రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణలో తెలుగుదేశం భవిష్యత్తు పై రోజు రోజుకూ ప్రశ్నలు ఎదురవుతున్నాయి. తుమ్మల రాజీనామాతో పార్టీకి తెలంగాణలో బలమున్న ముఖ్యమైన జిల్లాలో దెబ్బతింటోంది. తలసాని కూడా గ్రేటర్ హైదరాబాద్ కార్పోరేషన్ ఎన్నికల నాటికి కారెక్కుతారన్న వార్తలు వినిపిస్తున్నాయి. వలసల నివారణకు పార్టీ గట్టి ప్రయత్నం కూడా చేస్తున్నట్లు కనిపించడం లేదు. తెలంగాణ తెలుగుదేశానికి స్వయం ప్రతిపత్తి ఇవ్వడం లేదు. పార్టీకి బలమైన నాయకత్వాన్ని కూడా చంద్రబాబు నియమించడం లేదని తెలుగు తమ్ముళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాలను తప్పు పట్టేటప్పుడు కూడా నేరుగా చంద్రబాబు, ఇతర ఆంధ్ర నేతలు విమర్శలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు ఇమిడి ఉన్న చోట మాట్లాడినా అర్ధం చేసుకోవచ్చు. కానీ, ఫీజుల చెల్లింపు, సర్వే లాంటి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశాలలో కూడా చంద్రబాబు, ఇతర ఆంధ్ర టిడిపి నేత కెసిఆర్ పై విమర్శులు ఎక్కు పెట్టడం తెలంగాణ తెలుగుదేశం నేతలకు ఇబ్బందిగా మారుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఏర్పడుతున్న వివాదాలలో ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను కాపాడేందుకు దూకుడుగా పార్టీ వ్యవహరిస్తోంది. అక్కడ అధికారంలో ఉండడంతో పార్టీకి తప్పడం లేదు. కానీ, ఆ దూకుడును పార్టీ అధ్యక్ష్యులే స్వయంగా ప్రదర్శించడం తమకు సమస్యగా మారుతోందని తెలంగాణ తెలుగుదేశం నేతలు చెప్పుకుంటున్నారు. అధినేతతో చెప్పలేక, తెలంగాణలో ఎదురుగాలిని ఎదుర్కోలేక తెలంగాణ టిడిపి నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఇంకా వలసలు పెరిగితే పార్టీ కార్యకర్తలలో మనోస్థైర్యం దెబ్బతింటుందన్న భయం వారిలో వ్యక్తం అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: