దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వ శాఖల మధ్య నెలకొన్న ఎడతెగని విభేదాలపై ప్రధాని మోడీ విస్మయం వ్యక్తం చేసి సరిగ్గా వారం రోజులవుతోంది. ఎర్రకోట నుంచి చేసిన ప్రసంగంలో మోడీ వ్యక్తం చేసిన ఆవేదన నిజమేనని రూఢీ చేశాయి దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఐబీ. రూఢీ చేయడమేనా, ఏకంగా దేశ అత్యున్నత న్యాయ స్థానం ముందు సిగపట్లు పట్టుకునేందుకు సిద్ధమయ్యాయి. వివరాల్లోకి వెళితే... గుజరాత్ లో సంచలన కలిగించిన ఇష్రాత్ జహాన్ నకిలీ ఎన్ కౌంటర్ కు ఐబీ ఇచ్చిన ఊహాజనిత నివేదికే కారణమన్న సీబీఐ, ఈ కేసులో ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) అధికారుల పాత్ర కూడా ఉందంటూ నలుగురు ఐబీ అధికారుల పేర్లను తన చార్జీషిటులో చేర్చింది. సీబీఐ చర్యతో ఐబీ ఒక్కసారిగా భగ్గుమంది. వాస్తవాలను వదిలేసిన సీబీఐ, దుందుడుకుగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ గురువారం సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.  అంతేకాక నాటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీతో పాటు బీజేపీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీని హతమార్చే నిమిత్తం లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు ముష్కరులు గుజరాత్ కు చేరుకున్నారన్న అంశంపై నాటి తన నివేదికను ఇందుకు సాక్ష్యంగా కోర్టు ముందుంచింది. మరోవైపు లష్కరే తోయిబా పన్నాగంపై ఐబీ ఊహాజనిత నివేదికతోనే రాష్ట్ర పోలీసులు నకిలీ ఎన్ కౌంటర్ కు పాల్పడ్డారని సీబీఐ ఆరోపిస్తోంది. అయితే మోడీ ఆవేదనను నిజం చేస్తూ రెండు అత్యున్నత దర్యాప్తు సంస్థలు ఇలా బహిరంగంగా వాదులాటకు దిగిన కేసు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గుజరాత్ లో నమోదైనది కావడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: