వైఎస్సార్ పార్టీ అధ్యక్షుడు జగన్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఎప్పుడు పడితే అప్పుడు బెంగళూరు వెళ్లేందుకు ఆయన కోర్టులో పెట్టుకున్న అభ్యర్థనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. ఈ సందర్భంగా ఘాటు వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. జనం ఆస్తులు కొల్లగొట్టి వేల కోట్ల రూపాయలు అక్రమంగా ఆర్జించారన్న ఆరోపణలతో కూడిన పది కేసులు జగన్ పై విచారణలో ఉన్న సంగతి తెలిసిందే. తీవ్రమైన ఆరోపణలు ఉన్నందువల్ల ముందస్తు అనుమతి లేకుండా ఎప్పుడుపడితే అప్పుడు బెంగళూరు వెళ్లేందుకు అనుమతి ఇవ్వలేమని కోర్టు తేల్చి చెప్పింది. అంతే కాదు... దొడ్డిదారిన అనుమతులు పొందే ప్రయత్నం చేయొద్దని తీవ్రంగా కామెంట్ చేసింది. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షపార్టీ నేతగా ఉన్నజగన్ కు అవినీతి ఆరోపణల కేసులు కాళ్లకు బంధాలుగా మారాయి. ఆయన హైదరాబాద్ దాటి ఎక్కడకు వెళ్లాలన్నా ముందస్తు అనుమతి తీసుకోవాల్సిందే. ఈ మేరకు సీబీఐ కోర్టు షరతులు విధించిన తర్వాతే బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత జగన్ పెట్టుకున్న అభ్యర్థన మేరకు ఏపీ అంతటా ముందస్తు అనుమతి లేకుండా వెళ్లే వెసులు బాటు పొందారు. అలాగే ఢిల్లీ వెళ్లేందుకు కూడా ఎలాంటి అనుమతి అవసరం లేదు. కాకపోతే ఇతర రాష్ట్రాలకు వెళ్లాలంటే మాత్రం కోర్టు అనుమతి అవసరమే. జగన్ కు బెంగళూరుతో అనుబంధం ఎక్కువ. అక్కడ బ్రహ్మాండమైన పాలస్ తో పాటు వ్యాపారాలూ ఉన్నాయి. బంధువర్గమూ ఉంది. అందుకే తనకు బెంగళూరు వెళ్లే వెసులు బాటు కూడా కల్పించాలని జగన్ కోర్టును వేడుకున్నారు. కానీ కోర్టు అంగీకరించలేదు. అలాంటి వెసులు బాటు కల్పిస్తే.. అది విచారణకు అడ్డంకని తేల్చి చెప్పింది. జగన్ ఎప్పుడు అనుమతి అడిగినా... ఇచ్చామని ఎన్నడూ నిరాకరించలేదని గుర్తు చేశారు. ఇక ముందు కూడా ముందస్తుగా అనుమతి కోరితే తప్పకుండా ఇస్తామని చెప్పింది. కానీ.. షెడ్యూలు చెప్పకుండా ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తామంటే మాత్రం కుదరదని తెగేసి చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: