పవర్.. రాజకీయ నాయకులు చాలా ఇష్టమైన పదం. దీని కోసం వాళ్లు ఏమైనా చేస్తారు. అదే పవర్ కు ఇంకో అర్థం ఉంది. అదే విద్యుత్. ఇప్పుడు రైతులు కూడా ఈ పవర్ కోసం ఏమైనా చేసేలా ఉన్నారు. తెలంగాణలో విద్యుత్ పై ఆధారపడి సాగు చేసుకునే రైతులే ఎక్కువ. అలాంటిది పవర్ సంక్షోభంతో తెలంగాణ చాలా ఇబ్బందులు పడుతోంది. మొన్నటి దాకా ప్రియమైన నాయకుడు కేసీఆర్.. ఇప్పుడు ఏం చేయలేని నాయకుడుగా వారి కళ్లకు కనిపిస్తున్నాడు. అందుకే ఆ అపవాదు తప్పించుకునేందుకు అవసరమైతే పరిశ్రమలకు ఆపైనా సరే.. రైతులకు కరెంట్ ఇవ్వాలని కేసీఆర్ డిసైడయ్యారు. కేసీఆర్ ఆలోచనను విద్యుత్ అధికారులు మాత్రం తీవ్రంగా నిరసిస్తున్నారు. ఆ పని చేయాల్సిన సమయం దాటిపోయిందని ఆయనకు నచ్చచెబుతున్నారు. ఇప్పుడు పరిశ్రమలకు ఆపి సాగుకు కరెంటిచ్చినా పెద్దగా ఫలితం ఉండదని చెబుతున్నారు. ఈ చర్యతో అటు పరిశ్రమలు.. ఇటు వ్యవసాయం ఏదీ బాగుపడవని అంటున్నారు. ప్రస్తుతం పరిశ్రమలకు అమలు చేస్తున్న వారానికి ఒకరోజు విద్యుత్తు సెలవును రెండు రోజులకు పెంచాలని సర్కారు నిర్ణయించింది. అలాగే.. హైదరాబాద్‌లో అమలు చేస్తున్న 3 గంటల కోతల సమయాన్నీ మరింత పెంచాలనే అంశం.. ప్రభుత్వం అధికారులతో జరిపిన సమావేశంలో చర్చకు వచ్చింది. తెలంగాణలో ఇప్పుడిప్పుడే వానలు జోరందుకున్నాయి. వ్యవసాయ విద్యుత్తు డిమాండ్‌ గణనీయంగా తగ్గింది. సరైన సమయంలో సాగునీరు అందక ఇప్పటికే చాలాచోట్ల పంటలు ఎండిపోగా.. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు కొన్ని ప్రాంతాల్లోని పంటలకు ఊపిరిపోస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో పరిశ్రమలు, గృహావసరాలకు కోతలు విధించి సాగుభూములకు కరెంటు సరఫరా చేయడంవల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదని డిస్కంల అధికారులు ప్రభుత్వానికి స్పష్టం చేశారు. ఐతే విద్యుత్ శాఖ అధికారులు ఈ విషయంలో సరైన సలహా ఇవ్వలేదని టీఆర్ఎస్ వర్గాలు గుర్రుగా ఉన్నాయి. నెలరోజుల క్రితమే ఈ ఐడియా ఇచ్చి ఉంటే రైతుల్లో ఇంత వ్యతిరేకత వచ్చేది కాదని చెబుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: