ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధానిని విజయవాడ సమీపంలోనే ఏర్పాటుచేయాలని మంత్రిమండలి నిర్ణయించినట్లు సమాచారం. రైతులు ముందుకొస్తే మంగళగిరిలోనూ, రానిపక్షంలో నూజివీడు వైపు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రాజధాని ఎక్కడ ఏర్పాటు చేస్తారన్న అంశంపై ముఖ్యమంత్రి ఎన్‌.చంద్రబాబు నాయుడు మంగళవారం శాసనసభలో ఒక ప్రకటన చేసే అవకాశం వుంది. రాష్ట్ర మంత్రిమండలి సమావేశం లేక్‌వ్యూ అతిథి గృహంలో సోమవారం ఐదున్నర గంటల పాటు సుదీర్ఘంగా జరిగింది. ప్రధానంగా శివరామకృష్ణన్‌ కమిటీ నివేదికపైన చర్చ జరిగింది. సమావేశ వివరాలను గోప్యంగా వుంచాలని మంత్రులకు ముఖ్యమంత్రి ఆదేశించారు. మంగళవారం అసెంబ్లీ వున్నందున సమావేశ వివరాలను బయటకు చెప్పవద్దని ఆయన స్పష్టంచేసినట్లు సమాచారం. దాంతో సమావేశం ముగిసిన అనంతరం మీడియా ముందుకు రాకుండా మంత్రులు తమ తమ వాహనాల్లో ఇళ్లకు వెళ్లిపోయారు. నవ్యాంధ్ర రాజధానిపై సుదీర్ఘ మథనం మంత్రిమండలి సమా వేశంలో జరిగింది. రాజధాని ఏర్పాటుకుగాను భూసేకరణ కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేయాలని మంత్రిమండలి నిర్ణయించినట్లు తెలిసింది. ఈ కమిటీలో ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, మున్సిపల్‌ శాఖమంత్రి డాక్టర్‌ కె.నారాయణతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజాప్రతినిధులు సభ్యులుగా వుంటారని తెలుస్తోంది. రాజధానికి సంబంధించి పత్రికల్లో, టీవి ఛానెళ్లల్లోనూ పలువురు నేతలు రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారని, దాంతో ప్రజానీకం గందరగోళానికి గురవుతున్నదని, గందరగోళానికి ఫుల్‌స్టాప్‌ పెట్టాలని పలువురు మంత్రులు ముఖ్యమంత్రిని మంత్రిమండలి సమావేశంలో కోరినట్టు సమాచారం. పాలన వికేంద్రీకరణ సాధ్యం కాదని కూడా పలువురు మంత్రులు అభిప్రాయ పడినట్లు తెలిసింది. ప్రజల సౌకర్యార్థం రాష్ట్రం మధ్యలోనే రాజధాని వుండాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడుతున్న విషయం తెలిసిందే. దాంతో విజయవాడ-గుంటూరుల మధ్యనే రాజధాని నిర్మిస్తారని ఊహాగానాలు బలంగా సాగుతున్న నేపథ్యంలో శివరామకృష్ణన్‌ కమిటీ నివేదిక దానికి భిన్నంగా వచ్చింది. అయితే, ఆ నివేదికపై ప్రభుత్వం సుముఖంగా లేనట్లు సమాచారం. ఇప్పటికే విజయవాడను తాత్కాలిక రాజధానిగా ప్రభుత్వం ప్రకటించింది. రాజధాని ఏర్పాటు విషయంపై ఆయా ప్రాంతాల మంత్రుల భిన్నాభిప్రాయాలు స్పష్టంగా వినిపిస్తున్నాయి.  దాంతో అందరిని ఏకతాటిపై తెచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రిమండలి సమావేశంలో తీవ్రంగా కృషిచేసినట్లు తెలిసింది. రాజధాని ఏర్పాటుకు సంబంధించి మున్సిపల్‌ శాఖమంత్రి డాక్టర్‌ పి.నారాయణ నేతృత్వంలో ఒక కమిటీని ఇప్పటికే ప్రభుత్వం నియమించింది. తాజాగా ఒక దశలో శివరామకృష్ణన్‌ కమిటీ నివేదికను అధ్యయనం చేయడానికి మరో మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటుచేయాలన్న ప్రతిపాదన కూడా సమావేశంలో చర్చకు వచ్చింది. డాక్టర్‌ నారాయణతో పాటు ఉప ముఖ్యమంత్రి కె.ఇ.కృష్ణమూర్తి, వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు తదితరులతో ఉపసంఘాన్ని ఏర్పాటుచేయాలని కూడా సమావేశం యోచించింది. రాజధాని ఎక్కడనేది మీరే నిర్ణయించాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును మంత్రులందరు ఏకాభిప్రాయంతో మంత్రిమండలి సమావేశంలో కోరినట్లు సమాచారం

మరింత సమాచారం తెలుసుకోండి: