గుంటూరు జిల్లా వైసిపి సమీక్షా సమావేశాలు ముగిశాయి. అయితే ఈ సమీక్ష హాట్ హాట్గా సాగినట్లు సమాచారం. పార్టీ నేతలు ఎవరికి వారు ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టుకోకుండా సమన్వయ లోపాలను పక్కన పెట్టి ప్రజా సమస్యల పై ప్రతిపక్ష పార్టీగా పూర్తిస్థాయిలో పోరాడాలని పార్టీ అధినేత జగన్ పిలుపునిచ్చారు. జిల్లాలో రెండు రోజుల సమీక్ష పూర్తిచేసిన ఆయన హైదరబాద్-కు రిటర్న్ అయ్యారు. గుంటూరు జిల్లాలో వైసిపి నియోజకవర్గాల సమీక్షలు ముగిశాయి. గత ఎన్నికల్లో పార్టీ పరాజయానికి కారణాలు, పార్టీ పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యలపై జిల్లాల వారీగా వైసిపి అధినేత జగన్ సమీక్షలు జరుపుతున్నారు. అందులో భాగంగా గుంటూరు జిల్లాలో జరిగిన సమావేశాల్లో జిల్లా నేతలు, మొన్నటి స్థానిక, సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసి గెలిచిన, ఓడిన అభ్యర్ధులందరూ పొల్గొన్నారు. గుంటూరులో మూడు రోజుల పాటు సమీక్ష నిర్వహించాలని ముందు నిర్ణయించారు. బాపట్ల పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే ప్రకాశం జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్ష కూడా గుంటూరులోనే చేపట్టడానికి షెడ్యూల్ వేసుకున్నారు. అయితే నేతల నుంచి వచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకుని ఆ జిల్లా సమీక్షను వేరుగా చేపట్టాలని నిర్ణయించారు. దాంతో రెండు రోజుల సమీక్ష పూర్తిచేసుకున్న జగన్ హైదరాబాద్-కు తిరుగు ప్రయాణం అయ్యారు. నియోజకవర్గ స్థాయి నేతలు తమను పట్టించుకోవడం లేదని కొందరు కార్యకర్తలు జగన్-కు కంప్లైంట్ చేశారు. అధికార పార్టీ నుంచి తమపై దాడులు, దౌర్జన్యాలు ఎక్కువతున్నాయని అయినా స్థానిక నేతలు పట్టించుకోవటం లేదని కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ క్రమంలో కార్యకర్తల అభిప్రాయాలు, సూచనలను జగన్ ఓపికగా విన్నారు. క్యాడర్-లో ఆత్మస్థైర్యం నింపాల్సిన బాధ్యత నేతలదే అని సూచించిన జగన్ వారికి ఏ కష్టం వచ్చినా తాను అండగా నిలబడతానని భరోసా ఇచ్చారు. ప్రజా సమస్యల పై పోరాడాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీగా తమ పైనే ఎక్కువగా ఉందని జగన్ అన్నారు. ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన వ్యవసాయ రుణమాఫీ, డ్వాక్రా రుణాల రద్దు వంటి అన్ని అంశాలు అమలు చేసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని, స్థానిక సమస్యలపై చురుగ్గా స్పందించాలని క్యాడర్-కు ఆయన పిలుపునిచ్చారు. వచ్చే వారం ఆయన ప్రకాశం జిల్లా సమీక్ష చేపట్టే అవకాశం ఉందని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: