తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి కంచుకోటగా ఉన్న ఖమ్మం జిల్లాలో ఆ పార్టీ నేతలు ప్రస్తుతం అలజడి నెలకొంది. పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీకి పెద్దదిక్కుగా ఉంటూ జిల్లాలో పార్టీని అంతా తానై నడిపిస్తున్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు టిఆర్‌ఎస్‌లో చేరనున్నారనే ప్రచారంతో ఆయనకు మద్దతుగా ఆయా గ్రామాలు, నగరాలు, పట్టణాల్లో పోస్టర్లు, ఫ్లెక్సీలు వెలిశాయి. ఇంకా కొంత మంది ఏకంగా మండల స్థాయి సమావేశాలు ఏర్పాటు చేసి తుమ్మలతోనే తమ పయనం అంటూ ప్రకటించారు. ఇటీవలనే జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన గడిపల్లి కవిత సైతం తుమ్మలతోనే తాము కూడా ఉంటామని స్పష్టం చేశారు. అంత వరకు బాగానే ఉన్నా గడిచిన ఎన్నికల వరకు ఖమ్మం జిల్లాలో తుమ్మల నాగేశ్వరరావు, నామ నాగేశ్వరరావుల వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ఎన్నికల సమయంలో ఒకరికొకరు సహకరించుకోలేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. చివరకు తుమ్మల నాగేశ్వరరావు పాలేరు నుంచి పోటీ చేయాలని భావించినప్పటికీ నామ అడ్డుకున్నాడని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తదనంతరం పరిణామాల్లో జిల్లాలో బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీ సత్తుపల్లి శాసనసభా స్థానంలో మాత్రమే విజయం సాధించింది. అప్పటి నుంచి స్తబ్ధుగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు త్వరలోనే టిఆర్‌ఎస్‌లో చేరనున్నారనే ప్రచారం ముమ్మరంగా సాగటంతో పార్టీకి చెందిన ప్రధాన నాయకులంతా ఆయన వెంటే వెళ్ళేందుకు సిద్ధమవుతుండటంతో కార్యకర్తల్లో కొంత అలజడి రేగుతోంది. ఖమ్మం జిల్లాలో పార్టీకి గట్టి పట్టు ఉన్నప్పటికీ నాయకులు వెళ్ళిపోతే ఇంకా ఏమి ఉంటుందని మరికొందరు భావిస్తున్నారు. ఇదే సమయంలో తుమ్మల వెళ్ళిపోతే తమ పరిస్థితి ఏంటని, ప్రస్తుతం నామ కూడా రాజకీయాలకు దూరంగా వ్యాపార పనుల్లో బిజీగా ఉన్నారని నామ వర్గీయులు ఆలోచిస్తున్నారు. నామ నాగేశ్వరరావు జిల్లాకు వచ్చి నాయకులందరితో మాట్లాడితే తుమ్మలతో వెళ్ళే వారి సంఖ్య కొంత మేరకు తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. లేని పక్షంలో ఇప్పటి వరకు మీమాంసలో ఉన్న నేతలు తుమ్మలతో పాటే వచ్చే నెల మొదటి వారంలో టిఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర నాయకత్వం దీనిపై చర్చించి నిర్ణయం తీసుకోని పక్షంలో జిల్లాలో పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారనుందని సీనియర్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: