అమిత్‌షాతో , సినీ హీరో పవన్‌కల్యాణ్‌ భేటీ అయ్యారు. గురువారం హైదరాబాద్‌ పర్యటనకు వచ్చి... బేగంపేటలోని టూరిజం హోటల్‌లో బస చేసిన అమిత్‌ షాను రాత్రి 10.45 గంటల ప్రాంతంలో పవన్‌ కలిశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయడంపైనే వీరి మధ్య ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ పొత్తు పెట్టుకుని పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లోనూ పవన్‌ కల్యాణ్‌ సేవలను వినియోగించుకోవాలని బీజేపీ, టీడీపీ భావిస్తున్నాయి. అయితే... గ్రేటర్‌ ఎన్నికల్లో జన సేన నేరుగా బరిలోకి దిగుతుందా, లేక బీజేపీ, టీడీపీ కూటమికి మద్దతు పలుకుతారా అన్న అంశంపై స్పష్టత లేదు. మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తే... టీఆర్‌ఎస్‌, మజ్లిస్‌లను దీటుగా ఎదుర్కొనవచ్చని అమిత్‌షా, పవన్‌ భేటీలో ఓ అంచనాకు వచ్చినట్లు సమాచారం. ‘‘జీహెచ్‌ఎంసీపై కూటమి జెండాను ఎగురవేయాలంటే... మీరూ కలిసి రావాలి’’ అని పవన్‌ను అమిత్‌షా అనునయించినట్లు తెలిసింది. భేటీ అనంతరం పవన్‌ కల్యాణ్‌ మీడియాతో మాట్లాడారు. రెండు రాష్ట్రాలకు సంబంధించి బీజేపీ, జనసేన మధ్య ఒక ప్రతిపాదన వచ్చిందన్నారు. ఆ ప్రతిపాదన ఏమిటో ఇప్పుడు బయటపెట్టలేనని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: