పేద, బడుగు, బలహీన వర్గాలతోపాటు రైతులను ఆదుకోవడంలో టిఆర్‌ఎస్ సర్కార్ ఘోరంగా విఫలం చెందిందని తెలంగాణ పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. సోమవారం మెదక్ జిల్లా గజ్వేల్‌లో జరిగిన సభలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 7 లక్షల ఎకరాల భూ పంపిణీ చేయగా, నేటి వరకు ఒక్క ఎకరమైనా దళితులకిచ్చావా? అని నిలదీశారు. ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా వ్యవహరిస్తున్న కెసిఆర్ ప్రజాగ్రహాన్ని తట్టుకోలేకనే మభ్యపెట్టే మాటలు, గారడీలతో ప్రజలను లోబర్చుకుంటూ కాకమ్మకథలు చెబుతున్నారని విమర్శించారు. పంట రుణాల మాఫీపై స్పష్టత ఇవ్వని ఆయన కమిటీలు, నిబందనల పేరిట కాలయాపన చేసి చివరకు ఎన్నికలు ముంచుకు రాగానే అర్హుల లిస్టుల పేరిట కొత్త నాటకానికి తెరలేపినట్లు స్పష్టం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. 2004లో తాము అధికారం చేపట్టిన వెంటనే ఉచిత విద్యుత్ ఫైల్‌పై సంతకం చేస్తూ 30లక్షల మంది రైతులకు ప్రయోజనం కలిగేలా చర్యలు చేపట్టి రూ1240కోట్ల బకాయలు మాఫీ చేస్తూ లక్షా 50వేల కేసులను ఉపసంహరించుకున్నట్లు తెలిపారు. పిసిసి మాజీ చీఫ్ డి శ్రీనివాస్ మాట్లాడుతూ పార్లమెంటులో తెలంగాణ అంశంపై ఏ ఒక్కసారి మాట్లాడని కెసిఆర్ తానే ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చినట్లుగా గొప్పలు చెప్పుకుంటుండడం సిగ్గుచేటన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడిన త్యాగ శీలి సోనియాగాంధీతోనే తెలంగాణ సిద్ధించినట్లు స్పష్టం చేశారు. అయితే కాంగ్రెస్‌లో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తుండగా, మెదక్ నుండి ఇందిరాగాంధీ ప్రాతినిత్యం వహించిన సంఘటన దృష్టిలో పెట్టుకొని ఉప ఎన్నికల్లో సునీతారెడ్డి అభ్యర్థిత్వాన్ని ప్రకటించినట్లు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: