కేంద్రంలో కొత్త ప్రభుత్వం 100 రోజుల వేడుక చేసుకునేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పడింది. ఉన్నతస్థాయిలో భేదాభిప్రాయాలు పొడచూపిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ, హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో పాటు బిజెపి నుండి అమిత్‌షా నష్ట నివారణ చర్యలకు దిగారు. ఇందులో భాగంగా వేర్వేరుగా ప్రకటనలు చేశారు. దుష్ప్రవర్తన కారణంగా రాజ్‌నాథ్‌సింగ్‌ కుమారుడు పంకజ్‌పై ప్రధాని మోడీ ఆగ్రహావేశాలు వ్యక్తం చేసినట్లు మీడియాలో వార్తలు రావడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. పాలకపార్టీలోని ఈ లుకలుకలు, మీడియా వార్తలపై ప్రతిపక్షపార్టీలు ధ్వజమెత్తడంతో మోడీ, రాజ్‌నాథ్‌సింగ్‌లతో పాటు బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా కూడా రంగంలోకి దిగారు. మంత్రులకు వ్యతిరేకంగా ప్రచారం నిరాధారం, తప్పుదారి పట్టించే ప్రచారం అంటూ వార్తలను ఖండించారు. ఈ పరిణామాలన్నీ పరిశీలిస్తే....బిజెపి ప్రభుత్వం, పార్టీలో అంతర్గత వివాదం, లుకలుకలు ఉన్నట్లు గోచరిస్తోంది. మొత్తంమీద హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ మెడకు ఉచ్చు బిగుసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆయన కుమారుడిపై ఆరోపణల వార్తల నేపథ్యంలో నిరూపిస్తే రాజకీయాల నుండి వైదొలుగుతానని ఆయన తాజా ప్రకటన చేశారు. రాజ్‌నాథ్‌సింగ్‌ కుమారుడు పంకజ్‌ దుర్నడతపై మోడీ అసంతృప్తితో ఉన్నారని, దీనిపై ఆయన హెచ్చరికలు కూడా చేసినట్లు వార్తాపత్రికల్లో రావడాన్ని రాజ్‌నాథ్‌సింగ్‌ ఖండించారు.  తన కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఎలాంటి దుష్ప్రవర్తనకు పాల్పడినట్లు ప్రాధమికంగా రుజువు చేసినా తాను రాజకీయాల నుండి వైదొలగుతానని ప్రకటించారు. మీడియాకు భావోద్వేగ ప్రకటన చేసిన రాజ్‌నాథ్‌సింగ్‌ తన కుటుంబ సభ్యులు తప్పులు చేస్తున్నట్లుగా గత 15 రోజుల నుండి పుకార్లు హల్‌చల్‌ చేస్తున్నాయన్నారు. ''గత 15-20 రోజులుగా తాను, తన కుటుంబ సభ్యులపై పుకార్లు వస్తూనే ఉన్నాయి. ఈ పుకార్లకు ఎలాంటి ఆధారం లేదు. వీటికి తెరపడకపోతుందా? అని చూశాను. కానీ, రోజురోజుకూ ఈ పుకార్లు పెరుగుతూనే వచ్చాయి. నా మీద లేదా నా కుటుంబ సభ్యుల మీద వచ్చిన ఈ ఆరోపణలను ప్రాధమి కంగా నిరూపించినా రాజకీయాలు, ప్రజా జీవితం నుండి తప్పుకుని ఇంట్లో కూర్చుంటాను'' అని ప్రకటించారు. ఉత్తరబ్లాక్‌లోని తన కార్యాలయం వెలుపల హడావిడిగా ఏర్పాటుచేసిన జర్నలిస్టుల ఇష్టాగోష్టిలో ఈ విషయం చెప్పారు. ఈ విషయంపై తాను ప్రధాని మోడీ, బిజెపి అధ్యక్షుడు అమిత్‌షాతో మాట్లాడానని, ఇద్దరూ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారని, ఈ పుకార్లు పూర్తిగా నిరాధారమని పేర్కొన్నారు. ఈ పుకార్లు ఎవరు పుట్టించారు అని అడిగిన ప్రశ్నకు పరిశోధనాత్మక జర్మలిస్టులు ఈ విషయాన్ని నుగొనాలని చెప్పారు. రాజకీయ ప్రత్యర్థి ఈ పుకార్లను పుట్టించే అవకాశాలు ఉన్నాయా? అని అడిగిన ప్రశ్నకు దీనిపై తాను ఏమీ మాట్లాడలేనని చెప్పారు. ఈ ఆరోపణలపై ప్రధానమంత్రి కార్యాలయం కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ వార్తలను కొట్టేసిన ప్రధాని కార్యాలయం ఇవన్నీ పచ్చి అబద్దాలని, ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేందుకు దురుద్దేశంతో చేసినవని, ఇది కళంకితం చేసే ప్రయత్నమని పేర్కొంది. ఇదే విషయంపై బిజెపి అధ్యక్షుడు అమిత్‌ షా కూడా ప్రత్యేకంగా ప్రకటన చేశారు. మంత్రుల నైతికతపై ఎలాంటి సందేహం లేదని పేర్కొన్న ఆయన పంకజ్‌పై ఆరోపణలను ఖండించారు. తమ ప్రభుత్వంలో మంత్రులను కొంతకాలంగా ఒక సెక్షన్‌ మీడియా లక్ష్యంగా చేసుకుందని అన్నారు. రాజ్‌ నాథ్‌సింగ్‌, ఆయన కుమారుడిపై వచ్చిన ఆరోపణల గురించి మాట్లాడుతూ రాజ్‌నాథ్‌ రాజకీయ జీవితం గౌరవం, ప్రతిష్ట, నిజాయితీతో కూడినదని, ఆయనపై ఆరోపణలు నిరాధారమని పేర్కొన్నారు. కాగా, ఈ వార్తలపై ప్రకటనలు చేసిన పలు పార్టీలు విభిన్నరకాలుగా స్పందించాయి. దీనిపై ప్రభుత్వాన్ని ప్రతిపక్షం నిలదీయగా కొన్ని పార్టీలు హోంమంత్రికి మద్దతుగా మాట్లాడాయి. రాజ్‌నాథ్‌సింగ్‌కు మద్దతుగా మాట్లాడిన జెడి(యు) నాయకుడు శరద్‌ యాదవ్‌ హోంమంత్రి మచ్చలేనివాడని అన్నారు. ఎన్‌సిపి నాయకుడు డి.పి.త్రిపాఠి కూడా ఇదేవిధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సమాజ్‌వాదీ పార్టీ కూడా రాజ్‌నాథ్‌కు అనుకూలంగానే ప్రకటన చేసింది. రాజ్‌నాథ్‌సింగ్‌పై ఎలాంటి సందేహాలు లేనప్పటికీ వారు ఇచ్చిన వివరణ సమస్యను మరింత జఠిలం చేసిందని ఎస్పీ నాయకుడు గౌరవ్‌ భాటియా అన్నారు. అసలు పుకార్లు ఏంటి అనేవి బయటపెట్టాలని ప్రతిఒక్కరు అడుగుతున్నారని ఆయన పేర్కొన్నారు. బిజెపి తరపున ప్రకటన చేసిన పార్టీ ప్రతినిధి సంబిత్‌ పత్ర ఇందులో ఆర్థిక అవకతవకల ఆరోపణలను కొట్టిపారేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: