ముఖ్యమంత్రి చంద్రబాబుని ఇరకాటంలో పెట్టాలని ప్రయత్నించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వ్యూహం బెడిసికొట్టిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు నాయకులు అసెంబ్లీ లోపలా బయటా తెంపు లేకుండా జగన్‌పై, ఆయన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డిపై తీవ్రమైన ఆరోపణలు వ్యాఖ్యలు చేస్తూ ఎదురుదాడికి దిగుతున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత మాఫియాపై ఉక్కుపాదం మోపారని తెలుగుదేశం పార్టీ శానససభ్యుడు శ్రవణ్‌కుమార్ అన్నారు.  జగన్ దగ్గరకు వెళ్తే కొడతారేమో అనే భయం కలుగుతోందని బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. శాంతిభద్రతలపై చర్చలో భాగంగా ఆయన మాట్లాడుతూ జగన్ నిస్పృహలో ఉన్నట్లు కన్పిస్తున్నారని అంటూ ఆయన్ని 10 రోజులు సెలవుపై పంపించండని స్పీకర్‌ను కోరారు. జగన్ ఆస్పత్రిలో చూయించుకుంటే మంచిదని ఎమ్మెల్యే అన్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ సభలో రౌడీలా వ్యవహరిస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. స్పీకర్‌పై జగన్ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని మంత్రి తప్పుబట్టారు. శాసనసభ చట్టం ప్రకారం జరుగుతుందని స్పష్టం చేశారు. తమపై అనుచిత వ్యాఖ్యలు చేసి క్షమాపణ చెప్పకపోయినా ఆయన విజ్ఞతకే వదిలేశామని మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. అయితే శాసనసభలో స్పీకర్ కోడెల శివప్రసాద రావు అధికార పక్షానికి తోడ్పడుతూ తనపై దాడికి సహకరిస్తున్నారని జగన్ అభిప్రాయపడుతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: