ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లకు సంబంధించిన వివాదం ఇంకా కొనసాగుతోంది. ఫలితంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై ఉద్యోగుల వత్తిడి పెరిగింది. అయితే సిబ్బంది డిమాండ్ల ఈ తరుణంలో సహేతుకం కాదనే అభిప్రాయంతో సి.ఎం. వున్నట్టు సమాచారం. ఈ పరిస్థితులలో ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం తమ డిమాండ్లను వెనక్కి పరిస్థితి లేకపోవడంతో పరిస్థితి ఆసక్తికరంగా మారింది. ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి అనుసరించనున్న పాత్రకూడా చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇరు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల పంపిణీకి సంబంధించిన విధివిధానాలు ఇప్పటికే ఖరారు అయిపోయాయి. ఇందుకోసం నియమించిన కమలనాధన్‌ కమిటీ సుదీర్ఘమైన కసరత్తు చేసింది. వారి సూచనల విూద ప్రతిష్టంభన కూడా ఏర్పడింది. గవర్నర్‌ ఆధ్వర్యంలో జరిగిన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సు ోనూ దీనికి సంబంధించిన చర్చోపచర్చలు జరిగాయి. సీఎంలు ఒక నిర్ణయానికి వచ్చారు. అనంతరం ఇరు రాష్ట్రాల చీఫ్‌ సెక్రటరీలు కూడా కమలనాధన్‌ కమిటీ సిఫారసులకు ఆమోద ముద్ర వేస్తూ సంతకాలు చేశారు. ఫలితంగా వ్యవహారం మొత్తం ఒక కొలిక్కి వచ్చినట్లయింది.అయితే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఉద్యోగుల్లో మాత్రం కొంత అసంతృప్తి ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఉద్యోగుల విభజనకు సంబంధించిన అంశాలను ఇంకా మార్చవలసి ఉన్నదని వారు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో వారు తమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను కలిసి ఆ మేరకు ప్రత్యేకంగా విన్నవించుకున్నారు. విభజన నిబంధనల్లో మార్పులు చేయాల్సి వుందని ఆయనను కోరారు. అయితే ఉద్యోగుల వినతులకు చంద్రబాబు మాత్రం పాజిటివ్‌గా స్పందించలేదని అభిజ్ఞవర్గాల సమాచారం. కనీసం వారికి కంటితుడుపు మాటలు చెప్పి పంపడం వంటిది కూడా చేయకుండా చంద్రబాబు కేవలం ఈ విషయంపై అధికారులతో మాట్లాడతానని మాత్రం చెప్పినట్లు వార్తలు వచ్చాయి. నిజానికి అధికారులకు ఉద్యోగుల విభజన నిబంధనల్లో పెద్ద ఇబ్బంది లేదు. అధికారులంతా అంగీకరించిన తర్వాతనే సీఎస్‌లు సంతకాలు చేయడం కూడా పూర్తయింది. తాము చేసిన సంతకాలు లోపభూయిష్టం అని అర్థం వచ్చేలా ఇప్పుడిక వారు ఎందుకు సిఫారసు చేస్తారనేది ఒక ప్రశ్న. అదే విధంగా ఒకసారి సీఎస్‌లు సంతకాలు చేసిన తర్వాత నిబంధనల్లో మార్పులు, చేర్పులు కమలనాధన్‌ కమిటీకి నివేదించుకునే విషయం కాదు, ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించాల్సిన విషయం అనే విషయం విదితమే.. అందువల్ల తమకు అభ్యంతరాలు ఉన్నా సరే ఏపీ ఉద్యోగులు సర్దుకుపోవాల్సిందేనని, కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబును ఆశ్రయించడం వలన ఉపయోగం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: