జరుగుతున్న ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఎదురే లేదని ఆ పార్టీ నిజామాబాద్ ఎంపీ కె. కవిత అన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుందని జోస్యం చెప్పారు. గురువారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్ లో కవిత విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి... ఎన్ని రూపాయిలు ఇచ్చి బీజేపీ టిక్కెట్ కొనుకున్నాడో వెల్లడించాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డికి సవాల్ విసిరారు. అదికాక జగ్గారెడ్డి తరఫున కిషన్ రెడ్డి మాట్లాడటం విచిత్రంగా ఉందని ఎద్దేవా చేశారు. మాపై విమర్శలు చేస్తే సహించేది లేదని బీజేపీ, టీడీపీలను కవిత హెచ్చరించారు. టీడీపీ, బీజేపీల గెలువడం అనైతికమైనదని ఆమె అభివర్ణించారు. ఇప్పటికే ఆ రెండు పార్టీలను ప్రజలు తిరస్కరించారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు కాదు.... తెలంగాణ ప్రభుత్వ విధానాలే మెదక్ ఉప ఎన్నికల్లో తమ పార్టీని గెలిపిస్తాయని చెప్పారు. హైదరాబాద్ నగరంలో గవర్నర్ గిరికి వ్యతిరేకంగా పోరాడిన ఘనత తమదేనని కవిత వెల్లడించారు. పవర్స్టార్ పవన్ కల్యాణ్కు దిమ్మదిరిగే ఫలితాలు ఇప్పటికే తెలంగాణ ప్రజలు ఇచ్చారని కవిత గుర్తు చేశారు. మెదక్ ఉప ఎన్నికల్లో బీజేపీ, టీడీపీలకు పవన్ కల్యాణ్ ప్రచారం చేస్తారని విలేకరి అడిగిన ఓ ప్రశ్నకు కవిత సమాధానం చెబుతూ... తెలంగాణలో ఆయన ప్రచారం చేసిన వచ్చిన సీట్లు ఎన్నో ఆయా పార్టీలకే తెలియాలి. గత ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో ఆయనకు ఇప్పటికే దిమ్మదిరిగిందని కవిత తెలిపారు. మరో ప్రశ్నకు సమాధానంగా టీడీపీని పట్టంచుకోవాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: