బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాల్లో వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో జలాశయాలన్నీ నిండిపోయి జల విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించడంతో విద్యుత్ కోతలు తగ్గాయి. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల పరిధిలో జల విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించారు. గురువారం నుంచి అడపాదడపా కురుస్తున్న వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలన్నీ నిండిపోయాయి. భారీ వర్షానికి సికింద్రాబాద్ ప్రాంతంలోని బోయిగూడలోని రెండు ఇళ్లు కూలిపోయాయి. ఇండ్లు కూలిపోయిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. రంగారెడ్డి జిల్లా పరిధిలోని శంషాబాద్ మండల పరిధిలో భారీ వర్షానికి కేపీదొడ్డి, మల్కాపురం, సుల్తాన్‌పల్లి గ్రామాల్లోని ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. కేపీదొడ్డి, సుల్తాన్‌పల్లి, అమ్దాపూర్, మల్కాపురం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక శ్రీరాంనగర్, కవేలిగూడకు రాకపోకలు, విద్యుత్ సరఫరా నిలిచిపోయాయి. మరోవైపు నిజామాబాద్ జిల్లా పరిధిలోని నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టంతో నిండుకుండలా మారింది. దీంతో ప్రాజెక్టు ప్రధాన కాల్వా ద్వారా 1,560 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక్కడి జల విద్యుత్ కేంద్రంలో అధికారులు విద్యుదుత్పత్తి ప్రారంభించారు. రెండు టర్బైన్ల ద్వారా 5.5 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. నాగార్జున్ సాగర్‌కు ఎగువ ప్రాంతాల నుంచి వరద పోటెత్తడంతో కిందకు నీరు వదులుతున్నారు.నాగార్జున సాగర్ పూర్తి నిల్వ సామర్థ్యం 590 అడుగులు.  కాగా, ప్రస్తుతం 549 అడుగుల నీటిమట్టం నెలకొంది. 69 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా, కిందకు 12 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు పూర్తిగా నిండిపోవడంతో 17 గేట్లు ఎత్తివేసి 45 వేల క్యూసెక్కలు నీటిని విడుదల చేస్తున్నారు. బంగళాఖాతంలో ఏర్పడ్డ మరో అల్ప పీడనం ఉత్తరాంధ్ర వైపు కేంద్రీకృతమై ఉంది. దీనివల్ల వచ్చే 24 గంటల్లో తెలంగాణ, రాయలసీమ కోస్తా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తూర్పుగోదావరి జిల్లా ధవలేశ్వరం బ్యారేజీ వద్ద కూడా నీరు బయటకు విడుదల చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: