిక్కెవరు?. మేం ఏమి చేయాలో, ఏమి చేయకూడదో న్యాయస్థానాలే చెబుతున్నాయి.. అని కార్యనిర్వాహక వ్యవస్థలో భాగమైన సీనియర్ ఐ.ఏ.ఎస్ అధికారులే వాపోతున్నారు. కార్యనిర్వాహక వ్యవస్థ పరిధిలోకి న్యాయ వ్యవస్థ చొచ్చుకువెడుతోంది. రాజ్యాంగానికి సవరణలు చేసే అధికారం పార్లమెంటుకు ఉండగా, ఆ పని కూడా మేమే చేస్తాం అన్నట్టుగా కొందరు న్యాయమూర్తులు వ్యవహరిస్తున్నారు'' -అని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మార్కండేయ కట్జూ కూడా ఘాటుగా విమర్శించారు. ఇటీవలి కాలంలో న్యాయ వ్యవస్థ వ్యవహరిస్తున్న తీరు గమనిస్తున్న పలువురు మేధావులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. బాబా రామ్‌దేవ్ దీక్షా శిబిరంపై అర్ధరాత్రి పోలీసులు దాడి చేయడానికి సంబంధించి దాఖలైన కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు స్పందిస్తూ, 'నిద్ర కూడా ప్రాథమిక హక్కేనని' స్పష్టంచేసింది. దీనిపైనే అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కపాడియా స్పందిస్తూ, "నిద్రను ప్రాథమిక హక్కులలో చేర్చడం ఏమిటి? అలాంటి తీర్పులు ఇస్తే అమలు సాధ్యమేనా?'' అని ప్రశ్నించారు ఇటీవలి కాలంలో వివిధ న్యాయస్థానాలు ఇస్తున్న తీర్పులు, చేస్తున్న వ్యాఖ్యలను గమనిస్తే న్యాయ వ్యవస్థ కూడా పరిధి దాటుతోందన్న అనుమానం కలుగుతోంది. జస్టిస్ కపాడియా అన్నట్టుగా న్యాయ వ్యవస్థ తనకు తోచిన విధంగా తీర్పులు ఇచ్చుకుంటూ పోతే వాటిని అమలు చేయవలసిన కార్యనిర్వాహక వ్యవస్థ పరిస్థితి ఏమిటి? కార్య నిర్వాహక వ్యవస్థ సహకరించకపోతే న్యాయస్థానాలు తాము ఇచ్చిన తీర్పులను అమలు చేయించగలవా?అలా చేయడానికి తగిన యంత్రాంగం న్యాయ వ్యవస్థకు ఉందా? జస్టిస్ కపాడియాకు కూడా ఇదే సందేహం వచ్చింది. న్యాయ వ్యవస్థలో జవాబుదారీతనం లేకపోవడం వల్లనే పెడధోరణులు పొడచూపుతున్నాయన్నది న్యాయ నిపుణుల అభిప్రాయం. ఈ కారణంగానే న్యాయ వ్యవస్థను కూడా జవాబుదారీ చేసే విధంగా చట్టం తేవాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. గత కొన్ని దశాబ్దాలుగా శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థలపై ప్రజలలో విశ్వాసం సన్నగిల్లుతోంది. దీంతో న్యాయ వ్యవస్థ క్రియాశీలకంగా వ్యవహరించడం ప్రారంభించింది. మొదట్లో ఇది బాగానే అనిపించినా, రాను రాను మోతాదు మించడంతో న్యాయ వ్యవస్థపై విమర్శలు ప్రారంభమయ్యాయి. చట్టాలు, శాసనాలు చేసే అధికారం చట్టసభలది కాగా, వాటిని అమలుచేసే బాధ్యత కార్యనిర్వాహక వ్యవస్థది. ప్రభుత్వాలు రూపొందించే చట్టాలు రాజ్యాంగానికి లోబడి ఉన్నాయా? లేదా? నిర్ణయాలకు చట్టబద్ధత ఉందా? లేదా? అని విశ్లేషించి తీర్పు చెప్పడం వరకే న్యాయస్థానాల బాధ్యత. ఇప్పుడు కొంత మంది న్యాయమూర్తులు ఈ పరిధిని అతిక్రమించి ప్రభుత్వాలు ఏమి చేయాలో?ఏమి చేయకూడదో నిర్దేశించడంతో పాటు విధానపరమైన అంశాలలో కూడా తలదూర్చడంతో పేచీ మొదలైంది. దేశంలో రాజకీయ నాయకత్వం బలహీనపడటంతో ఈ పరిస్థితి ఉత్పన్నం అయింది. మన ఉమ్మడి రాష్ట్రం విషయమే తీసుకుందాం! 15 ఏళ్ల క్రితం వరకు హైకోర్టు న్యాయమూర్తులు తమ పని తాము చేసుకుపోతుండేవారు. వారి గురించి ప్రజలకు పెద్దగా పరిచయం ఉండేది కాదు. ఎందుకంటే వారు బహిరంగ కార్యకలాపాలలో పాల్గొనేవారు కాదు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత హైకోర్టు న్యాయమూర్తులకు పలు సౌకర్యాలు కల్పించారు. న్యాయాధీశులకు విలాసవంతమైన కార్లను సమకూర్చడం, పోలీసు ఎస్కార్ట్ వంటి సదుపాయాలను కల్పించడం జరిగింది. దీంతో శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల కంటే తాము శక్తిమంతులమన్న భావన కొందరు న్యాయమూర్తులలో ఏర్పడింది. అప్పటి నుంచి న్యాయ వ్యవస్థ వ్యవహార శైలిలో మార్పు వచ్చింది న్యాయమూర్తుల వ్యవహార శైలి ఏ విధంగా ఉండాలో నిర్దేశిస్తూ 1997 మే 7న సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ కొన్ని మార్గదర్శక సూత్రాలను జారీ చేసింది. ఎవరైనా న్యాయమూర్తి కుటుంబ సభ్యులు న్యాయవాద వృత్తిలో ఉంటే, వారితో కలిసి సంబంధిత న్యాయమూర్తి ఒకే ఇంట్లో కూడా నివసించకూడదని ఈ మార్గదర్శకాలలో పొందుపరిచారు. న్యాయమూర్తి హోదాకు అనుగుణంగా వ్యవహరించాలన్న ఉద్దేశంతో న్యాయమూర్తులు జన సమూహంతో కలివిడిగా ఉండకూడదని కూడా నిర్దేశించారు. న్యాయ పరిశీలనకు వచ్చే లేదా న్యాయ వ్యవస్థ వద్ద పెండింగ్‌లో ఉన్న రాజకీయపరమైన అంశాలపై న్యాయమూర్తులు బహిరంగంగా తమ అభిప్రాయాలు వ్యక్తంచేయకూడదనీ, బహిరంగ చర్చలలో పాల్గొనకూడదనీ, కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహిత మిత్రుల నుంచి మాత్రమే బహుమతులు, ఆతిథ్యం స్వీకరించాలని కూడా మార్గదర్శక సూత్రాలలో పేర్కొన్నారు. ఇలా మొత్తం 16 అంశాలను సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ ఆమోదించింది. ప్రజలు తమను గమనిస్తున్నారన్న విషయాన్ని ప్రతి న్యాయమూర్తీ సర్వదా గమనంలో ఉంచుకోవాలని చివరగా సూచించారు. అయితే ప్రస్తుతం జరుగుతున్నది ఇందుకు భిన్నంగా ఉంటోంది. తాము ఇచ్చే తీర్పులకు సమాధానం చెప్పవలసిన అవసరం లేదన్న భావంతో కొంతమంది న్యాయమూర్తులు ఇష్టం వచ్చిన తీర్పులు ఇస్తున్నారు. కార్యనిర్వాహక వ్యవస్థ రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి పనిచేయడం వల్లనే న్యాయ వ్యవస్థపై బాధ్యత పెరిగిందని చెప్పవచ్చు. ఈ పరిస్థితి అంతిమంగా సరిహద్దులను చెరిపేసే వరకూ వచ్చింది. కార్యనిర్వాహక వ్యవస్థ, ముఖ్యంగా పోలీసు వ్యవస్థ అధ్వానంగా మారడం వల్లనే ప్రజలకు ఆ వ్యవస్థపై నమ్మకం పోయి న్యాయస్థానాలను ఆశ్రయించడం మొదలు పెట్టారు. ఈ దేశంలో న్యాయ వ్యవస్థపై ప్రజలకు ఇప్పటికీ నమ్మకం ఉందనడానికి ఇదే నిదర్శనం. ఈ పరిణామం మొదట్లో మంచికి మాత్రమే ఉపయోగపడగా, న్యాయ వ్యవస్థలో కూడా పెడ ధోరణులు ప్రవేశించడం వల్ల అప్పుడప్పుడు ప్రతికూల ఫలితాలు వస్తున్నాయి. దేశాన్ని ఏలడం మన పని కాదని సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కపాడియా చేసిన వ్యాఖ్యలో ఎంతో అర్థం ఉంది. ఇప్పటివరకు న్యాయ వ్యవస్థ అంటే కార్యనిర్వాహక వ్యవస్థకు భయం, గౌరవం ఉన్నాయి. 'నిద్రించడం ప్రాథమిక హక్కు' వంటి ఆదేశాలు ఇస్తూ పోవడం వల్ల న్యాయ వ్యవస్థపై భయం, గౌరవం పోయే ప్రమాదం ఉంది. వ్యవస్థల పతనం ప్రారంభమైన తర్వాత ఎవరిపై ఎవరికీ అదుపు లేకుండా పోయింది. రాజకీయ వ్యవస్థ సంకుచితంగా వ్యవహరించడం వల్ల దాని ప్రభావం మిగతా రంగాలపై పడుతోంది. శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ తమ విధులను సక్రమంగా నిర్వర్తించలేకపోవడం వల్ల వాటిపై ప్రజల్లో గౌరవం కూడా పోయింది. అయితే, విధి నిర్వహణలో విఫలమైన సందర్భాలలో బాధ్యులపై చర్య తీసుకోవడానికి న్యాయ వ్యవస్థ ఎందుకు చొరవ తీసుకోలేకపోతున్నదో తెలియదు. ఇలాంటి వైఖరుల వల్ల కార్యనిర్వాహక వ్యవస్థ స్థాయిలో పరిష్కారం కావలసిన సమస్యలు న్యాయ వ్యవస్థ పరిధిలోకి వెడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: