రాష్ట్రాల్లో స్వేచ్చగా కొనసాగుతున్న అంతర్గత కలహాలు పార్టీని నిర్వీర్యం చేస్తుంటే కాంగ్రెస్‌ని ఎలా నడిపించాలనే అంశంపై సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మధ్య విభేదాలు పొడచూపడంతో పరిస్థితి మరింత విషమించింది. పార్టీ అధినాయకత్వం అసమర్థత, అలసత్వం మూలంగానే పార్టీకి ఈ దుస్థితి వచ్చిందని భావిస్తున్న కాంగ్రెస్ నాయగులు ఎదురు తిరిగేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీ అధినాయకత్వం కూడా వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోకుండా దాట వేత విధానాన్ని అవలంబిస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఓటమికి దారి తీసిన పరిస్థితులను అంచనా వేసేందుకు సీనియర్ నాయకుడు ఏ.కె.ఆంటోని అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీ వ్యవహారం తూతూ మంత్రంగా ముగిసింది. పార్టీ ఓటమికి ఎవరు బాధ్యులనేది నిర్దారించేందుకు అంటోని కమిటీ ధైర్యం చేయకపోయింది. ఆంధ్రప్రదేశ్‌లో కూకటివేళ్లతో కదిలిపోయిన కాంగ్రెస్‌కు తెలంగాణలో కూడా ఊపిరి ఆడటం లేదు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కూడా అధినాయకత్వం అనుసరిస్తున్న తీరు పట్ల అసంతృప్తితో ఉన్నారు. పి.సి.సి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను తొలగించకపోతే పార్టీ ముక్కలైపోతుందని అధినాయకత్వాన్ని భయపెడుతున్నారు. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డిని సకాలంలో తొలగించక నష్టపోయిన కాంగ్రెస్ ఇప్పుడు లక్ష్మయ్యను అకాలంలో తొలగించి నష్టపోయేందుకు సిద్ధమవుతోందనే వాదన కూడా వినిపిస్తోంది. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దిగ్విజయ్ సింగ్ మూలంగానే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ఓటమిపాలైంది కాబట్టి మొదట అన్ని తీసివేయాలని మరో వర్గం బాహాటంగా చెబుతోంది. మహారాష్ట్ర, హర్యానా, జమ్ముకాశ్మీర్,జార్ఖండ్ రాష్ట్రాల శాసన సభ ఎన్నికలు తన్నుకు వస్తున్న తరుణంలో పార్టీలో సంక్షోభం నెలకొనటం నాయకులను ఆందోళనకు గురి చేస్తోంది. మహారాష్టల్రో పరిశ్రమల శాఖ మంత్రి నారాయణ రాణే మంత్రి పదవికి రాజీనామా చేయటంతోపాటు ముఖ్యమంత్రి పృథ్విరాజ్ చౌహాన్‌పై తిరుగుబాటు జెండా ఎగురవేయడంతో పార్టీ పరిస్థితి గందరగోళంలో పడింది. ఫృథ్వీరాజ్ చౌహాన్ నాయకత్వంలో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటే పార్టీకి గుండు సున్నా మిగులుతుందన్నది రాణే వాదన. రాణే, చొహాన్ గొడవ రాష్ట్రంలో పార్టీ పుట్టిముంచే దిశగా సాగుతోంది. పృథ్విరాజ్ చౌహాన్ స్థానంలో మాజీ హో మంత్రి సుశీల్‌కుమార్ షిండేను ముఖ్యమంత్రిగా నియమించాలని రాణే తదితరులు చేస్తున్న వాదనను ఇతరులు గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. ఈ సమస్యలను పరిష్కరించి నాయకులందరిని ఒక తాటిపైకి తెచ్చేందుకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ఏం చేస్తున్నారనేది ఎవ్వరికీ అర్థం కావటం లేదు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలమధ్య నెలకొన్న విభేదాల మూలంగా అస్సాం కాంగ్రెస్ పరిస్థితి గందరగోళంగా తయారైంది. ముఖ్యమంత్రి తరుణ్‌గొగోయ్‌ను తొలగించాలంటూ హేమంత్ బిస్వాస్ శర్మ నడిపిస్తున్న అసమ్మతి కార్యకలాపాలు పార్టీని నిర్వీర్యం చేస్తున్నాయి. గొగోయ్‌ను ముఖ్యమంత్రి పదవి నుండి తొలగించకపోతే అస్సాంలో కాంగ్రెస్ కనుమరుగైపోతుందన్నది శర్మ వాదన. లోక్‌సభలో పార్టీ పక్షం నాయకుడు మల్లిఖార్జున ఖర్గే అస్సాంలో పర్యటించి వచ్చిన అనంతరం ఇచ్చిన నివేదిక కూడా గొగోయ్ వ్యవహారాల శైలిని తప్పుపట్టింది. శర్మ ఇటీవల ఢిల్లీకి వచ్చి పరిస్థితిని వినిపించిన అనంతరం సోనియా గాంధీ గొగోయ్‌ను తొలగించేందుకు సిద్ధమయ్యారు. అయితే గొగోయ్ కుమారుడు, లోక్‌సభ సభ్యుడు గౌరవ్ వాదన రాహుల్ గాంధీ మనసు మార్చివేసిందని అంటున్నారు. గొగోయ్‌ను తొలగించే ప్రసక్తే లేదని రాహుల్ గాంధీ స్పష్టం చేయటంతో అస్సాంలో కూడా కాంగ్రెస్ పరిస్థితి త్రిశంకు స్వర్గంలో పడింది. రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి పక్షం వ్యవహరించటంతో శర్మ వర్గం త్వరలోనే స్వంత కుంపటి పట్టుకునేందుకు సిద్ధమవుతోంది. ఇదే జరిగితే గొగోయ్ ప్రభుత్వం పతనం కావటం తథ్యం. రాహుల్ గాంధీ అస్సాం ముఖ్యమంత్రిని వెనకేసుకురావటం సోనియా గాంధీకి నచ్చకపోయినా ఏమీ చేయలేని పరిస్థితి. హర్యానాలో ముఖ్యమంత్రి భూపేంద్రసింగ్ హుడాను సీనియర్ నాయకుడు చౌదరీ బీరేంద్ర సింగ్ గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. చౌదరి భీరేంద్ర సింగ్ కాంగ్రెస్‌కు దూరమైతే ఈ సంవత్సరాంతంలో జరిగే అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనటం చాలా కష్టం. కేంద్రంలో అధికారంలో ఉన్న బి.జె.పి ఇండియన్ లోక్‌దళ్‌తో చేతులు కలిపితే హర్యానాలో అధికారం కాగ్రెస్ చేయి దాటినట్లే. జమ్ముకాశ్మీర్‌లో ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా నాయకత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్‌కు కాంగ్రెస్‌కు మధ్య పూర్తిగా చెడిపోయింది. కర్నాటకలో ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు పి.సి.సి అధ్యక్షుడు పరమేశ్వర్‌కుమధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది. అధికారం కోసం పెనుగులాటలు తార స్థాయికి చేరుకోవటంతో సిద్దరాయమ్యే ఆత్మరక్షణ రాజకీయాలకే ప్రాధాన్యత ఇవ్వవలసి వస్తోంది. దేశంలోనే అతిపెద్ద రాష్టమ్రైన ఉత్తర ప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు ఉనికిలేని పరిస్థితి నెలకొంది. భాజపా శక్తివంతమైన పార్టీగా ఎదగడం, సోనియా, రాహుల్ గాంధీలు అమేథీ, రాయబరేలీ లోక్‌సభ నియోజకవర్గాలకు పరిమితమై పోవటంతో 82 లోక్‌సభ సీట్లున్న ఉత్తర ప్రదేశ్‌లోని మిగతా ప్రాంతాల్లో కాంగ్రెస్ నాలుగు, ఐదు స్థానాలకు పడిపోయింది. ఇక మధ్య ప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, రాజస్తాన్ తదితర రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరిస్థితి అంతంత మాత్రమే.

మరింత సమాచారం తెలుసుకోండి: