పద్నాలుగేళ్ల ప్రత్యేక పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, అధికార పీఠాన్ని అధిష్టించిన పార్టీ... తెలంగాణ రాష్ట్ర సమితి. రాష్ట్రానిచ్చింది మేమేనంటూ కాంగ్రెస్ పార్టీ చెప్పినా, తెచ్చింది మేమంటూ మరో పార్టీ మొత్తుకున్నా... తెలంగాణ ప్రజానీకం మాత్రం కారు గుర్తుకే పట్టం కట్టారు. అయితే అందుకోసం పార్టీ అధినేత కేసీఆర్ వేసిన ఎత్తులు అన్నీ ఇన్నీ కావు. అలకబూనిన నాయకులను ఆగబట్టి, టిక్కెట్ దక్కని వాళ్లను బుజ్జగించి టీఆర్ఎస్ ను విజయ పథాన నడిపించారు. ఇంతవరకు భాగానే ఉంది కానీ ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలు మాత్రమే కాదు. పార్టీ నాయకులకూ ఇచ్చిన ఎమ్మెల్సీ హామీ ఇప్పుడు ఎలా తీరుస్తారన్నదే ప్రశ్నగా మారింది. నల్లగొండ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నాయకుడు కర్నె ప్రభాకర్ కు తాజాగా ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టింది కేసీఆర్ ప్రభుత్వం. గవర్నర్ నామినేటెడ్ కోటాలో ప్రభాకర్ కు ఈ పదవి దక్కింది. అంతకుముందు కూడా ప్రభుత్వం కొలువుదీరగానే నాయిని నర్సింహ్మారెడ్డి, రాములు నాయక్ లకూ ఎమ్మెల్సీ పదవులిచ్చి మాట నిలుపుకున్నారు కేసీఆర్. అయితే ఈ ఎమ్మెల్సీ పదవుల కోసం ఆశిస్తున్న వారు, హామీ పొందిన వారూ ప్రతి జిల్లాలోనూ దాదాపు పది మంది వరకూ ఉన్నారు. ఇప్పుడు వాళ్లంతా వచ్చే అవకాశం తమదేనన్న ధీమాతో ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో అసెంబ్లీ టిక్కెట్ కోసం ఇద్దరిద్దరు పోటీ పడ్డారు. అలాంటి వారిలో ఒకరిని ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తానని చెప్పి కేసీఆర్ బుజ్జగించారు. అలాంటి వారి సంఖ్య సుమారు ఒక యాభై వరకు ఉంది. ఏ రకంగా చూసుకున్న ఈ అయిదేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం మహా అయితే మరో పది నుంచి పదిహేను మాత్రమే ఎమ్మెల్సీ పదవులను దక్కించుకునే అవకాశం ఉంది. దీంతో మిగిలిన వారి పరిస్థితి ఎలా ఉంటుందోననే అనుమానాలు నాయకుల్లో ఎప్పుడో మొదలయ్యాయి. అయితే పక్క పార్టీల వాళ్లే టీఆర్ఎస్ లోకి క్యూ కట్టిన నేపథ్యంలో... ఇక్కడే ఏదో ఒక నామినేటెడ్ పోస్టు తీసుకోవడం తప్ప మరో ఆలోచన చేయలేరు అనేది మాత్రం గ్యారెంటీ.

మరింత సమాచారం తెలుసుకోండి: