చంద్రబాబుకి ఎమ్మెల్సీ ఎన్నికల తలనొప్పి మొదలు కాబోతోంది. ఎమ్మెల్యే కోటాలో ఒక ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడనున్న తరుణంలో ఇప్పుడు అదే కోటాలో రెండో స్థానం తెర మీదకు రావడంతో పార్టీలో ఆశావహుల సంఖ్య పెరిగిపోయింది. ఆశావహులంతా ముఖ్యనేతలే కావడంతో ఒకరికి పదవి ఇస్తే మరొకరు హర్ట్ అయ్యే పరిస్థితి కనపడుతోంది. దాంతో రెండో ఎమ్మెల్సీ అభ్యర్ధిని ఎంపిక చేయడం ఏపి సీఎం తలనొప్పిగా మారనుంది. ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ఎమ్మెల్యే కోటాలో ఒక ఎమ్మెల్సీ స్థానం ఖాళీగా ఉంది. దాని ఎన్నిక కోసం ఆగస్టు 4న నోటిఫికేషన్ జారీచేస్తామని ఇటీవల రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. వాస్తవానికి ఎమ్మెల్యే కోటాలో రెండు ఖాళీలున్నాయి. ఆ విషయాన్ని అటు పార్టీ కాని ఇటు ఎన్నికల సంఘం కాని గుర్తించలేదు. నోటిఫికేషన్ వెలువడిన క్రమంలో కొందరు టిడిపి నేతలు భన్వర్-లాల్ దగ్గరకు వెళ్లి పరిస్థితి వివరించడంతో రెండో స్థానం ఖాళీగా ఉన్నట్లు తేలింది. విభజన చట్టంలోని షెడ్యూల్ 23 ప్రకారం ఏపికి మొత్తం 50 ఎమ్మెల్సీ స్థానాలు కేటాయించారు. అందులో 17 ఎమ్మెల్యే కోటాలో ఎన్నికయ్యే ఎమ్మెల్సీలు, మరో 17 మందిని స్థానిక సంస్థల ప్రతినిధులు ఎన్నుకుంటారు. గ్రాడ్యుయేట్, టీచర్ కోటాల్లో చెరో అయిదుగురు ఎన్నికవుతారు. మిగిలిన ఆరుగుర్ని గవర్నర్ నామినేట్ చేస్తారు. అయితే ఎమ్మెల్యే కోటాలో ఉన్న 17 స్థానాలకు గాను ఇప్పుడు 15 మందే ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్నారు. తిప్పేస్వామి, నన్నపనేని రాజకుమారి, రుద్రరాజు పద్మరాజు, సింగం బసవ పున్నయ్య, చెంగల్రాయుడు, పాలడుగు వెంకట్రావు, మహమ్మద్ జానీ, సతీష్-రెడ్డి, పిజె చంద్రశేఖరరావు, సి.రామచంద్రయ్య, ఎం. సుధాకరబాబు, లక్ష్మీ శివకుమారి, యనమల రామకృష్ణుడు, శమంతకమణి, ఆదిరెడ్డి అప్పారావు, కోలగట్ల వీరభద్రస్వామి శాసనమండలి సభ్యులుగా ఉండేవారు. వారిలో కోలగట్ల వీరభద్రస్వామి రాజీనామా చేయడంతో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల సంఖ్య 15కు పరిమితమైంది. అయితే కోలగట్ల రాజీనామాను పరిగణనలోకి తీసుకున్న ఎన్నికల సంఘం అప్పటికే ఖాళీగా ఉన్న స్థానం గురించి పట్టించుకోలేదు. అందుకే ఒక ఎమ్మెల్సీ స్థానం భర్తీకి నోటీఫికేషన్ జారీ చేస్తానని ప్రకటించింది. ఇప్పుడు టిడిపి నేతలు వచ్చి షెడ్యూల్ 23లో పేర్కొన్న అంశాల్ని దృష్టికి తేవడంతో పొరపాటు దిద్దుకుని రెండు స్థానాలకు నోటిఫికేషన్ జారీ చేయాలని సిఇసిని కోరింది. అదే ఇప్పుడు ఏపి సీఎం చంద్రబాబుకి తలనొప్పిగా మారే పరిస్థితి కనిపిస్తోంది. మొన్నటి వరకు ఒకటే అనుకున్నారు కాబట్టి దాన్ని ఇప్పటికే కేబినెట్-లో ఉన్న నారాయణకు ఇవ్వడానికి చంద్రబాబు నిర్ణయించారు. నారాయణ 6 నెలల్లోగా ఏదో ఒక సభలో సభ్యత్వం పొందాల్సి ఉంది కాబట్టి అది తప్పనిసరి. దాంతో మిగిలిన నేతల నుంచి ఇప్పటికైతే ఎలాంటి తలనొప్పి ఉండదనుకున్నారాయన. అయితే రెండో స్థానం తెరమీదకు రావడంతో ఆ తలనొప్పి మొదలైనట్లే కనిపిస్తోంది. రెండు స్ధానాలకు ఎన్నిక జరపాలని నోటిఫికేషన్ రానుండటంతో ఆ రెండో స్థానం కోసం మహామహులు రేసులోకి వచ్చేస్తారు. పయ్యావుల కేశవ్, గాలి ముద్దుకృష్ణమ నాయుడు, సోమిరెడ్డి చంద్రమోహన్-రెడ్డి, మొన్నటి ఎన్నికల్లో సిట్టింగ్-గా ఉన్నప్పటికీ ఎమ్మెల్యే టికెట్ దక్కించుకోలేకపోయిన కడప జిల్లా నేత లింగారెడ్డి వంటి వారు ఎమ్మెల్సీ అభ్యర్ధిత్వం ఆశిస్తున్నారు. ఆశావహుల్ని అందర్నీ ఒప్పించి ఏ ఒక్కరికో న్యాయం చేయాలంటే టిడిపి అధినేత పెద్ద కసరత్తే చేయాల్సి ఉంటుంది. చూడాలి మరి చంద్రబాబు ఈ తలనొప్పిని ఎలా వదిలించుకుంటారో! 

మరింత సమాచారం తెలుసుకోండి: