ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని ఏర్పాటుపై అసెంబ్లీలో మంగళవారం ముఖ్యమంత్రి ఎన్‌.చంద్రబాబునాయుడు చేయాల్సిన ప్రకటన అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. గురువారం ఆయన ప్రకటన చేసే అవకాశముంది. ప్రకటన తయారు పూర్తికాకపోవడం కారణమని తెలుస్తోంది. రాజధానిపై వాయిదా తీర్మానానికి మంగళవారం నోటీసును స్పీకర్‌ కోడెల శిప్రసాదరావుకు వైఎస్‌ఆర్‌సిపి అందజేసింది. నోటీసును తిరస్కరిస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు. దీనిపై ముఖ్యమంత్రి ఒక ప్రకటన చేస్తారని స్పీకర్‌ ప్రకటించారు. టీ విరామ సమయం అనంతరం ఆయన ప్రకటన చేస్తారని అందరూ భావించారు. అయితే ప్రకటన తయారీలో జాప్యం జరిగింది. అలాగే డా.వైఎస్‌.రాజశేఖరరెడ్డి 5వ వర్థంతి కావడంతో ప్రతిపక్ష నాయకుడైన వైఎస్‌.జగన్మోహ న్‌రెడ్డి కడపలోని ఇడుపులపాయకు వెళ్లడంతో ప్రతిపక్ష నాయకుడు లేకుండా సభలో ప్రకటన చేయటం కూడా భావ్యం కాదని చంద్రబాబు భావించినట్లు సమాచారం. ఈ రెండు కారణాలతో పాటు ఈ రోజు అష్టమి కావడం, అది మంచి రోజు కాకపోవడం ప్రధాన కారణమని తెలుస్తోంది. అందువలన గురువారం దశమి రోజు ముఖ్యమంత్రి ప్రకటన చేస్తారని తెలుస్తోంది. రాష్ట్ర విభజనకు సంబంధించిన ఫైల్‌పై అమావాస్య నాడు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ సంతకం చేశారని, కనీసం రాజధానిపైనైనా మంచిరోజు చూసి ప్రకటన చేద్దామని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు తెలిసింది. కాగా తాత్కాలిక రాజధాని విజయవాడలో ఏర్పాటు చేయాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలను ముమ్మరం చేసింది. విజయవాడలో కార్యాలయాల ఏర్పాటుపై అన్ని విభాగాల శాఖాధి పతులకు ప్రభుత్వం సర్క్యూలర్‌ జారీ చేసింది. కార్యా లయాల ఏర్పాటుకు ఎంత మేరకు స్థలం అవసరమ వుతుందో ప్రతిపాదనలు పంపాలని ఆదేశించింది. సోమవారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో విజయవాడ సమీపంలో రాజధానిని ఏర్పాటు చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: