రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చంద్రబాబు సర్కారు చేస్తున్న ప్రకటనలు అయోమయం సృష్టిస్తున్నాయి. ఓవైపు ఖజానా ఖాళీ అంటారు. 16వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్ అంటారు. రాజధాని నిర్మాణం కోసం హుండీలు పెడతారు. విరాళాలు స్వీకరిస్తారు. మరోవైపు లక్షన్నర కోట్లతో రాజధాని కట్టుకుందామంటారు. రైతులకు ఐపాడ్లిస్తామంటారు. ఇంతకీ వాస్తవానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి..? నిజంగా అంతదీన స్థితి ఉంటే.. ఎందుకు సర్కారు డాంబికాలకు పోతున్నట్టు.. ఇవన్నీ చాలామందిలో మెదులుతున్న ప్రశ్నలు. వెయ్యి మైళ్ల ప్రయాణమైనా చిన్నఅడుగుతోనే మొదలుపెడతామని సామెత. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్న సమయంలో రుణమాఫీ, రాజధాని వంటి అంశాలకే ఖజానాలో ఎక్కువ భాగం వెళ్లిపోతే... మన సంక్షేమ పథకాలు ఏమైపోతాయి. అందుకే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్న చందంగా చంద్రబాబు వ్యవహరించవద్దని సీనియర్లు సూచిస్తున్నారు. ఒకరితో పోల్చుకోకుండా... మన స్థాయికి తగ్గట్టుగా రాజధాని కట్టుకుంటే మేలంటున్నారు. ఈ మాటలన్నది ఎవరో కాదు.. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు. విలువలు కలిగిన రైతు నేత అయిన వడ్డే మాటలు ఆలోచించదగ్గవే. ఒకవైపు ఖర్చులు తగ్గించుకోమని మంత్రులు, అధికారులకు ఆదేశాలిచ్చిన ప్రభుత్వం.. మరో వైపు వేల కోట్లతో రాజధానిని నిర్మించాలనుకోవడం హాస్యాస్పదమని వడ్డే శోభనాద్రీశ్వరరావు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి వేల ఎకరాల స్థలం అవసరమా అని ప్రశ్నించారు. 15 ఎకరాలు సెక్రటేరియట్‌కు, అసెంబ్లీకి 20 ఎకరాలు, వివిధ కార్యాలయాలకు, ఉద్యోగుల క్వార్టర్లకు 120 ఎకరాలు సరిపోతాయని శివరామకృష్ణన్ కమిటీ చెబుతుంటే.. ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం 20 వేల నుంచి 30 వేల ఎకరాలు అవసరమని ఎందుకు అంటున్నారో అర్థం కావటం లేదని చెప్పారు. మరి ఈ మాటలు చంద్రబాబు చెవినపడతాయా..?

మరింత సమాచారం తెలుసుకోండి: