సోమశిల-స్వర్ణముఖి లింక్ కెనాల్‌ను పూర్తిచేస్తా.. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ప్రతి ఎకరాకూ నీళ్లందిస్తా’నని ఎన్నికల ప్రచారంలో బీరాలు పలికిన అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఇప్పుడు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. భూసేకరణ వివాదం తేలకపోవడంతో సోమశిల-స్వర్ణముఖి ప్రాజెక్టు పనులను సొంత శాఖ అధికారులే అడ్డకుం టున్నా బొజ్జల చోద్యం చూస్తున్నారు. ఓటు దాటాక బొజ్జల వ్యవహరిస్తున్న తీరుపై శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలు మండిపడుతున్నారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాల్లోని రాపూరు, డక్కిలి, వెంకటగిరి, శ్రీకాళహస్తి, ఏర్పేడు, తొట్టంబేడు మండలాల్లో 87,734ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడం.. 316 చెరువుల కింద కొత్తగా 23,266 ఎకరాలకు నీళ్లందించడమే లక్ష్యంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.300 కోట్ల వ్యయంతో సోమశిల-స్వర్ణముఖి లింక్ కెనాల్ ప్రాజెక్టును 2006లో చేపట్టారు. నెల్లూరు జిల్లాలో సోమశిల రిజర్వాయర్ నుంచి 5.26 టీఎంసీల నీటిని లింక్ కెనాల్ ద్వారా తరలించి.. ఆయకట్టుతోపాటూ 1.11 లక్షల ఎకరాలకు సాగు నీరందించి, 2.50 లక్షల మంది ప్రజల దాహార్తిని కూడా తీర్చాలని నిర్ణయించారు. ఇందుకు సోమశిల రిజర్వాయర్ నుంచి స్వర్ణముఖి నది వరకూ 111 కిలోమీటర్ల మేర కాలువ తవ్వడానికి అప్పట్లోనే టెండర్లు పిలిచారు. ఈ లింక్ కెనాల్‌కు అవసరమైన ప్రణాళిక సంఘం, అటవీ, హైడ్రలాజికల్ అనుమతులను అప్పట్లోనే తెచ్చారు. సోమశిల-స్వర్ణముఖి లింక్ కెనాల్ తవ్వకానికి 1450 ఎకరాల ప్రైవేటు భూమి, 980 ఎకరాల ప్రభుత్వ భూమి, 2,600 ఎకరాల రిజర్వు ఫారెస్ట్ భూమిని సేకరించాలని అధికారులు తేల్చారు. ప్రభుత్వ, ప్రైవేటు భూమిని సేకరించడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ.. అటవీశాఖ భూమిని సేకరించాలంటే అందుకు ప్రతిఫలంగా భూమితోపాటూ, భూసేకరణలో పోయే ప్రతి చెట్టుకూ పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ప్రతిఫలంగా కేటాయించిన భూమిలో అడవి పెంపకానికి నిధులు కేటాయించాల్సి ఉంటుంది. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హఠన్మరణంతో సోమశిల-స్వర్ణముఖి లింక్ కెనాల్ పనులకు గ్రహణం పట్టుకుంది. ఆ హామీ ఏమైనట్టు ------------------- ఎన్నికల్లో సోమశిల-స్వర్ణముఖి లింక్ కెనాల్‌ను బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ప్రచారాస్త్రంగా చేసుకన్నారు. ఈ లింక్ కెనాల్‌ను పూర్తిచేయడం ద్వారా శ్రీకాళహస్తి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తానని హామీ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో గెలుపొందిన బొజ్జలకు చంద్రబాబు మంత్రివర్గంలో అటవీశాఖ దక్కింది. అటవీశాఖ బొజ్జలకు దక్కిందిలే.. ఇక సోమశిల-స్వర్ణముఖి లింక్ కెనాల్ పనులు పరుగులెత్తుతాయని శ్రీకాళహస్తి ప్రజలు భావించారు. కానీ.. ప్రజల ఆశలను బొజ్జల అడియాశలు చేశారు. శ్రీకాళహస్తి అటవీ ప్రాంతంలో 190 కంపార్ట్‌మెంట్లో 640 ఎకరాల అటవీ భూమి స్వర్ణముఖి-సోమశిల లింక్ కెనాల్ తవ్వకానికి అవసరం అవుతుంది. ఆ మేరకు అటవీశాఖకు మరో చోట భూమి చూపించి.. పరిహారం అందిస్తే అనుమతి ఇస్తుంది. కానీ.. ప్రభుత్వం అటవీశాఖకు మరో ప్రాంతం 640 ఎకరాల భూమిని చూపించలేదు. పరిహారంగా చెల్లించాల్సిన మొత్తాన్నీ చెల్లించలేదు. భూసేకరణ వివాదం తేలకపోవడంతో సోమశిల-స్వర్ణముఖి లింక్ కెనాల్ పనులకు అటవీశాఖ అధికారులు అడ్డు తగలుతున్నారు. ఇటీవల మూడు పర్యాయాలు పనులను అడ్డుకున్నారు. తాజాగా మంగళవారం ఏర్పేడు మండలం చింతలపాళ్యం, అముడూరుల్లో లింక్ కెనాల్ పనులను అటవీశాఖ అధికారులు అడ్డుకున్నారు. సొంత శాఖ అధికారులే లింక్ కెనాల్ పనులను అడ్డుకుంటున్నా అటవీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి నోరుతెరవడం లేదు. వివాదాన్ని తెరదించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. అటకెక్కించే ఎత్తుగడ..: ------------------------ అటవీ భూవివాదాన్ని సాకుగా చూపి సోమశిల-స్వర్ణముఖి లింక్ కెనాల్ ప్రాజెక్టును అటకెక్కించేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఎత్తులు వేస్తోందని నీటిపారుదలశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రాజెక్టు పనులకు రూ.150 కోట్లు కేటాయించాలని ఆశాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనలను ప్రభుత్వం పరిగణనలోకి కూడా తీసుకోలేదు. ఈనెల 20న శాసనసభలో 2014-15 బడ్జెట్లో సోమశిల-స్వర్ణముఖి లింక్ కెనాల్ పనులకు ఒక్క పైసా కూడా కేటాయించకపోవడమే అందుకు తార్కాణం. నిధులు కేటాయించని నేపథ్యంలో సోమశిల-స్వర్ణముఖి లింక్ కెనాల్‌పై చంద్రబాబు ప్రభుత్వం శీతకన్ను వేసినట్లు స్పష్టమవుతోంది. అటవీ వివాదాన్ని సాకుగా చూపి ఈ ప్రాజెక్టును అటకెక్కించేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆ వివాదాన్ని పరిష్కరించాల్సిన మంత్రి బొజ్జల నోరుమెదపకపోవడం ఇందుకు బలం చేకూర్చుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: