ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఇప్పుడు సూపర్ పవర్ ఎవరు? ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడా? లేక బాబు వారసుడు.. తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుగా పేర్కొనబడ్డ లోకేశ్ బాబునా? అంటే..వీళ్ల సంగతి ఏమో కానీ.. తెలుగుదేశం ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేశ్ లు మాత్రం ఇప్పుడు సూపర్ పవర్ లలాగా.. వ్యవహరిస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వారు దిక్సుచులుగా ఉన్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బాబుతో ఉన్న సాన్నిహిత్యం మేరకు రాజ్యసభకు ఎన్నికైన వీరిద్దరూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రభావితం చేస్తున్నారట! మరి ఈ విషయాన్ని చెబుతున్నది ఎవరో కాదు... ప్రభుత్వ వ్యవహారాలను దగ్గర నుంచి సమీక్షిస్తున్న ప్రభుత్వ అధికారులే! ఈ మధ్యకాలంలో కొన్ని క్యాబినెట్ సమావేశాలకు కూడా సీఎం రమేశ్ , సుజనాచౌదరులు హాజరయ్యారట. వివిధ అంశాల గురించి తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారట! మరి రాజ్యసభ సభ్యులు రాష్ట్ర క్యాబినెట్ సమావేశానికి హాజరు కావడం ఏమిటి?! అని విస్తుపోవడం అధికారుల వంతు అయ్యిందట. చట్ట ప్రకారం క్యాబినెట్ సమావేశానికి హాజరయ్యే హక్కు మంత్రులకు మాత్రమే ఉంటుందట, అవసరార్థం, మంత్రుల పిలుపు మేరకు ప్రభుత్వాధికారులు ఆ సమావేశానికి హాజరవుతారని తెలుస్తుంది. అయితే ఎవరి పిలుపూ లేకుండా సుజనాచౌదరి, సీఎం రమేశ్ లు మాత్రం క్యాబినెట్ సమావేశంలో వచ్చి కూర్చొంటున్నారట. మరి ఈ విషయంలో సహజంగానే విమర్శలు వస్తాయి. ప్రభుత్వ వ్యవహారాల్లో వేరే వాళ్ల జోక్యంపై అధికారులే గొణుక్కొనే పరిస్థితి ఉంటుంది. ఇక మంత్రులు కూడా దీనిపై అసంతృప్తితో నే ఉన్నారట. అయితే సుజనా, సీఎం రమేశ్ లు చంద్రబాబుకు ఎంత సన్నిహితులో తెలిసిన వాళ్లు ఈ వ్యవహారంపై నోరు విప్పడానికి ధైర్యం చేయడం లేదు. అయితే బాబుగారికి వాళ్లిద్దరూ అంత ప్రధానమైన వ్యక్తుల అయితే వారిచేత రాజ్యసభకు రాజీనామా చేయించి... ఎమ్మెల్సీలుగా చేసి.. మంత్రి పదవులను ఇచ్చే సి ఉంటే.. ఏ సమస్య ఉండేది కాదు కదా.. అని బాబు సన్నిహితులు సూచనలు చేస్తున్నారు. మరి ఈ వ్యవహారంపై దుమారం రేగక ముందే.. చంద్రబాబు ఏదో ఒక రకంగా చర్యలు తీసుకొంటే మంచిదేమో!

మరింత సమాచారం తెలుసుకోండి: