‘నీకు అసలు బడ్జెట్ గురించి తెలుసా..?’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఎస్ జగన్‌ను ప్రశ్నించారు. ‘అదిగో బాబు...ఇదిగో రుణమాఫీ..’ అంటూ ఎన్నికల ముందు ఇచ్చిన రుణ మాఫీ ఏమైంది? అని ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిఎం చంద్రబాబును ఎదురు ప్రశ్నించారు. బుధవారం రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రతిపాదించారు. సభ వాయిదా పడిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేర్వేరుగా మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఇది ‘జీరో’ బేస్డ్ బడ్జెట్ అని చంద్రబాబు తెలిపారు. బడ్జెట్‌లో కేంద్రం నుంచి 27 వేల కోట్ల రూపాయల గ్రాంట్లు రానున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్నదని, ఏ రాష్ట్రానికీ ఇంత పెద్ద మొత్తంలో నిధుల కేటాయింపు ఎప్పుడూ జరగలేదని, అది సాధ్యం కాదని జగన్ చేసిన వ్యాఖ్య గురించి ప్రశ్నించగా, చంద్రబాబు తీవ్రంగా ప్రతిస్పందించారు. ‘జగన్‌కు అసలు బడ్జెట్ అంటే ఏమిటో తెలుసా?’ అని ప్రశ్నించారు. జగన్ మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై వచ్చారని, ఇంకా తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది చాలా ఉందని అన్నారు. తనకు సుమారు 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉందని తెలిపారు. గత ప్రభుత్వాలు చేసిన పాపాలను కడిగేసేలా రాష్ట్ర బడ్జెట్ ఉందన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పుడే వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. ఇప్పుడు ఆ ప్రతిపాదనల్లో అంకెలను మార్పుచేయడం తప్ప కొత్తగా చేసేదేమీ లేదన్నారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో ఇప్పటివరకు ముగిసిన ఐదు నెలల్లో మూడు నెలలపాటు ఉమ్మడి పన్నుల వసూళ్లే జరిగాయని, రెండు నెలలుగా మాత్రమే ప్రత్యేక ఖాతాల ద్వారా ఆదాయం వస్తోందని గుర్తుచేశారు. ఈ పరిస్థితుల్లో బడ్జెట్ పెట్టాల్సి వచ్చిందన్నారు. రాజధాని నిర్మాణంలో భారాన్ని కేంద్రమే భరిస్తుందని, భూసేకరణకు అవసరమైతే దానిని రాష్ట్ర ప్రభుత్వం భరించేలా చూస్తామన్నారు. దీనికోసం మధ్యలో ద్రవ్య వినిమయ బిల్లులో మార్పులు చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయన్నారు. గతంలో జీరో బేస్డ్ బడ్జెట్ ప్రవేశపెట్టిన అనుభవం కూడా తనకు ఉందన్న విషయాన్ని చంద్రబాబు గుర్తుచేశారు. ఏడు మిషన్లపై కూడా స్పందిస్తూ 2029 లక్ష్యంగా కదులుతున్నట్లు వెల్లడించారు

మరింత సమాచారం తెలుసుకోండి: