ఖరీఫ్‌ను కరువు కబళించింది. ఆగస్టు నెల ముగుస్తున్న ప్రస్తుత తరుణంలో ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా సాధారణ వర్షపాతంలో 38 శాతం లోటు కొనసాగుతోంది. పది లక్షల ఎకరాల్లో సాగు నిలిచిపోయింది. ఈపాటికి పల్లె సీమలు పంటలతో పచ్చగా ఉండాల్సి ఉండగా లక్షల ఎకరాలు బీడు పడ్డాయి. నైరుతి రుతుపవనాలు విఫలమై వారాలకు వారాలు వాన చినుకు జాడ లేదు. సుదీర్ఘ విరామం తర్వాత ఇప్పుడు అల్పపీడనం వలన రెండు రోజుల నుంచి అక్కడక్కడ జల్లులు పడుతున్నాయి. అయినప్పటికీ రాష్ట్రంలో తీవ్ర వర్షాభావం కొనసాగుతోంది. ఉత్తరకోస్తాలో కురవాల్సిన దానికంటే 36 శాతం తక్కువగా వర్షం కురిసింది. దక్షిణకోస్తాలో 46 శాతం వర్షపులోటు ఉంది. రాయలసీమలో 35 శాతం తక్కువ వర్షం పడింది. మామూలుగా నైరుతి కాలంలో ఎపిలో 554.3 మిల్లీమీటర్ల వర్షం పడాలి. జూన్‌ 1 నుంచి ఆగస్టు 27 మధ్య సాధారణ వర్షపాతం 382.3 మిమీ కాగా 236.7 మిమీ మాత్రమే నమోదైంది. ఉత్తరకోస్తాలో ఇప్పటి వరకు 515.2 మిమీ కురవాల్సి ఉండగా 330.5 మిమీ, దక్షిణకోస్తాలో 331.8 మిమీలకు 179.1 మిమీ, రాయలసీమలో 266.8 మిమీలకుగాను 173 మిమీ వర్షం పడింది. ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే సాధారణ స్థాయిలో వర్షం కురిసింది. తక్కిన 12 జిల్లాల్లో తీవ్ర వర్షాభావం ఉంది. తూర్పుగోదావరి, గుంటూరు ఈ రెండు జిల్లాల్లో గరిష్టంగా 54 శాతం లోటు వర్షం నమోదైంది. ఖరీఫ్‌ ప్రారంభం నుంచి సరైన వానల్లేక వ్యవసాయం స్తంభించింది. కృష్ణా, గోదావరి డెల్టాల్లో నీటి సమస్య ఉన్నా పరిస్థితి ఇప్పటికి కొంత ఫర్వాలేదనిపిస్తుంది. మెట్ట ప్రాంతాల్లో, ముఖ్యంగా రాయలసీమలో వాతావరణం పంటల సేద్యానికి ఎంతమాత్రం అనుకూలంగా లేదు. అడపాదడప పడుతున్న వర్షాలకు రైతులు విత్తనాలేసినప్పటికీ అనంతరం సుదీర్ఘకాలం చినుకు లేకపోవడంతో మొల్కలు పైకి రావట్లేదు. వచ్చినవి సైతం వర్షాభావం, వాతావరణంలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరడగంతో మాడిపోతున్నాయి. విద్యుత్‌ కోతల వలన మెట్ట ప్రాంతాల్లో పంపుసెట్ల కింద సేద్యం ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్నట్లు తయారైంది. ఖరీఫ్‌లో 104 లక్షల ఎకరాల్లో పంటలు సాగు కావాలి. ఆగస్టు 27 వరకు సాధారణంగా 80.1 లక్షల ఎకరాల్లో పంటల సేద్యం జరగాల్సి ఉండగా 70.55 లక్షల ఎకరాలల్లో జరిగింది. సుమారు పది లక్షల ఎకరాలు విత్తనం పడక పడావు పడ్డాయి. సాధారణ సాగులో 12 శాతం తగ్గింది. ఇప్పటి వరకు ఆహార పంటలు 37.12 లక్షల ఎకరాల్లో సాగు కావాల్సి ఉండగా 30.6 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. ఆరున్నర లక్షల ఎకరాల్లో (18 శాతం) సేద్యం తగ్గింది. ఆహార పంటల్లో ప్రధానమైన వరి 28.45 లక్షల ఎకరాలకు 24 లక్షల ఎకరాల్లో సాగైంది. నాలుగు లక్షల ఎకరాల్లో (15 శాతం) సాగు తగ్గింది. ముతకధాన్యాల్లో మొక్కజొన్న మాత్రమే కొంత ఆశాజనకంగా ఉంది. జొన్నలు, సజ్జలు, రాగులు, ఇతర చిరుధాన్యాల సాగు బాగా పడిపోయింది. పప్పుధాన్యాల సాగు 36 శాతం తగ్గింది. ఇప్పటి వరకు 5 లక్షల ఎకరాల్లో సాగు కావాల్సి ఉండగా 3.27 లక్షల ఎకరాల్లో రైతులు సాగు చేశారు. సాధారణ సాగులో 1.8 లక్షల ఎకరాలు తగ్గాయి. నూనెగింజల పరిస్థితీ అంతంతమాత్రంగానే ఉంది. ఇప్పటికి 27.6 లక్షల ఎకరాల్లో సాగు కావాల్సి ఉండగా 19.35 లక్షల ఎకరాల్లోనే సాగయ్యాయి. సాధారణ సాగులో 7.25 లక్షల ఎకరాల్లో (30 శాతం) తగ్గుదల కనబడుతోంది. వాణిజ్యపంటల్లో పత్తి, ఉల్లి సేద్యం ఆశించినస్థాయిలో ఉండగా తతిమ్మా పంటలు సాధారణ సాగు కంటే తక్కువే. కడప జిల్లాలో అత్యల్పంగా 39 శాతం విస్తీర్ణంలోనే పంటలు సాగయ్యాయి. కర్నూలులో మామూలు సాగు కంటే 37 శాతం అధికంగా జరిగింది. వర్షాభావం, విద్యుత్‌ కోతల వలన రాయలసీమ, ఇతర మెట్ట ప్రాంతాల్లో పంటలు ఎండుతున్నాయి. సాగు జరక్క రైతులు ఆందోళన చెందుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: