ప్రధాని నరేంద్ర మోడీకి, తన ఆకట్టుకునే ప్రసంగంతో గడచిన ఎన్నికల్లో ప్రజాభిమానం వెల్లువెత్తింది. ఎన్నికలు ముగిసి మూడు నెలలైనా మోడీకి ట్విట్టర్ లో ఏమాత్రం ఫాలోయింగ్ తగ్గలేదు. తాజాగా బీజేపీ విడుదల చేసిన ఓ నివేదికే ఇందుకు నిదర్శనం. పార్టీ తరఫున కొనసాగుతున్న ట్విట్టర్ ఫాలోయింగ్ లో నేటికీ మోడీ, అగ్రస్థానంలోనే నిలిచారు. 82 లక్షల మంది ఫాలోయర్లు, నిత్యం మోడీ ట్విట్టర్ అకౌంట్ ను సందర్శిస్తూ ఉంటారు. మోడీ తర్వాత ట్విట్టర్ ఫాలోయింగ్ లో బీజేపీ నేతలెవ్వరూ దాదాపు దరిదాపుల్లో కూడా లేరనే చెప్పాలి. 14 లక్షల మంది ఫాలోయర్లతో విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్, మోడీ తర్వాతి స్థానంలో నిలిచారు. ఆ తర్వాత మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ 6.52 లక్షల మంది ఫాలోయర్లతో మూడో స్థానంలో ఉన్నారు. ఇక ఆర్థిక మంత్రిత్వ శాఖతో పాటు రక్షణ శాఖ బాధ్యతలు భుజానేసుకున్న అరుణ్ జైట్లీని 6.21 లక్షల మంది నెటిజన్లు ట్విట్టర్ లో ఫాలో అవుతున్నారు. బీజేపీ మాజీ అధ్యక్షుడు, కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ 5.6 లక్షల ఫాలోయర్లతో ఐదో స్థానంలో నిలవగా, ఢిల్లీ సీఎం బరిలో నిలిచి పరాజయం పాలై, కేంద్ర మంత్రివర్గంలో స్థానం సంపాదించిన హర్ష వర్ధన్ కు 2.71 లక్షల మంది ఫాలోయర్లున్నారు. ట్విట్టర్ ఫాలోయింగ్ కు సంబంధించిన అందరి నివేదికలను ప్రతి మంత్రిత్వ శాఖకు పంపుతున్నామని ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ చెప్పారు. ట్విట్టర్ ఫాలోయింగ్ లో తమను అనుసరిస్తున్న ఫాలోయర్ల సంఖ్య ఆధారంగా ఆయా మంత్రులు తమ పనితీరును బేరీజు వేసుకునేందుకే ఈ తరహా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: