ఈ ఏడాది ఖరీఫ్‌లో బీమా ధీమా కొరవడినట్లే. ఇప్పుడిప్పుడే రెండు రాష్ట్రా ల్లోనూ ఖరీఫ్‌ నాట్లు పడుతున్నాయి. వాస్తవానికి ప్రతిఏటా ఖరీఫ్‌ సీజన్‌ అంటే రైతుకు గండమే. ఆగస్టు, నవంబర్‌ మధ్యలో కోస్తా జిల్లాల్లో తుపాన్‌లు, భారీ వర్షాలు వస్తుంటా యి. ఆరుగాలం శ్రమించి పండించిన పంటల్ని ఇవి ఊడ్చి పెట్టేస్తుంటాయి. ఇలాంటి సమయంలో రైతుల్ని ఆదుకునేది ఒక్క బీమా పథకమే. రుణమాఫీ ప్రకటన నేపథ్యంలో ఈసారి ఖరీఫ్‌లో రైతుకు బీమా కూడా దక్కేట్టు లదు. కేంద్రస్థాయిలో యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ సంస్థ ఈ పంటల బీమాను అమలు చేస్తోంది. ప్రతిఏటా జులై 31ని ఖరీఫ్‌లో పంటల బీమా ప్రీమియం చెల్లింపునకు గడువుగా నిర్ణయిస్తుంటారు. ఈ సారి కూడా ఇదే తేదీని నిర్ణయించారు. దేశవ్యాప్తంగా మిగిలిన రాష్ట్రాల్లో రైతులు ఈ గడువులోగా పంటల బీమాను చెల్లించు కోగలిగినప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం రైతులు బీమా చెల్లింపునకు దూరమయ్యారు. సాధారణంగా రైతులు పెట్టు బడి కోసం బ్యాంకులు, సొసైటీల నుంచి అప్పు తీసుకుంటారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎకరానికి రూ.25వేల చొప్పున సొసైటీలు, జాతీయ బ్యాంకులు రైతులకు రుణాలు ఇస్తున్నాయి.  ఈ 25వేల మొత్తానికి ఆర్థిక సంస్థలే రైతు తరపున పంటల బీమా చేయిస్తుంటాయి. బీమా మొత్తంలో 18శాతాన్ని ప్రీమియంగా చెల్లించాలి. ఇందులో 12శాతాన్ని రైతు తరపున కేంద్రమే కడుతుంది. ఆరుశాతం మాత్రమే రైతులు చెల్లించాల్సి వస్తుంది. దీంతో రుణం మొత్తంలో ఆరుశాతాన్ని మినహాయించి మిగిలిన సొమ్మును రైతుకు బ్యాంకులు, సొసైటీలు చెల్లిస్తుంటాయి. ఈ ఆరుశాతాన్ని రైతు తరపున యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీకి బీమా ప్రీమియంగా సొసైటీలు, బ్యాంకులే జమ చేస్తాయి. ఇవికాక మరో 12శాతాన్ని ఈ సంస్థల ద్వారా కేంద్రం ఇన్సూరెన్స్‌ కంపెనీకి చెల్లిస్తుంది. ఈ సారి రుణమాఫీకి సంబంధించి ప్రకటన వెలువడింది. రైతుల రుణాన్ని లక్షన్నర వరకు మాఫీ చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే బ్యాంకులకు మాత్రం ఈ మొత్తం జమకాలేదు. ఈ రుణాల్ని రీ షెడ్యూల్‌ చేయాలన్న ప్రభుత్వ అభ్యర్థనపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ కారణంగా రైతులకు పాతరుణాలు ఇంకా పుస్తకాల్లో రద్దు కాలేదు. దీంతో బ్యాంకులు, సొసైటీలు కొత్త రుణాలు జారీ చేయలేదు. ఈలోగానే బీమా గడువు ముగిసిపోయింది. గడువు పెంచమంటూ కేంద్ర ప్రభుత్వాన్ని, ఇన్సూరెన్స్‌ సంస్థను అధికారులు కోరినప్పటికీ ఫలితం రాలేదు. కనీసం రెండుమాసాల పాటు గడువు ఇమ్మంటూ ముందు కోరారు. ఆఖరకు మాసం రోజులైనా గడువు పెంచమని అభ్యర్థించారు. కానీ స్పందనలేదు.  కొందరు రైతులు నేరుగానే బీమా చేయించుకున్నారు. అయితే బ్యాంకులు, సొసైటీల ద్వారా కాకుండా నేరుగా బీమా చేయిస్తే ఎకరానికి గరిష్టంగా 9,726రూపాయలకు మాత్రమే బీమా చేస్తారు. ఇందులో 18శాతాన్ని ప్రీమియంగా రైతు చెల్లించాలి. అంతకుమించి ఎక్కువ మొత్తానికి బీమా చేయరు. అదే బ్యాంకులు, సొసైటీల ద్వారా బీమా కెళితే వారిచ్చిన మొత్తం అప్పుకు భరోసాగా గరిష్టంగా 25వేల వరకు బీమా కల్పిస్తున్నారు. వ్యక్తిగతంగా ప్రీమియం చెల్లిస్తే ప్రభుత్వం నుంచి 12శాతం రాయితీ లభించదు. ఈ కారణంగా ఈసారి ఖరీఫ్‌లో సొంతంగా బీమా చేయించిన రైతుల సంఖ్య రెండుమూడు శాతానికి మించదు. రుణమాఫీపై విధివిధానాలు రూపొంది పాత బకాయిల స్థానంలో కొత్త రుణాలు రైతులకు అందినప్పటికీ కూడా ఖరీఫ్‌లో వారు లాభపడతారన్న ఆశలు ఆవిరైపోతున్నాయి. పొరపాటునో గ్రహపాటునో ఉప్పెనలు, భారీ వర్షాలు ముంచుకొస్తే అప్పుతెచ్చి వేసిన పంటంతా నాశనమయ్యే ప్రమాదముంది. అలాంటి సందర్భాల్లో ప్రభుత్వమిచ్చే ఆర్థికసాయం తప్ప బీమా లభించే అవకాశంలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: