ఆంధ్రప్రదేశ్ రాజధానిగా దొనకొండ పేరు ప్రతిపాదించడం వెనుక సచివాలయంలో పనిచేస్తున్న ఓ ఐఏఎస్ అధికారి ప్రమేయముందని నరసరావుపేట టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఆరోపించారు. అందుకే శివరామకృష్ణన్ కమిటీ ఆ ప్రాంతంలో పర్యటించకుండానే దొనకొండను రాజధానిగా ప్రతిపాదించిందని మండిపడ్డారు. గుంటూరు జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆయన... ఆ సీనియర్ ఐఏఎస్ అధికారికి దొనకొండలో వేలాది ఏకరాలు భూములున్నాయని, ఆయన సూచనల మేరకే శివరామకృష్ణన్ కమిటీ ఆ ప్రాంతాన్ని రాజధానిగా చేయాలని సూచనలు చేసిందని విరుచుకుపడ్డారు. వెనుకబడ్డ పల్నాడులో వేలాది ఎకరాల ప్రభుత్వ భూములున్నా కమిటీ ఇక్కడ పర్యటించకపోవడాన్ని రాయపాటి ఆక్షేపించారు. ఏదిఏమైనా విజయవాడ- గుంటూరు మధ్యే రాజధాని ఉంటుందని రాయపాటి అన్నారు. రాయపాటి ఆరోపణలపై రాజకీయ పార్టీల్లో చర్చ జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: