నవ్యాంధ్ర ప్రదేశ్ లో కొత్త రాజధాని వేట కోసం జరుగుతున్న హంగామా అంతా ఇంతా కాదు.. ఓవైపు శివరామకృష్ణన్ కమిటీ పర్యటనలు.. మరోవైపు రాజధాని సలహా కమిటీ పర్యటనలు.. ఇవన్నీ చాలవన్నట్టు మంత్రులు రోజుకో ప్రకటనలు. ప్రపంచమంతా తిరిగొస్తాం.. బెస్ట్ కేపిటల్ కనిపెట్టేస్తాం.. డిట్టోగా మన కొత్త కేపిటల్ నిర్మిస్తామంటూ ఎన్ని కబుర్లు చెప్పారు. సింగపూర్, పుత్రజయ, బ్రెసీలియా.. కమిటీ విదేశీ పర్యటన జాబితా అలాగే ఉంది.  ఆమధ్య పురపాలక శాఖామాత్యులు నారాయణగారే సెలవిచ్చినట్టు.. కొత్త క్యాపిటల్ బ్రహ్మాండంగా కట్టాలంటే 4 లక్షల కోట్ల వరకూ ఖర్చవుతుంది. ప్రస్తుతం ఓ మాదిరిగా కట్టాలంటే.. కనీసం లక్షా 20 వేల కోట్ల వరకూ ఖర్చవుతుందని లెక్కలు కట్టారు. ఇక కొత్త రాజధాని ఎలా ఉండబోతోంది అంటూ మీడియాలోనూ బ్రహ్మాండంగా ఊహాగానాలు ప్రత్యేక కథనాలు కనిపించాయ్.. సీమాంధ్రుల ముందు అద్భుత ప్రపంచాన్ని ఆవిష్కరిస్తున్నాయ్. ఆకాశాన్నంటే ఆకాశహార్మ్యాలు, మెట్రో రైళ్లతో అలరారే ఆధునిక రాజధాని.. అంటూ భవిష్యత్ చిత్రాన్ని కళ్లకు కడుతున్నాయ్. అంతా బాగానే ఉంది. మాజీ రాష్ట్రపతి కలామ్ గారు చెప్పినట్టు.. కలలు కనడం మంచిదే.. స్వప్నించడంలోనూ పిసినారి తనం చూపగూడదు. ఉన్నత లక్ష్యాలు విధించుకోవడం తప్పు కానే కాదు. మరి అంతటి ఘన లక్ష్యాలను సాధించుకునేందుకు కృషి కూడా కావాలి కదా. మాటలు కోటలు దాటితే మనిషి ఇళ్లయినా కదలాలి కదా. పాత అనుభవాన్నంతా రంగరించి 10 నెలలకే లక్షా 11 వేల కోట్ల రూపాయల పైచిలుకు మొత్తంలో బడ్జెట్ రూపొందించిన యనమల వారు.. బడ్జెట్ లో కొత్త రాజధాని నిర్మాణానికి ఇదిగో ఇంత కేటాయిస్తున్నామంటూ ఒక్క పైసా కూడా లెక్క చెప్పలేదు.  అదేంటయ్యా మహానుభావా.. సీమాంధ్రుల డిజిటల్ కలర్ డ్రీమ్స్ నెరవేర్చేందుకు ఒక్క రూపాయి కూడా విదిల్చరా అని ప్రశ్నిస్తే ఆయనగారు సెలవిచ్చిన సమాధానం నభూతో నభవిష్యతి. రాజధాని నిర్మాణం కేంద్రం చూసుకుంటానంది.. అందుకే మన బడ్జెట్ లో ఆ సంగతి ప్రస్తావించలేదు అని బహు చక్కగా సెలవిచ్చేశారు. మొత్తం కేంద్రమే చూసుకునేటప్పుడు.. రాష్ట్రం ఒక్క రూపాయి కూడా విదిల్చనప్పుడు.. రాజధాని నిర్మాణం పేరుతో అంత హంగామా దేనికో.. జనాన్ని ఊరించి.. ఊరించి.. ఊహాల్లోనే ఉంచేందుకా.. అన్ని ప్రశ్నలకు సమాధానాలు అంత సులభంగా రావు.  నిజమే.. కొత్త రాజధాని నిర్మాణం కేంద్రం బాధ్యతే. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అచ్చంగా అదే చెబుతోంది. మరి అలాంటప్పుడు గతం గురించిన స్పృహ కూడా కాస్త ఉండాలిగా. మనదే కాదు కదా కొత్త రాష్ట్రం. గతంలోనూ కొత్త రాష్ట్రాల కోసం కొత్త రాజధానుల కోసం కేంద్రం సాయం చేసిందిగా.. మరి ఆ వివరాలు పరిశీలించారా.. ఆ పని చేస్తే.. రాజధాని పేరుట సాగుతున్న మల్టీకలర్ పిక్చర్ కాస్త ఒక్కసారిగా బ్లాక్ అండ్ వైట్ కలర్లోకి మారిపోతుంది. ఎందుకంటే.. చత్తీస్ గడ్ రాజధాని రాయ్ పూర్ కోసం గానీ, ఉత్తరాఖండ్, ఝార్కండ్ వంటి కొత్త రాష్ట్రాల రాజధానుల కోసం కేంద్రం విదిల్చిన మొత్తం చాలా తక్కువ మొత్తం. అంతా కలిపి వెయ్యి కోట్లయినా దాటదు. అది కూడా విడతల వారీగా..  సరే.. చంద్రబాబు గారికి కేంద్రం వద్ద బ్రహ్మాండమైన పలుకుబడి ఉంది. మోడీ గారితో మామంచి దోస్తానా ఉంది. దాని ప్రకారం కేంద్రం నుంచి నిధులు వచ్చిపారతాయ్.. కొత్త రాజధానిని బ్రహ్మాండంగా సాకారం చేస్తాయ్ అనుకోవడానికీ వీల్లేదు. కేంద్రం ఎంతగా సాయం చేయాలనుకున్నా.. దాని పరిమితులు దానికి ఉంటాయి. గతంలో పోలిస్తే.. బాబు గారు మరికాస్త ఒత్తిడి పెంచితే.. మహా అయితే మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే.. రాజధాని నిర్మాణం కోసం రెట్టింపు నిధులు వస్తాయి. అలాగైనా వచ్చి వాలేది మహా ఐతే రెండు వేల కోట్లు.. మరి ఈ చిన్న మొత్తంతో మన పంచరంగుల రాజధాని కలలు ఎలా నెరవేరతాయి.  ఓ పక్కన తెలంగాణకు హైదరాబాద్ వంటి అద్బుతమైన రాజధాని ఉంది. ఆ స్థాయిలో కాకపోయినా.. ఆంధ్రకూ ఓ మంచి రాజధాని ఉండాలని కోరుకోవడంలో తప్పులేదు. అందులోనూ అది ప్రెస్టీజ్ ఇష్యూ కూడా. హైదరాబాద్ మనది కాదని అన్న తర్వాత.. దాని బాబంటి నగరాన్ని నిర్మించుకుంటామని ఆవేశంలో అనడంలో అర్థముంది కానీ.. దాన్ని సాకారం చేసుకునే వివేచన కూడా కావాలి కదా.  ఆ మధ్య రాజధాని కోసం విరాళాలంటూ కొన్ని చానళ్లు హడావిడి చేశాయి. ఏకంగా రాష్ట్రప్రభుత్వం కూడా సచివాలయంలో హుండీలు పెట్టి విమర్శలు రావడంతో వాటిని పక్కకు పెట్టింది. మొన్నటి ఆగస్టు 15 ప్రసంగంలోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని నిర్మాణం ఊసెత్తలేదు. ఇప్పుడు బడ్జెట్లోనూ నిధుల కేటాయింపు ప్రసావనే రాలేదు.  ఇకనైనా చంద్రబాబు సర్కారు రాజధానిపై పంచరంగుల స్వప్నాలను కట్టిపెట్టాలి. వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరించాలి. కొత్త రాజధాని నిర్మాణంలో ప్రజలను భాగస్వామ్యులను చేయాలి. ఇది గొప్పలకు, ప్రతిష్టకు పోయే సమయం కాదు. అరచేతిలో వైకుంఠం చూపి ఆనక.. ఉట్టి చేతులు చూపే పరిస్థితి రాకూడదు. ముందుగా ఊహాల్లో ఊరేగడం మాని.. నేలకు దిగి వాస్తవ దృశ్యాన్ని ఆకళింపు చేసుకోవాలి. ఆ మధ్య సీనియర్ రాజకీయవేత్త వడ్డీ శోభనాద్రీశ్వరావు ఇదే చెప్పారు. వేల వేల ఎకరాలు ఎందుకు.. ముందు మనకు చేతనైనంతలో ఉన్న సౌకర్యాలనే వినియోగించుకుంటూ రాజధాని ప్రస్థానం ప్రారంభిస్తే మంచిదంటూ ఆయన చేసిన సూచనలు ఆలోచించతగ్గవే. ప్రజలకు ఎల్లకాలం ఊహల్లో విహరింపచేయడం సాధ్యంకాదన్న విషయం బాబు అండ్ టీమ్ గుర్తిస్తే మంచిది.  

మరింత సమాచారం తెలుసుకోండి: