ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు భయం పట్టుకుంది. మూడు జోన్లుగా రాజధానిని ఏర్పాటుచేయడమే ఉత్తమమని, ఒకచోట మొత్తం అభివృద్ధిని కేంద్రీకరిస్తే సమస్యలు తప్పవని శివరామకృష్ణన్ కమిటీ తన తుది నివేదికలో చెప్పడంతో ఇప్పుడు ఏం చేయాలో తెలియక తలపట్టుకున్నారు. ఈ విషయమై చర్చించేందుకు మంత్రులతో అత్యవసరంగా సమావేశమయ్యారు. అసెంబ్లీ వాయిదా పడటంతో వెంటనే అందుబాటులో ఉన్న మంత్రులందరితో సమావేశం ఏర్పాటుచేసి శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన తుది నివేదికలోని అంశాలపై వారితో చర్చించారు. ఎవరు పడితే వాళ్లు ఎలా పడితే అలా ప్రకటనలు చేయొద్దని క్లాసు పీకినట్లు సమాచారం. రాజధాని అంశంలో మంత్రులెవరూ భిన్ప ప్రకటనలు చేయొద్దని, కమిటీ కేంద్రానికి నివేదిక ఇచ్చిందని ఆయన అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏకాభిప్రాయానికి వచ్చాకే రాజధానిని ప్రకటిస్తామని ఆయన అన్నారు. కేవలం అసెంబ్లీ, సచివాలయం, కొన్ని ప్రధాన కార్యాలయాలను మాత్రమే విజయవాడ- గుంటూరు మధ్య ఏర్పాటుచేసి, హైకోర్టు, ఇతర కార్యాలయాలను ఉత్తరాంధ్ర, రాయలసీమలకు కేటాయించాలని కమిటీ నివేదిక ఇవ్వడంతో ఇప్పుడు చంద్రబాబుకు గుబులు పట్టుకుంది. మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు లాంటివాళ్లు ఇప్పటికే రాజధాని గురించి ప్రకటనలు చేయడం, విజయవాడ - గుంటూరు మధ్యనే వస్తుందని చెప్పడం, కమిటీ విషయాన్ని సీఎం, పీఎం చూసుకుంటారనడంతో ఇప్పుడు కక్కలేక, మింగలేక అన్నట్లు తయారైంది. చంద్రబాబుతో సహా మంత్రులంతా విజయవాడ సమీపంలోనే రాజధాని ఏర్పాటు చేయాలని ఇప్పటికే పలు సందర్భాలలో చెప్పారు. అయితే కమిటీ ఇందుకు విరుద్ధంగా చెప్పింది. ఇదే ఇప్పుడు వాళ్లందరినీ ఆలోచనలో పడేసింది. ap capital city, chandra babu naidu, sivarama krishnan committee, ఆంధ్రప్రదేశ్ రాజధాని, చంద్రబాబు నాయుడు, శివరామకృష్ణన్ కమిటీ

మరింత సమాచారం తెలుసుకోండి: