కేంద్ర కేబినెట్‌కు దూరమైన ఎల్‌కే ఆడ్వాణీ, మురళీ మనోహర్‌ జోషీ ఇప్పుడు బీజేపీ పార్లమెంటరీ బోర్డుకు కూడా దూరం కానున్నారా!?  మోదీ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తన కేబినెట్‌లో చేరికకు 75 ఏళ్ల వయో పరిమితిని విధించిన విషయం తతెలిసిందే. దీంతో, ఆడ్వాణీ, మురళీ మనోహర్‌ జోషీలకు కేబినెట్‌లో చోటు దక్కలేదు. తాజాగా, పార్టీ పార్లమెంటరీ బోర్డులో సభ్యత్వానికి కూడా 75 ఏళ్ల వయో పరిమితిని విధించాలని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ పెద్దలు భావిస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం బీజేపీ పార్లమెంటరీ బోర్డుకు రాజ్‌నాథ్‌ సింగ్‌ అధ్యక్షుడు కాగా వాజపేయి, ఆడ్వాణీ, నరేంద్ర మోదీ, అరుణ్‌ జైట్లీ, సుష్మా స్వరాజ్‌, నితిన్‌ గడ్కరీ, వెంకయ్య నాయుడు, గెహ్లాట్‌, మురళీ మనోహర్‌ జోషి సభ్యులుగా ఉన్నారు. అనంతకుమార్‌ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అయితే, బీజేపీపీపీలో సభ్యత్వానికి 75 ఏళ్ల వయో పరిమితిని విధిస్తే వాజపేయి, ఆడ్వాణీ, మురళీ మనోహర్‌ జోషీ తప్పుకోవాల్సి వస్తుంది. వాజపేయి ఎలాగూ క్రియాశీలంగా లేరు కనక ఆడ్వాణీ, జోషీలు పార్టీ అత్యున్నత విధాన నిర్ణాయక సంస్థ నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. పార్టీ కార్యవర్గాన్ని పునర్వ్యవస్థీకరించిన బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా ఇప్పుడు పార్లమెంటరీ బోర్డులో మార్పుల దిశగా పావులు కదుపుతున్నారని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: