2014 సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఎప్పుడైనా మార్పులు చోటు చేసుకోవచ్చునని రాజకీయ పరిశీల కులు ఊహించారు. అయితే పరిశీలకులు ఊహించ ని రీతిలో అత్యంత వేగంగా రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నిరాశాజనక ఫలితాలను సాధించడం కాంగ్రెస్‌ అధికారంలోకి రాకపోవడం బంగారు తెలంగాణ నిర్మాణం పేరుతో టిఆర్‌ఎస్‌ అధికారంలోకి రావడం- ఈ రాజకీయ సమీకరణలు కారణం అవుతోంది. తెలుగుదేశంలో వర్గపోరు కారణంగా మాజీమంత్రి, ఆపార్టీ సీనియర్‌ నేత తుమ్మల నాగేశ్వరరావు టిడిపికి రాజీనామా చేశారు. మూడు దశాబ్దాల రాజకీయ అనుబంధాన్ని తెంచుకుని తన సహచరులతో టిఆర్‌ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. శాసన మండలి సభ్యులు బలసాని లక్షీëనారాయణ, టిడిపి జిల్లా అధ్యక్షులు, మాజీ శాసన సభ్యులు కొండబాల కోటేశ్వరరావు, జడ్‌పి ఛైర్‌పర్సన్‌ గడిపల్లి కవిత, డిసిసిబి, డిసిఎంఎస్‌ ఛైర్మన్లు ఇప్పటికే పార్టీకి రాజీ నామా చేశారు. గత రెండు రోజులుగా జిల్లా వ్యాప్తంగా ఉన్న తన అనుచరులతో రాజీనామా చేసిన నేతలు మంతనాలు జరుపుతున్నారు. టిడిపిలో దాదాపు 80శాతానికి పైగా కార్యకర్తలు టిఆర్‌ఎస్‌లో చేర్పించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. జడ్‌పిటిసి సభ్యులు, ఎంపిపిలు వివిధ హోదాల్లో కొనసాగుతున్న నేతలను వలస బాట పట్టించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇదే జరిగితే టిడిపి బాగా బలహీన పడే అవకాశం ఉంది. ఇక వైసిపిలోనూ వలసలు ఊపందుకున్నాయి. తాజాగా వైరా శాసనసభ్యులు బానోతు మదన్‌లాల్‌ టిఆర్‌ఎస్‌ తీర్ధం పుచ్చుకోగా పార్టీలో ద్వితీయశ్రేణి నాయకత్వం కూడా టిఆర్‌ఎస్‌ వైపు చూస్తున్నారు. వైసిపిలో మిగిలిన ఇద్దరు శాసనసభ్యులు కూడా టిఆర్‌ఎస్‌లోకి చేరుతారన్న ఊహగానాలు ఊపందుకున్నాయి. ఇక కాంగ్రెస్‌కు నలుగురు శాసనసభ్యులు ఉండగా ఒకరు పార్టీని వీడి టిఆర్‌ఎస్‌ తీర్ధం పుచ్చుకున్నారు. ఎన్నికల సమయంలో తెలంగాణా రాష్ట్రంలోని పదిజిల్లాలలో ఖమ్మంజిల్లాలోనే సరైన ఫలితాలను రాబట్టలేక పోయింది. కొత్తగూడెం అసెంబ్లీస్థానం నుండి టిఆర్‌ఎస్‌ అభ్యర్థిగా జలగం వెంకట్రావు ఒక్కరే విజయం సాధించారు. మిగిలిన 9 స్థానాల్లో టిఆర్‌ఎస్‌కు డిపాజిట్‌ దక్కలేదు. ఇద్దరు మాజీ శాసనసభ్యులు పోటీ చేసినప్పటికీ డిపాజిట్‌ కోల్పోయారు. ఎన్నికల అనంతరం వలసలు పెరుగుతుండడంతో టిఆర్‌ఎస్‌ బలపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆ పార్టీకి జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నట్లయ్యింది. తుమ్మల, ఆయన అనుచరులు రాకతో పార్టీ మరింత బలపడే అవకాశం ఉంది. వైఎస్‌ఆర్‌సిపి, కాంగ్రెస్‌, టిడిపిలు బలహీన పడడంతో జిల్లా రాజకీయ ముఖచిత్రంలో స్పష్టమైన మార్పు కనపించనుంది. స్థిరమైన రాజకీయాలకు ఆదినుండి ఖమ్మంజిల్లా పెట్టింది పేరు. 1980 దశకంలో ఎన్‌టి.రామారావు ప్రభంజనం సైతం ఇక్కడ రాజకీయ పునాదులను కదిలించలేకపోయింది. కమ్యూనిస్టులకు బలమైన కేంద్రంగా ఉన్న జిల్లాలో రాజకీయ మార్పులకు సహజంగా తావు ఉండదు. ఇంతటి రాజకీయ మార్పులు గతంలో ఎన్నడు చోటు చేసుకోలేదు. టిడిపిలో ఒక దశాబ్దకాలంగా ఇరువురు నేతల మధ్య నలిగిన పోరు ఈ సమీకరణల్లో మార్పుకు కారణమైంది. టిడిపిలో ఒకవర్గం నేతగా ఉన్న మాజీ ఎంపి నామనాగేశ్వరావును టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సమర్ధిస్తున్నారన్న కారణంతో తుమ్మల నాగేశ్వరరావు వర్గం వలసబాట పట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: