ఆంధ్రప్రదేశ్ లో రాజధాని ఎంపిక అంశం రసకందాయంలో పడింది. ఏపీ సీఎం చంద్రబాబు ఆలోచనలకు.. కేంద్రం ఎంపిక చేసిన కమిటీ ఆలోచనలకు భూమికి, ఆకాశానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది. ఇప్పటికి కొత్త రాజధానిగా బెజవాడ-గుంటూరు ఏరియాను ప్రపంచంలోనే అద్భుత నగరంగా తీర్చిదిద్దాలని చంద్రబాబు ఈస్ట్ మన్ కలర్లో కలలు కంటుంటే.. బాబూ.. అంతొద్దు.. ఇది చాలు అంటూ శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ఇచ్చింది. భారీఎత్తున రాజధాని నిర్మాణమనేది అనవసరమని, అందువల్ల నష్టమే ఎక్కువగా ఉంటుందని కేంద్ర హోంశాఖకు సమర్పించిన నివేదికలో స్పష్టం చేసింది. అభివృద్ధి ఫలాలు., ఉద్యోగావకాశాల్లో అన్నిప్రాంతాలకు సమాన భాగస్వామ్యం టేనే.... రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని కుండబద్దలు కొట్టింది. రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాలు.. వేర్వేరు వనరులతో ఉన్నందున వాటన్నింటినీ ఉపయోగించుకునేలా అభివృద్ధి జరగాలని సూచించింది. విస్తృత కసరత్తు జరిపారట.. నవ్యాంధ్రప్రదేశ్‌ రాజధాని ఎంపిక కోసం ఏర్పాటైన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మాజీ కార్యదర్శి శివరామకృష్ణన్‌ నేతృత్వంలోని కమిటీ తాము రాష్ట్రంలోని పలు ప్రాంతాలను సందర్శించామని, ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన వెబ్‌సైట్‌కు 5 వేలకుపైగా సూచనలు అందాయని నివేదికలో వివరించింది. విభజన సందర్భంగా హైదరాబాద్‌పై జరిగిన రగడను గుర్తుచేసింది. అసెంబ్లీ, కోర్టులు, వివిధ విభాగాలు, కమిషనరేట్లు, ప్రభుత్వేతర సంస్థలు అక్కడ కేంద్రీకృతమవడం వల్లే వివాదస్పదమైందని పేర్కొంది. ఇది దృష్టిలో పెట్టుకుని నవ్యాంధ్రప్రదేశ్‌లోనూ ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ ఒకేచోట ఏర్పాటు చేయడం సరికాదని తెలిపింది. ఒకేచోట భారీ ఎత్తున రాజధాని నిర్మాణానికి భూములు కూడా లేవన్న కమిటీ రాష్ట్రంలో ప్రస్తుత మౌలికవసతులను వివరించింది. సూపర్ రాజధాని అవసరం లేదట.. వేర్వేరు నగరాల మధ్య ఇప్పటికే రోడ్డు, రైలు సౌకర్యాలున్నాయని తెలిపిన కమిటీ వాటిని మరింత విస్తరించడం సహా అత్యాధునిక కమ్యూనికేషన్‌ పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ వివిధ ప్రభుత్వశాఖల మధ్య అనుసంధానాన్ని సాధించవచ్చని తెలిపింది. ఫలితంగా రాష్ట్రంలో ఒక సూపర్‌ నగరాన్ని నిర్మించాలన్సిన అవసరం ఏర్పడదని హితవు పలికింది. కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్య విజయవాడ కేంద్రంగా రాజధానిని ఏర్పాటుచేస్తారంటూ ఇటీవల పెద్దఎత్తున ప్రచారం జరుగుతోందని గుర్తుచేసిన కమిటీ, ఈ ప్రాంతం ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమలకు మధ్యలో ఉంటుందనే వాదన వినిపిస్తోందని పేర్కొంది. కానీ విజయవాడ-గుంటూరు మధ్య లేదా చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటుచేస్తే రాష్ట్రానికి ఆర్థికంగా, పర్యావరణపరంగా దీర్ఘకాలంలో నష్టం జరుగుతుందని వివరించింది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల అభివృద్ధికి అవరోధం ఏర్పడుతుందని హెచ్చరించింది. ఇదే సమయంలో మార్టూరు, వినుకొండ ప్రాంతాలను రాజధాని ప్రాంతంగా రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించవచ్చని కమిటీ సూచించింది. ఈ రెండు చోట్ల 5 వేల హెక్టార్ల బంజరు భూములు, డీగ్రేడెడ్‌ అటవీ భూములు ఉన్నాయని బెంగళూరు- గుంటూరు రైల్వే మార్గంలో వినుకొండకు ఇప్పటికే రైల్వేస్టేషన్‌ ఉందని వివరించింది. మార్టూరు, వినుకొండ, దొనకొండలు కర్నూలు, అనంతపురంలకు ఎక్కువ దూరంలో లేవని గుర్తు చేసింది. బెజవాడ-గుంటూరుతో భవిష్యత్తులో ముప్పే.. గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో అత్యుత్తమ వ్యవసాయ భూములున్నాయన్న కమిటీ వాటిని వ్యవసాయతేర పనులకు ఉపయోగిస్తే వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మంది రోడ్డున పడతారని హెచ్చరించింది. స్థిరాస్తి వ్యాపారులు మాత్రమే లాభపడతారని చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అందించిన సమాచారం ప్రకారం ఈ 3 జిల్లాల్లో సాగుచేయని, అటవీ భూములు చాలా తక్కువగా ఉన్నాయని తెలిపింది. మంగళగిరి ప్రాంతానికి ఆనుకుని అభయారణ్యం ఉన్నప్పటికీ, ఇప్పటికే ఇక్కడ రెండు భారీ సంస్థలు ఉన్నాయి. ఎయిమ్స్‌ ఏర్పాటుకు 200 ఎకరాలు కేటాయించనున్నట్లు తెలిసిందని పేర్కొంది. గన్నవరం విమానాశ్రయం ప్రాంతాన్ని కూడా పరిశీలించామన్న కమిటీ దానిని అంతర్జాతీయ విమానాశ్రయంగా అభివృద్ధి చేయడానికి భూమి సరిపోదని తెలిపింది. విమానాశ్రయానికి 10 కిలోమీటర్ల దూరంలో రెండు ప్రాంతాలున్నప్పటికీ అక్కడ రాళ్ల తవ్వకాలు పెద్దఎత్తున జరుగుతున్నాయని, పునరావాస సమస్యలొస్తాయని వివరించింది. అలా చేస్తే సాగు చంకనాకి పోద్దంట... విజయవాడకు ఉత్తరాన కృష్ణానది సమీపంలో ఉన్న ప్రాంతాన్ని కూడా పరిశీలించామన్న కమిటీ ఇక్కడ పొగాకు పంట ఎక్కువగా సాగవుతోందని, భూములు చాలావరకు.. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్నాయని వెల్లడించింది. అధిక ధరలకు ప్రైవేటు భూములను సేకరిస్తే కొత్త ప్రాజెక్టులు చేపట్టడం కష్టమవుతుందని పేర్కొంది. విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి అభివృద్ధికి వీజీటీఎం సమగ్ర ప్రణాళిక తయారుచేసిందన్న కమిటీ ఈ ప్రాంతంలో మొత్తం 18 లక్షల మంది ఉంటే 82 శాతం వ్యవసాయంపై ఆధారపడి ఉన్నవారేనని తెలిపింది. వీజీటీఎం పరిధిలో పలు రకాల ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటుచేయడం సాధ్యంకాదని, ఒకేచోట అభివృద్ధి ఉంటే మిగతా ప్రాంతాలు నష్టపోయే అవకాశం ఉన్నందున ఆ ప్రతిపాదన కూడా సరికాదని కమిటీ అభిప్రాయపడింది. రాష్ట్రమంతటా ప్రభుత్వ కార్యకలాపాలు విస్తరిస్తే... అంతటా అభివృద్ధి జరుగుతుందని సూచించింది. మూడు రాజధాని ప్రాంతాలు- వాటి ప్రత్యేకతలు... రాజధాని కార్యకలాపాలు, సంస్థల ఏర్పాటు కోసం కమిటీ మూడు ప్రాంతాలను సూచించింది. వీటిని వైజాగ్‌ జోన్, రాయలసీమ జోన్, కాళహస్తి జోన్లుగా పేర్కొంది. వాటిలో మొదటిది.. వైజాగ్ జోన్. ఈ జోన్ చాలా కాలంగా భారీ పరిశ్రమలు, ఉత్పత్తి, విభిన్న సాంకేతిక సంస్థలకు కేంద్రంగా ఉందని కమిటీ తెలిపింది. ఈ ప్రాంత అభివృద్ధి కోసం పలు ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తోన్న 109దాకా ప్రభుత్వ డెరెక్టరేట్లను... వైజాగ్ ప్రాంతంలో ఏర్పాటు చేయడం శ్రేయస్కరమని పేర్కొంది. కమిటీ గుర్తించిన మరో రాజధాని జోన్...ఇది కర్నూలు నుంచి అనంతపురం, చిత్తూరు, హిందూపురం, తిరుపతి మీదుగా చిత్తూరు దాకా విస్తరించి ఉంది. కర్నూలులో రాజధాని ఏర్పాటు చేయాలనే భావన సహా తాము నిర్లక్ష్యానికి గురయ్యామనే భావన బలంగా ఉందన్న కమిటీ ఈ ప్రాంతంలో రాజధాని ఏర్పాటు సానుకూలతలను వివరించింది. ఇక మూడో రాజధాని ప్రాంతం కాళహస్తి.. ఇటీవలి రైల్వే బడ్జెట్‌లో.. కాళహస్తి-నడికుడి మార్గాన్ని ప్రస్తావించారని.. 300కిలోమీటర్ల దాకా సాగే ఈ మార్గంలో కృష్ణపట్నం, దుగరాజపట్నం వంటి కీలక పోర్టులను కలిపే అవకాశముందని కమిటీ తెలిపింది. ముఖ్య కార్యాలయాలు ఎక్కడెక్కడ.. అసెంబ్లీ, ముఖ్యమంత్రి కార్యాలయం, సచివాలయం, హైకోర్టు ఎక్కడ ఏర్పాటుచేయాలనే అంశంపైశివరామకృష్ణన్‌ కమిటీ పలు ప్రతిపాదనలు చేసింది. ఈ మూడు ఉండేదే రాజకీయ రాజధాని అవుతుందనే వాదన ఉన్నప్పటికీ అవసరమైనన్ని భూములు అందుబాటులో ఉంటేనే.. అది చక్కటి నమూనా అవుతుందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న ప్రత్యేక లక్షణం ప్రకారం...ప్రభుత్వ ఉనికి విభిన్న ప్రాంతాల్లో ఉండాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. అసెంబ్లీ, ముఖ్యమంత్రి కార్యాలయం, సచివాలయాలు సాధ్యమైనంత వరకు.. మార్టూరు, వినుకొండ, దొనకొండ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిన కమిటీ నివాస గృహాలతో సహా సీఎం కార్యాలయం, సచివాలయాలకు 300 ఎకరాలే అవసరమవుతుందని అంచనా వేసింది. శాసనసభ.., శాసనమండలి ఇక్కడ పెట్టినప్పటికీ..ఏడాదిలో కనీసం ఒక అసెంబ్లీ సమావేశం రాయలసీమలో నిర్వహించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఈ సంప్రదాయం ప్రస్తుతం కర్ణాటక, మహారాష్ట్రలో కొనసాగుతోందని గుర్తుచేసింది. హైకోర్టు ఎక్కడ.. హైకోర్టు ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి, హోంశాఖలకు ఓ నోట్‌ పంపిన కమిటీ అరకొర సౌకర్యాలతో హైకోర్టును మార్చడం తగదని ప్రస్తుత ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యక్తంచేసిన అభిప్రాయాలను గుర్తుచేసింది. హైకోర్టు సంబంధించి ప్రభుత్వం వద్ద మూడు ప్రత్యామ్నాయాలు ఉన్నాయన్న కమిటీ... ఒకటి రాష్ట్ర అసెంబ్లీ, సచివాలయంతోపాటు హైకోర్టును ఒకేచోట ఏర్పాటు చేయడం, రెండోది.. హైకోర్టును విశాఖపట్నంలో ఏర్పాటు చేయడమని పేర్కొంది. విశాఖలో ఇప్పటికే.. సంజీవయ్య నేషనల్‌ లా స్కూల్‌ ఉన్నట్లు కమిటీ గుర్తుచేసింది. హైదరాబాద్‌లో ఉన్న న్యాయ వ్యవస్థల్లో... కేవలం హైకోర్టు ఒక్కటే కాదని..దాంతోపాటు మరో 10 ట్రైబ్యునళ్లు,కమిషన్లు కూడా ఉన్నాయని... అవన్నీ రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థలో అంతర్భాగమని పేర్కొంది. జ్యూడీషియల్‌ అకాడమీ, హ్యూమన్‌రైట్స్‌ కమిషన్‌.., లోకాయుక్త, అడ్వాన్స్‌ ఇన్‌కంటాక్స్‌ రూలింగ్‌, స్టేట్‌ లీగల్ సర్విసెస్‌ను కూడా న్యాయవ్యవస్థలో అంతర్భాగాలుగా ఉన్నందున... వాటిని ఒకేచోట ఏర్పాటుచేయాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ప్రభుత్వ ముందున్న మూడో ప్రత్యామ్నాయం హైకోర్టు, ఇతర న్యాయసంస్థలను ఎక్కడ ఏర్పాటు చేసినా హైకోర్టు బెంచ్‌ మాత్రం..రాయలసీమలో ఏర్పాటు చేయడమని తెలిపింది. అన్నీ ఒక్క చోటే అవసరం లేదు.. అసెంబ్లీ, సచివాలయం ఏర్పాటైన చోటే హైకోర్టు ఉండడం తప్పనిసరేమీ కాదన్న కమిటీ..కేరళ, రాజస్థాన్‌, ఉత్తరాఖండ్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఉత్తరప్రదేశ్‌లలో.. హైకోర్టులు రాజధాని వెలుపల ఉన్నాయని గుర్తుచేసింది. ప్రస్తుతం హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా ఉండడం వల్ల హైకోర్టు, అసెంబ్లీ కార్యకలాపాల నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు లేవని ముఖ్యమంత్రి కార్యాలయం, వివిధ శాఖల కార్యదర్శులు, రోజువారీ విధి నిర్వహణలో సమస్యలు ఎదుర్కొంటున్నారని కమిటీ గుర్తుచేసింది. అందుకే సీఎం కార్యాలయం, కార్యదర్శుల కోసం.. ఆంధ్రప్రదేశ్‌లో యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని పేర్కొంది. సచివాలయం, కమిషనరేట్లు, డైరెక్టరేట్లన్నీ ఒకేచోట ఉండాల్సిన అవసరంలేదని అభిప్రాయపడిన కమిటీ... ఈ కార్యాలయాలను వికేంద్రీకరించాలని సూచించింది. దక్షిణ ఆంధ్రప్రదేశ్‌ ప్రాంతంలో గణనీయమైన మార్పు తీసుకురావడంలో...కాళహస్తి-నడికుడి ప్రాజెక్టు అత్యంత కీలకమైందని వివరించింది. రైల్వే శాఖ సహా కేంద్రంతో సంప్రదింపులు జరిపి.. తమకు కేటాయించిన ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానిదేనని.. స్పష్టం చేసింది. చంద్రబాబు సర్కార్ ఇప్పుడు ఏం చేస్తుంది..? రాష్ట్ర రాజధాని కచ్చితంగా రాష్ట్రం నిర్ణయించుకోవలసిన విషయమే. ఆ అధికారం దానికి ఉంది. కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ కేవలం సలహా కోసమే అన్న సంగతి కమిటీ వేసినప్పుడే చెప్పారు. ఈ రిపోర్ట్ ఇచ్చింది అల్లాటప్పా వ్యక్తులు కాదు.. తీసుకున్నది కొద్ది సమయమే అయనా.. కమిటీ చేసిన కసరత్తును, చిత్తశుద్దినీ శంకించలేం. అందులోనూ కమిటీ సభ్యులకు ఏపీతో ఎలాంటి అనుబంధం లేనందువల్ల.. వారిచ్చే నివేదిక.. అన్ని రకాలుగా రాగద్వేషాలను అతీతంగా ఉంటుంది. అందులోనూ సశాస్త్రీయంగా.. అన్నిరకాల వివరాలుతో ఇచ్చిన కమిటీ నివేదికను పక్కకుపెట్టే అధికారం చంద్రబాబు సర్కారుకు ఉన్నా.. అలా చేయడం వివాదాస్పదం కాక తప్పదు. కానీ.. కమిటీ చెప్పేది.. చంద్రబాబు ఆలోచనలకు పూర్తి విరుద్దంగా ఉంది. చంద్రబాబు ఆరు నూరైనా బెజవాడ-గుంటూరు ప్రాంతాన్నే రాజధాని చేయాలని పట్టుదలగా ఉంది. మరి ఈ పరిస్థితుల్లో చంద్రబాబు కమిటీ నిర్ణయాన్నిపరిగణనలోకి తీసుకుంటారా.. రాజకీయ వివాదంగా మారనుందా..? మరోవైపు ఇది రాజకీయ వివాదంగా కూడా మారే అవకాశం కనిపిస్తోంది. ఇన్నాళ్లూ దొనకొండను రాజధాని చేయాలని స్లో పిచ్ లో రాగం వినిపించిన జగన్ పార్టీ ఇక డోస్ పెంచవచ్చేమో.. మరి చంద్రబాబు సర్కారు ఈ విషమ పరిస్థితిని అధిగమిస్తుందా.. లేకపోతే.. కమిటీ నిర్ణయాన్ని గౌరవించి పునరాలోచన చేస్తుందా.. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చివరకు ఏ ప్రాంతానికి పట్టంకడతారు.. ఇవి ప్రస్తుతానికి జవాబు దొరకని ప్రశ్నలు.మరి వీటికి ఎలా సమాధానం దొరుకుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: