చంద్రబాబు మంచి పరిపాలనాదక్షడు. చక్కటి రాజనీతిజ్ఞుడు. మాంచి రాజకీయ చాణక్యుడు. ఇలా చెప్పుకుంటూ పోతే బాబు గారి గురించి టీడీపీ నేతలు చాలా చెబుతారు. వారి మాటల్లో మరీ అసత్యాలేమీ లేవు. కాస్తో కూస్తో వాస్తవం ఉంది. కాకపోతే.. ఆయన కాలంలో కరవు మాత్రం కరాళ నృత్యం చేసింది. బాబు కు అధికారం వస్తే ఇక వానలు రావు. మళ్లీ కరవు ఖాయమే అని ఎన్నికల ముందు చాలామంది గిట్టనివారు చాలా చెప్పారు. అందుకు తగ్గట్టుగానే బాబు గారు అధికార పీఠం ఎక్కగానే ఆ విమర్శలను నిజం కాకతప్పదేమో అనే రేంజ్ లో వర్షాలు కూడా ముఖం చాటేశాయి. ప్రకృతి పగబట్టిందా అన్నట్టు మళ్లీ చాలా రోజుల తర్వాత రాష్ట్రానికి కరవు తప్పదని అంతా అనుకున్నారు. టీడీపీ నేతలు కూడా అలాగే ఫిక్సయ్యారు. ఏం చేస్తాం మన బ్యాడ్ లక్ అని తమ దురదృష్టాన్ని తిట్టుకున్నారు. ఇదెక్కటి ఖర్మరా బాబు.. అధికారం చేతికొచ్చినా.. ఇదేం అప్రదిష్టరా బాబూ అని సాక్షాత్తూ బాబుగారే తలపట్టుకోవాల్సిన పరిస్థితి. అదను తప్పింది. నారుమళ్లు ఎండిపోతున్నాయి. ఏరువాక మొదలై నెల దాటినా వానజాడలేదు. రిజర్వాయర్లో నీటి నిల్వలు రోజురోజుకూ తగ్గిపోతున్నాయి. సాగునీరు దేవుడెరుగు.. తాగు నీటికీ కటకట తప్పదేమో అని సాధారణ జనం.. ఇక మన పనైపోయిందని రైతులంతా అనుకుంటున్న సమయంలో వరుణుడు ఒక్కసారిగా కరుణించాడు. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు జల్లులా మొదలై.. జల పరవళ్లకు దారి తీశాయి. ఒకరోజు.. రెండు రోజులు.. మూడు రోజులు.. ఇలా వర్షాలు కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రం పచ్చబడింది. జలాశయాలు నిండిపోతున్నాయి. శ్రీశైలానికి వరద పోటెత్తింది. నాగార్జునసాగరం వైపు కృష్ణమ్మ బిరబిరామంటూ పరుగులు తీస్తోంది. రైతన్నల మోముల్లో మళ్లీ సంతోషం వెల్లివిరిసింది. ఈ పరిణామాలతో టీడీపీ నేతలు ఖుషీగా ఉన్నారు. మొత్తానికి ఈ వర్షాలతో ఈ ఏడాదిసాగుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు కాబట్టి.. చంద్రబాబుపై ఉన్నబ్యాడ్ నేమ్ కు ఆస్కారం ఉండదని భావిస్తున్నారు. మొత్తానికి ఈ ఏడాదికి అలా చంద్రబాబు బతికిపోయారన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి: