తెలంగాణ కేసీఆర్ తీసుకునే నిర్ణయాలు చాలావరకూ వివాదాస్పదంగా, సంచలనం కలిగించేలా ఉంటాయి. ఆ కోవలోకి వచ్చేదే..ఈ నిర్ణయం కూడా. దసరా నుంచి జంటనగరాల్లో కల్లు దుకాణాలు పునరుద్దరిస్తారట. ఇదేదో కొత్త ముచ్చట కాదు. టీఆర్ఎస్ ఎన్నికల హామీల్లో ఇది కూడా ఒకటి. కానీ అమలు చేస్తుందా లేదా అన్న సందేహం చాలా మందికి కలిగింది. దీనిపై చాలా విమర్సలూ వచ్చాయి. బ్రాండ్ హైదరాబాద్ పేరు చెడగొడుతున్నారని చాలా మంది మండిపడ్డారు కూడా. ఏదేమైనా కేసీఆర్ మొండిపట్టువిడువడన్న సంగతి తెలిసిందే. అందుకే ఇప్పటికే ఈ విషయంలో... మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం జరిగిపోయింది. ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదముద్ర పడింది. దసరా పండగ నుంచి దుకాణాలను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించారు. ఇందుకోసం అనుసరించాల్సిన విధానంపై అధికారుల కమిటీని నియమించింది. ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి బీఆర్ మీనా, కమిషనర్ అహ్మద్ నదీంతో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. దుకాణాల పునరుద్ధరణకు సంబంధించి అనుసరించాల్సిన విధివిధానాలపై కమిటీ ప్రభుత్వానికి తన నివేదికను అందించింది. గతంలో హైదరాబాద్, సికింద్రాబాద్‌లో 43 కల్లు సహకార సంఘాల ఆధ్వర్యంలో 120 దుకాణాలు నడిచేవి. అయితే ఇపుడు ఎన్ని దుకాణాలకు ప్రభుత్వం అనుమతిస్తుందన్నది తేలాల్సి ఉంది. చెట్ల సంఖ్య ఆధారంగా సొసైటీలకు దుకాణాల అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. ఆయా సొసైటీలకు చెట్లను కూడా కేటాయించాల్సి ఉంటుంది. అయితే గతంతో పోలిస్తే చెట్ల సంఖ్య భారీగా తగ్గింది. శివారు ప్రాంతాల్లో చెట్లు లేకుండా పోయాయి. దీంతో ప్రస్తుతం జిల్లాల్లో ఉన్న చెట్లపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎన్ని సహకార సంస్థలకు, ఎన్ని దుకాణాలకు అనుమతులు ఇస్తుందన్నది తేలాల్సి ఉంది. దుకాణాల పునరుద్ధరణ నేపథ్యంలో నిఘా, అమలు పర్యవేక్షణను అధికారుల కమిటీ ప్రధానంగా ప్రస్తావించింది. గత అనుభవాల నేపథ్యంలో ఈ విషయంలో పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని కమిటీ తన నివేదికలో స్పష్టం చేసింది. కల్తీ కల్లుకు తావు లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ఇందుకోసం అవసరమైతే ప్రత్యేక యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేయాలని అభిప్రాయపడింది. దుకాణాలు నెలకొల్పే ప్రదేశాలకు సంబంధించి కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇదే అదనుగా రెచ్చిపోయే.. నకిలీ మద్యం, కల్తీసారా, గుడుంబాపై ఉక్కుపాదం మోపుతామని ప్రభుత్వం చెబుతోంది. పదేపదే తప్పులు పునరావృతమైతే పీడీ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: