మోడీ పెట్టిన వందరోజుల కీలక పరీక్షలో బిజెపి పాలిత రాష్ట్రాలైన గుజరాత్‌, మధ్యప్రదేశ్‌ ఘోరంగా వైఫల్యం చెందుతున్నాయి. వందరోజులలో విద్యార్థినులకు బడులలో ప్రత్యేక మరుగుదొడ్లు నిర్మించాలని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం లక్ష్యంగా ఖరారు చేసింది. అయితే గుజరాత్‌, మధ్యప్రదేశ్‌లు ఈ విషయంలో పూర్తిగా వెనుకబడి ఉన్న 17 రాష్ట్రాల జాబితాలో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వ నివేదికలోనే వెల్లడైంది. ఇక వందరోజులలో ఇంటికో మరుగుదొడ్డి నిర్మాణం పూర్తి చేయాలనే మరో లక్ష్యంలో బిజెపి పాలిత రాష్ట్రాలే అయిన చత్తీస్‌ఘర్‌, గోవా, రాజస్థాన్‌లు చాలా వెనుకబడి ఉన్నాయి. కేంద్ర మంచినీరు, పారిశుద్ధ్య మంత్రిత్వశాఖ ఈ నివేదికను సిద్ధం చేసింది. బడులలో విద్యార్థినులకు ప్రత్యేక మరుగుదొడ్ల నిర్మాణానికి సహకరించాలని మోడీ కార్పొరేట్‌ సంస్థలను కోరారు. ఆ తరువాత ఇప్పటివరకూ ఈ విషయంలో జరిగిన పురోగతి గురించి కేంద్రం ఈ నివేదికను సిద్ధం చేసింది. గుజరాత్‌, జమ్మూకాశ్మీర్‌, మధ్యప్రదేశ్‌, మిజోరం, నాగాలాండ్‌ వంటి పలు రాష్ట్రాలు ఈ విషయంలో నిమ్మకునీరెత్తినట్లుగానే ఉన్నాయని వెల్లడైంది. కేంద్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నిర్మల్‌ భారత్‌ అభియాన్‌ పథకం పరిధిలో ఈ మంత్రిత్వశాఖ తొలి వంద రోజుల లక్ష్యాలను ఖరారు చేసింది. ఈ మేరకు వివిధ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సరైన స్పందన లేకపోవడం, ప్రత్యేకించి బిజెపి పాలిత రాష్ట్రాల నుంచి సరైన చర్యలు లేకపోవడంతో వందరోజుల లక్ష్య సాధన ఇప్పుడు ప్రశ్నార్థకంగానే మారింది. తన తొలి స్వాతంత్య్రదినోత్సవ సందేశంలో మోడీ ప్రత్యేకించి మహిళలకు ప్రత్యేక టాయిలెట్ల విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. 'మనం ఇప్పుడు 21వ శతాబ్దంలో ఉన్నాం. ఇప్పటికీ మన తల్లులు, చెల్లెళ్లు, బహిర్భూములకు కాలకృత్యాల కోసం వెళ్లాల్సి వస్తోంది. ఇది సిగ్గుచేటైన విషయం. మహిళకు గౌరవం కల్పించడం మన సంప్రదాయం. దీనిని కాపాడే బాధ్యత మనపై లేదా? కాలకృత్యాలు తీర్చుకోవడానికి మహిళలు చీకట్లోనే బయటికి వెళ్లాల్సిరావడం అంతవరకూ తమ బాధను దిగమింగుకుని ఉండటంతో వారికి శారీరకంగా పలు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. వ్యాధులు సంక్రమిస్తున్నాయి. మహిళకు సరైన మర్యాద కల్పించాల్సిన అవసరం మనకు లేదా' అని ఆనాటి ప్రసంగంలో మోడీ తీవ్రంగానే ప్రశ్నించారు. అయినప్పటికీ రాష్ట్రాల నుంచి సరైన స్పందన లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: