తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం బుధవారం ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు. ఈ రెండు రోజుల పాటు హస్తినలోనే బస చేయనున్న నరసింహన్ ఆయన రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోడీ, హోంమంత్రి రాజ్‌నాధ్‌సింగ్‌లను కూడా కలుసుకుంటారు. రెండు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌గా నియమితులైన తర్వాత నరసింహన్, దేశ రాజధానికి రావడం ఇది రెండోసారి. గవర్నర్ పర్యటనపై ఎటువంటి ప్రకటన వెలువడకున్నా ప్రధానంగా హైదరాబాద్ నగరంతోపాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో తాజా పరిస్థితిని కేంద్రానికి వివరించేందుకే ఆయన హస్తినకు వెళాన్నారని తెలుస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేపై కూడా ఆయన కేంద్రప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తారని విశ్వసనీయ సమాచారం. హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతల నిర్వహణ, ఆస్తులు, సంస్థల భద్రత అధికారాలను గవర్నర్‌కు అప్పగించాలని తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం సర్క్యులర్ జారీ చేసిన తర్వాత నరసింహన్ ఢిల్లీకెళ్లడం ఇదే మొదటిసారి.ఆ సర్క్యులర్ రాజ్యాంగ విరుద్ధమని, రాష్ట్రప్రభుత్వ అధికారాలు హరించడమేనని తెలంగాణ ప్రభుత్వం కేంద్ర నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో గవర్నర్ హస్తిన పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. గవర్నర్‌కు అధికారాల అప్పగింతపై టీఆర్‌ఎస్ ఎంపీలు లోక్‌సభలో తీవ్ర నిరసన వ్యక్తం చేయడంతో హోంమంత్రి రాజ్‌నాథ్, ఆ పార్టీ ఎంపీలతో 18న ప్రత్యేకంగా సమావేశం కావాలని నిర్ణయించారు. కానీ రాజ్‌నాథ్ సింగ్‌కు అస్వస్థత కారణంగా ఈసమావేశం గురువారానికి వాయిదా పడింది. ఎంపీలతో రాజ్‌నాథ్ భేటీకి ముందే గవర్నర్, దేశరాజధానికి రావడం ప్రాధాన్యం సంతరించుకున్నది. ఆయన కేంద్రానికి సమర్పించే నివేదికలో ఏయే అంశాలు ప్రస్తావిస్తారన్నదానిపై ఆసక్తి నెలకొన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: