తెలంగాణ ప్రతిష్టాత్మకంగా భావించి, విజయవంతంగా నిర్వహించిన కార్యం సమగ్ర సర్వే. ఈనెల 19 న ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా కోటికి పైగా కుటుంబాల నుంచి వివరాలు సేకరించిన కార్యక్రమం అది. దేశంలోనే ఇలాంటి బృహత్తర సర్వే కార్యక్రమం చేపట్టడం ఇదే తొలిసారి అయినా... దానిని విజయవంతంగా నిర్వహించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ కార్యక్రమం దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది అని కేసీఆర్ చెప్పినట్లుగానే ఘనంగా ముగిసిన ఆ సమగ్ర సర్వే పై ఇప్పుడు దేశ ప్రధాని నరేంద్ర మోడీ దృష్టి పడినట్లు తెలుస్తోంది. దీనిపై ఆయన పూర్తి స్థాయి వివరాలతో కూడిన నివేదికను సైతం విశ్లేషిస్తున్నారని వినికిడి. ఇటీవల ఇరు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోడీని కూడా కలుసుకున్నారు. ఈ సందర్భంగానే మోడీ గవర్నర్ ను సమగ్ర సర్వే వివరాలపై ఆరా తీశారని తెలిసింది. శుక్రవారం పీఎంతో సుమారు అరగంటపాటు భేటీ అయిన నరసింహన్... ఇరు రాష్ట్రాలకూ సంబంధించిన అనేక అంశాల పై చర్చించారు. అయితే మోడీ మాత్రం ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే గురించి అడిగినట్లు తెలిసింది. సర్వే ఎందుకు చేశారు? దాని ఉద్దేశాలు ఏమిటి? అని ప్రశ్నించినట్లు సమాచారం. ఇరు రాష్ట్ర ప్రభుత్వాల పని తీరు గురించి కూడా నమో వాకబు చేశారు. నేరుగా ప్రధాని సర్వే వివరాలు అడిగిన నేపథ్యంలో గవర్నర్ నరసింహన్ సమగ్ర సర్వే పై ఓ నివేదికను సమర్పించారని తెలుస్తోంది. అయితే గవర్నర్ కార్యాలయం మాత్రం మోడీని మర్యాద పూర్వకంగా మాత్రమే నరసింహన్ కలుసుకున్నారని ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం తమ సర్వేను ఆదర్శంగా తీసుకుని దేశ వ్యాప్తంగా చేపట్టిన ఆశ్చర్యం లేదని... అలాంటి బృహత్తర సమగ్ర కార్యక్రమం ఇది అవుతుందని గతంలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ పేర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా పీఎం నరేంద్ర మోడీ వివరాలు ఆరా తీయడమంటే సమగ్ర సర్వే ప్రభావం జాతీయ స్థాయిలోనూ ఉందని ఒప్పుకోక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి: