ఉద్యమపార్టీ అధికార పార్టీ అయ్యింది. పార్టీ అధినేత ముఖ్యమంత్రి అయ్యారు. పాలనా వ్యవహారాల్లో నిత్యం బిజీగా ఉంటున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో తీసుకెళ్లేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే... ఇప్పుడు పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దీంతో కారును సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లే బాధ్యతలను మరొకరి అప్పజెప్పే యోచనలో ఉన్నారు గులాబీ పెద్దలు. ఉద్యమపార్టీగా ప్రస్థానం మొదలుపెట్టి.. అధికారం పీఠాన్ని అధిష్టించింది తెలంగాణ రాష్ట్ర సమితి. పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. కొత్త రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో తీసుకెళ్లే పనుల్లో బిజీబిజీ అయిపోవడంతో.. పార్టీని పట్టించుకునేవారు కరువయ్యారు. దీంతో పార్టీని బలోపేతం చేయడంతో పాటు... క్ష్రేత్రస్థాయిలో అభివృద్ధి చేసేందుకు యోచిస్తున్నారు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. కొత్తగా రాష్ట్రం ఏర్పాటుకావడం, అనుభవజ్ఞులైన అధికారుల కొరత, అరకొర ప్రభుత్వ యంత్రాంగం, కొత్త పథకాలు, ప్రభుత్వ వ్యవహారాల్లో జాప్యం వంటివాటితో తీరిక లేకపోవడంతో పార్టీపై దృష్టిపెట్టలేకపోతున్నట్టుగా ఆయన భావిస్తున్నారు. అందుకే పార్టీ వ్యవహారాలు చూసుకునే బాధ్యతలు మరొకరికి అప్పగించే యోచనలో కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే దీనిపై కసరత్తు మొదలు పెట్టినట్టు సమాచారం. ప్రస్తుతం బడ్జెట్ కసరత్తులో బిజీగా ఉన్న కేసీఆర్ అది ముగియగానే.. పార్టీపై దృష్టిపెట్టనున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం పార్టీ కి కార్యనిర్వాహక అధ్యక్షుడిని నియమించే యోచనలో కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో వర్కింగ్ ప్రెసిడింట్ ను నియమిస్తే... పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే అవకాశం ఉంటుందని యోచిస్తున్నారు. అయితే ఎవరిని నియమించాలనే దానిపైనే తీవ్రంగా యోచిస్తున్నట్టు సమాచారం. పార్టీలోని సీనియర్లకు ఈ బాధ్యతలు అప్పగించాలా..? లేక మరెవరికైనా అప్పగించాలా అనే అంశంపై జోరుగా చర్చజరుగుతున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే కేసీఆర్ కుటుంబసభ్యల్లోనే ఎవరో ఒకరిని ఈ పదవి వరించనుందనే చర్చ కూడా పార్టీ శ్రేణుల్లో జోరుగా సాగుతోంది. మొత్తం మీద రాష్ట్రాభివృద్ధితో పాటు పార్టీ బలోపేతంపైనా సీఎం దృష్టి సారించారు. పార్టీని పటిష్టం చేయడం ద్వారా ప్రతిపక్షాలకు సింహస్వస్నంలా మారాలని కేసీఆర్ చూస్తున్నట్టు కనబడుతోంది. అయితే.. కారును నడిపించే కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరనేది తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: