శివరామకృష్ణన్ నివేదిక చంద్రబాబు సర్కారుకు కొత్త తలనెప్పులు తెచ్చిపెట్టింది. రాజధాని ఎక్కడో చెప్పండని ఆ కమిటీని నియమిస్తే.. అసలు ఎక్కడా అన్నీ పెట్టొద్దంటూ వెరైటీ సలహా ఇచ్చింది. ఎక్కడైనా పెట్టుకోండి కానీ.. బెజవాడ-గుంటూరు-పశ్చిమగోదావరి జిల్లాల్లో పెట్టొద్దని తెగేసి చెప్పింది. ఇప్పటికే బెజవా-గుంటూరు మధ్య ప్రాంతంలో రాజధాని పెట్టాలని మెంటల్ గా డిసైడైన బాబు గారిని ఈ నివేదిక ఇబ్బందిపెడుతోంది. గుడ్డిలో మెల్లగా నివేదికలో చంద్రబాబుకు ఊరట కలిగించే ఇంకో అంశం కూడా ఉంది. అదే.. కమిటీకి వచ్చిన మెయిళ్లు, అందులో రాజధానిపై వచ్చిన అభిప్రాయాలు చంద్రబాబు టీమ్ కు ఊరట కలిగిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విజయవాడ-గుంటూరు మధ్య ప్రాంతాన్నేఎక్కువ మంది ప్రజలు ఎంపిక చేశారు. రాజధాని నగరం ఎక్కడన్న విషయంపై ఈమెయిళ్లు, లేఖల ద్వారా మొత్తం 5వేల380 సలహాలు కమిటీకి అందాయి. నిర్ణీత గడువు మే 7 వరకు ఈ మెయిళ్ల ద్వారా 4వేల 999 మంది స్పందించారు. ఆ తర్వాత ఆగస్టు 20 వరకు మరో 317 మెయిళ్లు వచ్చాయి. ఇదే విషయాన్ని 64 మంది లేఖల ద్వారా తెలిపారు. ఒకటికి మించి అధికంగా మెయిళ్లు పంపినవారు చాలామందే ఉన్నారు. ఐతే కమిటీ మాత్రం ఒక్కో వ్యక్తి నుంచి ఒక్కో ఈమెయిల్‌నే పరిగణనలోకి తీసుకుంది. ఆప్షన్ చెప్పలేని వారిని పక్కన పెట్టింది. మొత్తంగా 4వేల 728 మంది అభిప్రాయాల్ని పరిగణలోకి తీసుకుంది. శివరామకృష్ణన్‌కు అందిన 4వేల 728 సలహాల్లో 1156 మంది విజయవాడ- గుంటూరు ప్రాంతం రాజధానిగా ఉండాలని సూచించారు. విజయవాడలోనే రాజధాని ఉండాలని 663 మంది..గుంటూరులో ఏర్పాటు చేయాలని 372 మంది అభిప్రాయపడ్డారు. మొత్తంగా చూస్తే...కృష్ణా, గుంటూరు జిల్లాల పరిథిలోనే రాజధాని ఉండాలంటూ..2191 మంది ఆ ప్రాంతంవైపే మొగ్గుచూపారు. రాజధానిపై తమ అభిప్రాయాల్ని స్పష్టంగా చెప్పలేని వారు 1037 మంది ఉన్నారు. 507 మంది విశాఖపట్నం రాజధానిగా ఉండాలని....166 మంది దొనకొండలో ఏర్పాటు చేయాలని కమిటీకి మెయిల్స్‌ పంపారు. చాలామంది రెండు, మూడు ప్రాంతాలను రాజధానికి అనువైనవిగా సూచించారు. కొంతమంది రెండు రాజధానుల్ని ఏర్పాటు చేయాలని చెప్పగా.. మరికొందరు మూడు, నాలుగు ప్రాంతాలను కూడా రాజధానులు సూచించారు. ఏదేమైనా శివరామకృష్ణకమిటీ చెప్పినట్టు రాజధాని విషయంలో చంద్రబాబు టీమ్ వినకపోయినా.. ప్రజాభిప్రాయం ప్రకారమే వెళ్లాం అని సమర్థించుకునే అవకాశం దక్కిందన్నమాట. ఇప్పుడు ఇదే విషయాన్ని హైలెట్ చేయమని ఇప్పటికే పార్టీ వర్గాలకు ఎన్టీఆర్ భవన్ నుంచి ఆదేశాలు వెళ్లాయట. ప్రతికూలతలో అనుకూలత వెదుక్కోవడమంటే ఇదే మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: