రజనీకాంత్.. భారత దేశంలో ఇంత క్రేజ్ ఉన్న హీరో మరొకొరు ఉండరు. స్టైల్ గురించి, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పుకోవాలంటే రజనీ తరవాతే ఎవరైనా.. వయసైపోయినా ఆయనలోని స్టార్ డమ్. యాక్టింగ్ పవర్, ఎనర్జీ ఏ మాత్రం తగ్గలేదు. 63 ఏళ్ల వయసులోనూ అంత చలాకీ నటించడం రజినీకే చెల్లింది. అంత వయసొచ్చినా.. ఆయన పక్కన హీరోయిన్ గా నటించే అవకాశం రావడం పూర్వజన్మసుకృతమనుకోని హీరోయిన్ ఉండదంటే అతిశయోక్తి కాదు. తమిళనాట సినిమాలు, రాజకీయాలు కలగలసి ఉంటాయి. నటుడు ఎంజీఆర్ తో మొదలైన ఈ ఆనవాయితీ ఆ తర్వాత చాలా మంది సినీరంగానికి చెందిన వ్యక్తులను రాజకీయాల్లోకి తెచ్చింది. ప్రస్తుత ముఖ్యమంత్రి జయలలిత, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి సినీరంగానికి చెందినవారే. సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి రావాలని ఆయన అభిమానులు ఎప్పటినుంచో కోరుకుంటున్నా.. రజినీ మాత్రం వారిని కరుణించడం లేదు. కాకపోతే.. ఎన్నికల సమయంలో తన అభిమానులకు మార్గనిర్దేశం మాత్రం చేస్తుంటారు. అది కూడా అప్పుడప్పుడే. తాజా రాజకీయాల్లోకి వస్తే.. దక్షిణ భారతంపై కన్నేసిన బీజేపీ.. తమిళనాడు రాజకీయాలపై దృష్టి పెట్టింది. ఉత్తరభారతంలో బాగానే పాతుకుపోయినా.. దక్షిణాన కర్ణాటకలో తప్ప కమలం అంతగా వికసించలేదు. కర్ణాటకలోనూ కుంభకోణాల కారణంగా కళ కోల్పోయింది. ఆంధ్రప్రదేశ్ లో పుంజుకుందామంటే అక్కడ టీడీపీతో ఉన్న స్నేహం ముందర కాళ్లకు బంధం వేస్తోంది. ప్రత్యేక రాష్ట్ర నినాదంతో తెలంగాణలో పుంజుకుందామని ప్రయత్నించినా.. మాటల మాంత్రికుడు చంద్రశేఖరుడి మాయాజాలంతో ఆ ఆశలు కూడా గల్లంతయ్యాయి. పేరుకు జాతీయ పార్టీయే అయినా... దేశవ్యాప్తంగా 300కు పైగా పార్లమెంటరీ స్థానాలు సాధించినా.. దక్షిణాదిని దండెత్తాలన్న కోరిక మాత్రం మోడీ పరివారాలనికి తీరని కలే అయ్యింది. ఇప్పటికే యూపీలో పార్టీ ప్రాభావాన్ని కొత్త పుంతలు తొక్కించిన బీజేపీ కొత్త అధ్యక్షుడు అమిత్ షా ఈ విషయంపై ఇప్పుడు దృష్టి కేంద్రీకరించారు. దక్షిణాదిలో పుంజుకునేందుకు తమిళనాడును కార్యక్షేత్రంగా మలచుకోవాలని భావిస్తున్నారు. అక్కడ ఇంకో రెండేళ్లలో ఎన్నికలు జరగబోతున్నాయి. తమిళనాట.. కొన్నిదశాబ్దాలుగా అధికారం డీఎంకే, అన్నా డీఎంకేల మధ్యే చేతులు మారుతూ వస్తోంది. జాతీయ పార్టీలను అధఃపాతాళానికి తొక్కిన ఘన చరిత్ర.. ప్రాంతీయ పార్టీల ప్రాభవానికి శ్రీకారం చుట్టిన నేపథ్యం తమిళనాడుదే. అనుకున్నది సాధించేవరకూ నిద్రపోని లక్షణం అమిత్ షా సొంతం. తమిళనాడులో పాగా వేయాలంటే.. అందుకు సూపర్ స్టార్ రజనీకాంత్ ను ముగ్గులోకి దించడమొక్కటే కనుచూపు మేరలో ఉన్న పరిష్కారమని ఆయన గ్రహించాడు. రజనీ ఛరిష్మాకు మోడీ కరిష్మా తోడైతే.. తమిళనాడు కొత్త రాజకీయ సునామీ సృష్టించవచ్చని ఆయన బలంగా నమ్ముతున్నారు. అయితే అమ్మ జయలలిత.. కాకుంటే కళ్లజోడు కరుణానిధి.. ఇప్పటివరకూ తమిళ ఓటర్లకున్న ఆప్షన్స్ ఇవే. ఈ రాజకీయ సంప్రదాయానికి చరమగీతం పాడుదామని విజయ్ కాంత్ వంటి సినీ నటులు ఇప్పటికే ప్రయత్నించినా సఫలం కాలేకపోయారు. ఇక రజనీకాంత్ విషయానికి వస్తే.. రజనీ ఒకప్పుడు రాజకీయాలంటే విముఖత చూపించిన మాట వాస్తవమే అయినా.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. 63 ఏళ్ల వయసులో సినిమాలు తీస్తున్నా.. ప్రేక్షకులు ఆదరిస్తున్నా... ఇంకా హీరోగా కొనసాగడం వయసురీత్యా కూడా అంత మంచిది కాదని అర్థమైపోయింది. సినిమాలకు నుంచి రిటైరవ్వాల్సిన సమయం వచ్చిందని ఆయన కూడా గుర్తించారు. ఇప్పుడు రాజకీయ రంగ ప్రవేశానికి ఆయన అంతగా వ్యతిరేకించకపోవచ్చు. అందులోనూ మోడీ వంటి నాయకుడు.. స్వయంగా కోరితే.. అడుగడుగునా అండగా నిలుస్తానని భరోసా ఇస్తే రజనీ ఆ ఆఫర్ ను వ్యతిరేకించే అవకాశాలు తక్కువ. సీఎం అభ్యర్థిగా రజనీకాంత్ ను ప్రకటించి 2016 తమిళనాడు అసెంబ్లీ సమరాన్ని ఎదుర్కోవాలని కమలనాథులు భావిస్తున్నారు. ఈమేరకు అమిత్ షా రజనీకాంత్ ను ఇప్పటికే ఫోన్ ద్వారా సంప్రదించారని తెలుస్తోంది. మొన్నటి సార్వత్రిక సమరం సమయంలో.. చెన్నైకి వచ్చిన మోడీ రజనీని స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి కలిశారు. ఈమధ్యనే బీజేపీకి చెందిన సీనియర్ నేత కూడా రజనీని కలిశారు. ఈ వరుస భేటీల అంతరార్థం రజనీని కమలం పార్టీలోకి లాగడమే అన్న సంగతి అర్థమైపోతూనే ఉంది. పోరాడితే పోయేదేమీలేదన్నట్టు.. తమిళనాడులో బీజేపీ బలం దాదాపు శూన్యం. కేంద్రంలో అధికారం చేతిలో ఉంది. చేతిలో రెండేళ్ల సమయం ఉంది. అసాధ్యాన్ని సుసాధ్యం చేసే అమిత్ షా మంత్రదండం ఉంది. అభిమానులను వెర్రెత్తించే రజనీ మాయాజాలం ఉంది. వీటన్నిటినీ సమర్థంగా ఉపయోగించి 2016లో తమిళనాట సరికొత్త రాజకీయ చిత్రాన్ని ఆవిష్కరించాలని బీజేపీ కలలు కంటోంది. బీజేపీ వ్యూహానికి రజనీ ఓకే చెబితే ఈ స్వప్నం సాకారం కావడం అంత సులభం కాకపోవచ్చేమో కానీ అసాధ్యం కాదు. బీజేపీ వ్యూహం అలా ఉంటే.. మరి రజనీకాంత్ సంగతేంటి.. ఇప్పటివరకూ ఉన్న సమాచారం ప్రకారం రజనీ కాంత్ కమలం ఆఫర్ ను అంగీకరించలేదు.. అలాగని తిరస్కరించనూ లేదు. ఆయన దీర్ఘ ఆలోచనలో ఉన్నాడు. కమలం ఆఫర్ బాగానే ఉన్నప్పటికీ.. ఒకసారి ఓకే చెబితే.. ఇక అతడు కమల సైనికుడవుతాడు. మోడీ చెప్పినట్టు వినాల్సి వస్తుంది. తమిళనాడులో అధికారం అంటూ దక్కితే అందుకు రజనీదే ప్రధాన పాత్ర అవుతుంది. అంటే కష్టం రజనీది.. పెత్తనం మోడీదీ అవుతుందన్నమాట. రజనీకాంత్ కమలం ఆఫర్ అంగీకరించేదానికన్నా.. సొంతగానే పార్టీ పెట్టుకుంటే ఎలా ఉంటుంది. ఎవరికిందో పనిచేయడం దేనికి.. సర్వస్వతంత్రుడిగా పాలన సాగించవచ్చు కదా.. ఈ తరహా ఆలోచనలు బాగానే ఉన్నా.. ఒక్క రజనీ మాయాజాలం అధికారం చేతికందేంతగా వర్క ఔట్ అవుతుందా.. ఈ సందేహం సూపర్ స్టార్ కు లేకపోలేదు.. ఎందుకంటే.. సొంత రాష్ట్రంలోని విజయ్ కాంత్ అనుభవం, పొరుగు రాష్ట్రంలోని చిరంజీవి పరాభవం.. రజినీకి తెలియనివి కావు. రజనీ అభిమాన ప్రభంజనానికి.. మోడీ ఫ్యాక్టర్ జత అయితే... రాజకీయ సునామీ ఖాయం కావచ్చని.. రాజకీయపరిశీలకు భావిస్తున్నారు. ఇది రజనీకి కీలక సమయం.. రిస్క తీసుకోవాలా.. అవకాశం అందిపుచ్చుకోవాలా.. తేల్చుకోవాల్సిన సమయం.. ఒకవిధంగా చెప్పాలంటే... ఇలాంటి సందిగ్ద పరిస్థితే.. ఇటీవల తెలంగాణ ఉద్యమ వీరుడు కేసీఆర్ కూ వచ్చింది. ఎన్నికల ముందు ఆయన ఇదే ఊగిసలాటలో కొన్నాళ్లు గడిపారు.. కాంగ్రెస్ లో పార్టీని కలిపేయాలా.. లేక ఒంటరిగా ఎన్నికల బరిలో దిగాలా.. ఈ ప్రశ్న చాలారోజులు కేసీఆర్ ను వెంటాడింది. ఒక దశలో కాంగ్రెస్ లో పార్టీని కలిపేందుకు మొగ్గు చూపాడు. ఆ రకంగా ప్రకటన కూడా చేశాడు.. కానీ పార్టీని కాంగ్రెస్ లో కలిపేస్తే.. తానూ శతకోటి లింగాల్లో ఓ బోడి లింగం.. కాంగ్రెస్ కల్చర్ తెలిసిందే.. అంతా హైకమాండ్ దయ. అందుకే పునరాలోచనలో పడ్డాడు. పార్టీ నేతలతో మేథోమథనమే జరిపాడు. చివరికి రిస్క్ తీసుకున్నాడు.. రతనాల తెలంగాణ రాజకీయ నజరానగా అందుకున్నాడు. మరి రజనీకాంత్.. కేసీఆర్ లాంటి రిస్క్ తీసుకుంటాడా.. సొంత పార్టీ పెడతారా.. లేకపోతే.. పెద్దగా రిస్క్ లేకుండా కమలం తరపున సీఎం అభ్యర్థిగా బరిలో దిగుతారా.. ఏదీకాకుండా.. గతంలోలాగానే ఆధ్యాత్మికం.. హిమాలయాలు.. అంటూ చివరి రోజులు ప్రశాంతంగా గడుపుతారా.. ఇప్పుడు రజనీ అభిమానులకు.. ఒక్క రజనీ అభిమానులనే కాదు. రాజకీయ విశ్లేషకులకూ ఉత్కంఠరేపుతున్న ప్రశ్నలివి.. శివాజీరావ్ గైక్వాడ్.. కండక్టర్ గా జీవితం ఆరంభించాడు.. నటనలో ఎవరెస్టంత పేరు సాధించాడు. అలాగే రాజకీయాల్లోనూ ఉన్నత శిఖరాలు ఆధిరోహిస్తాడా.. సినిమాల్లో సూపర్ స్టార్ గా తనదైన స్టైల్ చూపించిన రజనీ రాజకీయాల్లోనూ తిరుగులేని ఆధిక్యత ప్రదర్శిస్తారా.. వెయిట్ అండ్ సీ..

మరింత సమాచారం తెలుసుకోండి: