ఫైవ్‌స్టార్‌ హోటల్స్‌లో సమావేశాల్లేవు. ఫారిన్ టూర్లు లేవు. కొత్త వాహనాల్లేవు. రాబడి, ఖర్చులపై సరైన అంచనాల్లేని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇలా అన్నింటికీ 'నో' అంటోంది. హద్దు మీరితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరిస్తోంది. ఆదాయం గోరంత, ఖర్చు కొండంత. ఇదీ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పరిస్థితి. ప్రభుత్వానికి ఆదాయాన్నిచ్చే వనరులన్నీ ఎక్కువగా తెలంగాణకే వెళ్లిపోవడంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిధుల కోసం తల్లడిల్లిపోతోంది. కొత్త రాజధాని ఏర్పాటు, ప్రభుత్వ కార్యాలయాన్నీ కొత్తగా నిర్మించుకోవడం, ఇచ్చిన హామీలను నెరవెర్చడానికయ్యే ఖర్చు... వెరసి బాబు ప్రభుత్వం ఈ లెక్కలతో ఉక్కిరిబిక్కిరైపోతోంది. అందుకే... ప్రభుత్వం కుదురుకుని, ఆదాయంపై స్పష్టత వచ్చేంతవరకూ పొదుపు మంత్రం పాటించాలని నిర్ణయించింది. ఈ మేరకు అన్ని శాఖలకూ ఏమేం చేయాలి, ఏమేం చేయకూడదు అన్న మార్గదర్శకాలు జారీ చేసింది. గీత దాటిన వారిపై కఠినమైన చర్యలుంటాయని హెచ్చరించింది. ఈ మార్గదర్శకాల ప్రకారం... సమావేశాలు, సెమినార్ల ఏర్పాటు విషయంలో అన్ని శాఖలూ పొదుపు పాటించాలి. అత్యవసరమైతే తప్ప అలాంటి సమావేశాలను ఫైవ్‌స్టార్ హోటళ్లలో నిర్వహించేందుకు వీల్లేదు. 80 వేలకు పైబడిన వేతనం పొందుతున్న మంత్రులు, క్యాబినెట్‌ హోదా కలిగిన వారు మాత్రమే విమానం ద్వారా బిజినెస్‌క్లాస్‌లో ప్రయాణించేందుకు అర్హులు. ప్రభుత్వ ఖర్చులతో విదేశీయాత్రలు చేయడానికి వీల్లేదు. ప్రభుత్వ ఆదాయాన్ని తగ్గించే రాయితీలు, మినహాయింపులను ఎట్టి పరిస్థితిల్లోనూ అనుమతించబోరు. కొత్త వాహనాలు కొనడాన్ని నిషేధించారు. కొత్త అవుట్‌సోర్సింగ్‌ సిబ్బంది నియామకాలకు అనుమతించరు. ప్రచారంపై చేసే ఖర్చు ఆయా శాఖలకు కేటాయించిన బడ్జెట్‌ నుంచే చెల్లించాల్సి ఉంటుంది. ప్రచారంపై అతి తక్కువ ఖర్చును మాత్రమే అనుమతిస్తారు. పొదుపు సూక్తులు వినడానికి బాగానే ఉన్నా... ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పుడే కన్సల్టెన్సీల పేరుతో విదేశీ కంపెనీలకు రెడ్‌ కార్పెట్‌ పరవడమే ఇప్పుడు మంత్రులకు, అధికారులకు మింగుడు పడ్డం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: