తెలుగు లోగిళ్లలో వినాయక చవితి తెచ్చినంత సందడి మరో పండుగతో రాదేమో.. చిన్నా పెద్దా అంతా సందడిగా జరుపుకునే పండుగ ఇది. వాడవాడలా వీధివీధినా ఇప్పుడు వినాయక ప్రతిమలు పూజలందుకుంటున్నాయి. ఒకప్పుడు ఈ సంస్కృతి కొన్నినగరాలకూ, పట్టణాలకే పరిమితమైన ఈ సంప్రదాయం ఇప్పుడు తెలుగునేత నలుచెరగులా పాకిపోయింది. వినాయకుడి విశేషమైన రూపంతో భక్తులకు ఓ సౌలభ్యం వినోదం ఉన్నాయి. రకరకాల విచిత్రమైన రూపాల్లో కనిపించడం ఒక్క లంబోదరుడే ఉందేమో. కేవలం దైవ ప్రార్థన పూజల కోసమే కాకుండా.. వినాయకుడిని తమ తమ వాదాలకు ప్రతిరూపంగా రూపొందించడం ఇటీవలి కాలంలో ఓ ఆనవాయితీగా మారింది. వినాయకుడిని శివపుత్రుడిగానే కాకుండా ఇతర దేవుళ్ల తరహాలోవిగ్రహాలు రూపొందించి ప్రత్యేకత చూపుతున్నారు. ఈ పరంపరలో భాగంగానేమో.. మెదక్ జిల్లా పటాన్ చెరులో 36 అడుగుల మట్టి విగ్రహాన్ని తయారు చేశారు. ఆ మంటపంలో ప్రత్యేక ఆకర్షణగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విగ్రహం ఏర్పాటు చేయడం అందరినీ ఆకర్షిస్తోంది. తెలంగాణ సాధించిన విజయగర్వంతో విక్టరీ సింబల్ చూపుతున్నట్టుగా ఉన్న కేసీఆర్ నిలువెత్తు విగ్రహాన్ని భక్తులు వింతగా చూస్తున్నారు. టీఆర్ఎస్ యువత రాష్ట్ర యువత అధ్యక్షుడు శ్రీధరాచారి ఆధ్వర్యంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. వినాయకుడితో పాటు ఈ నాయకుడేమిటా అని జనం ఆసక్తి చూపుతున్నారు. ఇందుకు శ్రీధరాచారి విచిత్ర వాదన వినిపించారు. దేశానికి స్వతంత్ర్యం తెచ్చిన గాంధీ తరహాలో.. కేసీఆర్ కూడా గొప్పనాయకుడని.. గాంధీని అక్కడక్కడా విగ్రహాల రూపంలో పూజిస్తున్నట్టుగానే తామూ ఇలా గణేశ్ మండపంలో పెట్టామని సమర్థించుకుంటున్నారు. మరికొందరు మాత్రం అభిమానం మరీ ఇంతగా ముదరడం మంచిది కాదంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: